ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ముసాబ్ అబు తోహా కవిత్వం గురించి అతని వేదన గురించి తెలుసుకోవాల్సిందే. ముసాబ్ అబు తోహా పాలస్తీనాకు చెందిన ప్రముఖ యువ కవి, విద్యావేత్త , లైబ్రేరియన్, వ్యాసకర్త. ముసాబ్ 1992లో గాజాలో జన్మించారు. ఆయన గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందారు. ప్రస్తుతం ముసాబ్ అబు తోహా అమెరికాలో నివసిస్తున్నారు సిరక్యూస్ యూనివర్సిటీలో విజిటింగ్ స్కాలర్‌గా ఉన్నారు.
గాజాలో మొట్టమొదటి ఆంగ్ల భాషా ప్రజా గ్రంథాలయాన్ని స్థాపించిన వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. యుద్ధం, ఆంక్షల మధ్య ఉన్న యువతకు ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేయాలనేది ఆయన లక్ష్యం.ఆయన రాసిన ‘‘థింగ్స్ యూ మే ఫైండ్ హిడ్డెన్ ఇన్ మై ఇయర్: పోయెమ్స్ ఫ్రమ్ గాజా’’ అనే కవితా సంపుటి అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది ‘అమెరికన్ బుక్ అవార్డ్’, ‘పాలస్తీనా బుక్ అవార్డ్’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను గెలుచుకుంది. 2024లో ఆయన ‘‘ఫారెస్ట్ ఆఫ్ నాయిస్” అనే తన రెండో కవితా సంపుటిని విడుదల చేశారు. ఇది కూడా ప్రస్తుతం సాహిత్య లోకంలో చర్చనీయాంశంగా మారింది
‘థింగ్స్ యూ మే ఫైండ్ హిడ్డెన్ ఇన్ మై ఇయర్’ అన్న కవితలో ముసాబ్ ఒక వైద్యుడిని సంబోధిస్తూ (డాక్టర్ ఎలిసియా క్వెస్నెల్) తన చెవిలో ఉన్న సమస్యను పరీక్షించమని కోరుతూనే, తన గుండెలో గూడుకట్టుకున్న యుద్ధ బీభత్సాన్ని కవిత్వీకరించారు. బాంబుల శబ్దాల వల్ల తన వినికిడి శక్తి తగ్గుతున్నా, తన బాల్యపు జ్ఞాపకాలు, తన మాతృభూమి పట్ల ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఆయన ఈ కవిత ద్వారా చాటిచెప్పారు. ఆ కవిత ఇలా ఉంటుంది
నా చెవిలో దాగి ఉన్నవి నా చెవిని తెరిచినప్పుడు, దానిని మెల్లగా తాకండి. నా తల్లి స్వరం ఎక్కడో లోపల నిలిచి ఉంది. నేను ఏకాగ్రత కోల్పోయి కళ్లు తిరిగితే, తిరిగి నన్ను నిలబెట్టే ప్రతిధ్వని ఆ గొంతుక. మీకు అక్కడ అరబిక్ పాటలు, నాకు నేనే చదువుకునే ఆంగ్ల కవితలు, వినిపించవచ్చు మా పెరట్లోని పక్షుల కిలకిలారావాలతో కలిసి నేను పాడే పాటని మీరు ఆస్వాదించవచ్చు
డాక్టర్ ఆ గాయాన్ని కుట్టేటప్పుడు, వీటన్నింటినీ మళ్ళీ నా చెవిలో ఉంచడం మర్చిపోకండి. మీ బీరువాలో పుస్తకాలను సర్దినట్టుగా,
వాటన్నింటినీ వరుస క్రమంలో అమర్చండి.
డ్రోన్ల హోరు, ఎఫ్–16 యుద్ధ విమానాల గర్జన, ఇళ్ల మీద, పొలాల మీద, మనుషుల మీద కూలుతున్న బాంబుల కేకలు, దూసుకుపోతున్న రాకెట్ల శబ్దాలని నా చిన్న చెవి నాళం నుండి తొలగించండి. మీరు చేసిన ఆ కోత మీద మీ చిరునవ్వుల పరిమళాన్ని చల్లండి. నన్ను నిద్రలేపడానికి నా నరాల్లోకి జీవన గీతాన్ని ఎక్కించండి. నా మనసు మీ మనసుతో కలిసి నాట్యం చేసేలా, మెల్లగా నా చెవి లోని డ్రమ్‌ని వాయించండి
ఓ డాక్టర్!
ఈ కవితలో ముసాబ్ ఒక వైద్యుడిని సంబోధిస్తూ, తన చెవిలో ఉన్న సమస్యను పరీక్షించమని కోరుతూనే, తన గుండెలో గూడుకట్టుకున్న యుద్ధ బీభత్సాన్ని కవిత్వీకరించారు. బాంబుల శబ్దాల వల్ల తన వినికిడి శక్తి తగ్గుతున్నా, తన బాల్యపు జ్ఞాపకాలు మాతృభూమి పట్ల ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఆయన ఈ కవిత ద్వారా చెప్తారు. ముసాబ్ అబు తోహా రాసిన కవితల్లో మరొక శక్తివంతమైన, హృదయాన్ని కదిలించే కవిత ‘‘నా తాతయ్య -ఇల్లు’’. ఈ కవితలో ఆయన తన మూలాలను, తన తాతయ్య జ్ఞాపకాలను తాను కోల్పోయిన మాతృభూమిని ఎలా వెతుక్కుంటున్నారో అద్భుతంగా వివరిస్తారు ఆ కవిత ఇలా కొనసాగుతుంది.
