పంటిలో ఇరుక్కున్న పాప్‌కార్న్.. ప్రాణం మీదికి తెచ్చింది

పంటిలో ఇరుక్కున్న పాప్‌కార్న్.. ప్రాణం మీదికి తెచ్చింది

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేయడం చాలా మందికి అలవాటే. కానీ ఈ అలవాటు ఓ వ్యక్తికి ప్రాణం మీదికి తెచ్చింది. ఏ గొంతులో ఇరుక్కోవడం లాంటివో అయితే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లిపోయేవాడేమో.. కానీ అది పంటిలో ఇరుక్కుంది. ఏమవుతుందిలే అని లైట్ తీసుకున్నాడు. చివరికి చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేదాక వచ్చింది పరిస్థితి.

ఇంగ్లాండ్‌లోని కార్న్‌వాల్‌కు చెందిన ఆడమ్ మార్టిన్ (41) అనే వ్యక్తి ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. అతడు సెప్టెంబర్ నెలలో సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తూ పాప్‌కార్న్ తింటుండగా.. ఒకటి పక్క పంటిలో ఇరుక్కుంది. అప్పటికి అదేం చేస్తుందిలే అని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత చిరాకుగా అనిపిస్తుండడంతో దాన్ని బయటకు లాగడానికి నానా ప్రయత్నాలూ చేశారు. పెన్ను, టూత్ పిక్, వైరు, పుల్లలు ఇలా వాడని వస్తువులేదు. అయినా లాభం లేకపోయింది.

ఆ.. అదేం చేస్తుందిలే అని వదిలేశాడు మార్టిన్. కానీ ఆ పాప్‌కార్న్ వల్ల చివరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే గానీ బతకని స్థితికి చేరాడు. నెల రోజులు గడిచిన తర్వాత రాత్రులు విపరీతంగా చమటలు పట్టడం, తలనొప్పి, అలసటగా అనిపించడం లాంటి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. అయిత ఆ టైంలో జలుబు చేసి ఉండడంతో దాని ప్రభావం అనుకున్నాడు. కానీ ఆ తర్వాత మరో మూడు వారాలకు కాళ్లు లాగడం, గుండె నొప్పి లాంటి సమస్యలు కనిపించాయి. దీంతో అతడు ఆస్పత్రికి పరిగెత్తాడు. తొలుత ఓ హాస్పిటల్‌లో డాక్టర్లు అది నార్మల్‌గా వచ్చిన నొప్పి అనిపంపించేశారు. ఆ తర్వాత కూడా ఆ బాధ తగ్గకపోవడంతో మరో ఆస్పత్రికి వెళ్లాడు మార్టిన్. అక్కడ అసలు విషయం బయటపడింది.

More News:

నేడు భారత్ బంద్.. బ్యాంకు సేవలపై ఎఫెక్ట్

మారాల్సింది నేను కాదు.. ఎదుటివాళ్లు: లోపాన్ని జయించిన టిక్​టాక్​ స్టార్​‌..

చిగుళ్లు దెబ్బతిని ఇన్‌ఫెక్షన్

మార్టిన్‌ పంటిలో ఇరుక్కున్న పాప్‌కార్న్, దాన్ని తీయడానికి పుల్లలతో పొడవడం వల్ల దవడ భాగంలో చిగుళ్లు దెబ్బతిని ఇన్‌ఫెక్షన్ వచ్చింది. అది రక్తంలో కలిసి గుండెకు చేరడంతో లోపలి కండరాలపై ఎఫెక్ట్ పడింది. చర్మం, చిగుళ్లు, కడుపు వంటి భాగాల్లో ఇన్‌ఫెక్షన్ వల్ల హార్ట్ దెబ్బతినడాన్ని ‘ఎండోకార్డైటిస్’ అని అంటారు. స్కాన్, రక్త పరీక్షల తర్వాత ‘ఎండోకార్డైటిస్’ తీవ్ర స్థితిలో ఉందని తేల్చిన వైద్యులు.. మార్టిన్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకపోతే బతకడం కష్టమని చెప్పారు. దీంతో గత నెలలోనే అతడికి ఏడు గంటల పాటు సర్జరీ చేశారు. ప్రస్తుతం అతడు పూర్తిస్థాయిలో కోలుకుంటున్నాడు.

హార్ట్‌కు పంటి చిగుళ్లు బ్యాక్టీరియా హైవే

పంటి సమస్య వచ్చిన మొదటిలోనే మార్టిన్ డెంటిస్ట్ వద్దకు వెళ్లుంటే ఇంతదాకా వచ్చేది కాదని డాక్టర్లు అన్నారు. అయితే పంటి నొప్పి, చిగుళ్ల వాపు లాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. హార్ట్‌కు నేరుగా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు చేరవేయడంలో పంటి చిగుళ్లు హైవే లాంటివని చెప్పారు. అయితే మార్టిన్‌కు వచ్చిన ఇన్‌ఫెక్షన్‌ను తొలి దశలోనే గుర్తించి ఉంటే యాంటీ బయాటిక్స్ డోస్‌తో నయమైపోయేదని అన్నారు. సో, ఆరోగ్యం విషయంలో చిన్న సమస్యనైనా నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.