మా తాత - ఇల్లు
తన ఇంటికి తిరిగి వెళ్లడానికి మా తాత రోజులని తన వేళ్లతో లెక్కపెట్టుకునేవాడు ఆ తర్వాత రాళ్లను ఉపయోగించి లెక్కించాడు
అవి సరిపోలేదని మేఘాలను, పక్షులను, మనుషులను లెక్కించాడు ఆయన ఎడబాటు చాలా సుదీర్ఘమైపోయింది ఆయన చనిపోయేటప్పుడు ముప్పై ఆరేళ్లు మాకైతే ఇప్పుడు డెబ్బై ఏళ్లు దాటిపోయింది మా తాత తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు అంకెలను, మనుషులను మరిచిపోయాడు తన ఇంటిని కూడా మరిచిపోయాడు.
నేను నీతో ఉంటే బాగుండేది తాత నీ కోసం కవితలు రాయడం నేర్చుకునేవాడిని, ఎన్నో సంపుటాలు.. తెచ్చే వాడిని నీ కోసం మన ఇంటిని అలంకరించేవాడిని ఈ మట్టిలో మొక్కలతో వస్త్రంలా కుట్టేవాడిని నువ్వు పెంచిన చెట్లతో అలంకరించేవాడిని నారింజ పండ్ల నుండి నీకు పరిమళాన్ని, ఆకాశపు ఆనంద బాష్పాలతో నీకు సబ్బును తయారు చేసేవాడిని అంతకంటే స్వచ్ఛమైనది నాకు ఏదీ తట్టలేదు.
నేను ప్రతిరోజూ స్మశానానికి వెళ్తాను నీ సమాధి కోసం వెతుకుతాను, కానీ, అది దొరకదు నిన్ను ఖననం చేశారని వారు కచ్చితంగా చెప్పగలరా? నువ్వు ఒక చెట్టుగా మారావా? బహుశా ఒక పక్షితో కలిసి ఏ శూన్యంలోకో ఎగిరిపోయావా?
నీ ఫోటోను ఒక మట్టి పాత్రలో ఉంచాను ప్రతి సోమవారం, గురువారం సూర్యాస్తమయ సమయంలో దానికి నీళ్లు పోస్తాను
ఆ రోజుల్లో నువ్వు ఉపవాసం ఉండేవాడివని నాకు చెప్పారు రమదాన్ మాసంలో ప్రతిరోజూ నీళ్లు పోస్తాను ముప్పై రోజుల పాటు.. అవి తక్కువైనా, ఎక్కువైనా మన ఇల్లు ఎంత పెద్దదిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? నువ్వు సంతృప్తి చెందే వరకు నేను కవితలు
రాస్తూనే ఉంటాను నీకు ఇష్టమైతే, పక్కనే ఉన్న ఒకటి రెండు గ్రహాలను కూడా మన ఇంటికి కలిపేస్తాను.
ఈ ఇంటి కోసం నేను ఎటువంటి సరిహద్దులు గీయను ఎలాంటి విరామ చిహ్నాలు ఉంచను.అబు తోహా రాసిన ఈ కవితలోని వేదన, ముఖ్యంగా మూలాలు కోల్పోయిన మనిషి పడే ఆవేదనని మనం చూడవచ్చు ఆయన కవిత్వం ప్రధానంగా గాజాలో సామాన్య ప్రజల దైనందిన జీవితం, యుద్ధం వల్ల కలిగే వేదన, మరణం, ఆశల చుట్టూ తిరుగుతుంది. అత్యంత సున్నితమైన పదాలతో అమానవీయ పరిస్థితులను ఆయన అక్షరీకరించారు.
సమకాలీన ప్రాముఖ్యత
2023-–24 యుద్ధ సమయంలో ఆయన తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ పత్రికల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఒకానొక సమయంలో ఆయనను నిర్బంధించినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలు ఆయన విడుదల కోసం గళం ఎత్తారు.ముసాబ్ అబు తోహా కవిత్వం కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాకుండా, మానవ సంబంధాలు, మనుగడ కోసం చేసే పోరాటం గురించి మాట్లాడుతుంది.
ఆయన కవిత్వాన్ని చదువుతున్నప్పుడు మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి.. ఒక తాళం చెవి, ఒక పాత రేడియో లాంటి చిన్న చిన్న వస్తువుల ద్వారా ఆయన పెద్ద చరిత్రను, యుద్ధ బీభత్సాన్ని ఆవిష్కరిస్తారు.యుద్ధంలో చెట్లు నరికివేసినా, పక్షులు ఎగిరిపోయినా.. మళ్ళీ అక్కడ చిగురులు వస్తాయనే ఆశను ఆయన కవిత్వంలో నింపుతారు.రాజకీయాల కంటే ఎక్కువగా, ఒక సామాన్య మనిషి పడే ఆవేదనను ఆయన అక్షరీకరిస్తారు. అందుకే ఆయన కవిత్వం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమవుతుంది.
ఆయన కవిత్వం ప్రధానంగా గాజాలో సామాన్య ప్రజల దైనందిన జీవితం, యుద్ధం వల్ల కలిగే వేదన, మరణం, ఆశల చుట్టూ తిరుగుతుంది. అత్యంత సున్నితమైన పదాలతో అమానవీయ పరిస్థితులను ఆయన అక్షరీకరించారు.
- డా. మంగారి రాజేందర్
కవి, రచయిత
లైఫ్& లిటరేచర్ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ
featureseditor@v6velugu.com
