రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుందంటే..!

రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుందంటే..!

దేశాధినేత.. సాయుధ దళాల సుప్రీం కమాండర్.. రాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఎన్నిక ఆషామాషీ వ్యవహారం కాదు. లోక్ సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలన్నీ  ఉండి 35 ఏండ్లు నిండిన భారత పౌరులెవరైనా రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు. అయితే వారు ఏ చట్టసభల్లో ప్రతినిధిగానూ, లాభదాయక పదవుల్లోనూ ఉండకూడదు. లోక్సభ, శాసన సభల ప్రజా ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే రాజ్యసభ ఎంపీల మాదిరిగానే దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక కూడా పరోక్ష విధానంలో జరుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎన్నుకోబడిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఓటేసే హక్కు అవకాశం ఉంటుంది. అదే అసెంబ్లీ విషయానికొస్తే కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో నామినేటెడ్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు. రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదు. 

ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటుకు ఒక్కో విలువ

దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు సంఖ్య 4,809 కాగా వారి ఓటు విలువ 10,86,431. ఎలక్టోరల్ కాలేజీలోని ప్రతి సభ్యుని ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఇది ఎంపీలకు ఒక విధంగా, ఎమ్మెల్యేలకు మరో విధంగా ఉంటుంది. లోక్ సభలో 543, రాజ్యసభలో 233 మందితో కలుపుకొని మొత్తం 776 మంది ఎంపీలున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరితో కలుపుకుని మొత్తం  4,033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవానికి ఈ సంఖ్య 4,120.  కానీ 2018లో కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగకపోవడంతో ఈ సంఖ్య తగ్గింది.  

ఎమ్మెల్యేల ఓటు విలువ ఎలా లెక్కిస్తారంటే..?

1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువను నిర్థారిస్తారు. తొలుత రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగిస్తారు. వచ్చే విలువను మళ్లీ 1000తో భాగిస్తారు. అలా వచ్చే సంఖ్యే రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ. 

ఉదాహరణకు 1971 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 1,57,02,122 
రాష్ట్రంలోని మొత్తం శాసన సభ స్థానాల సంఖ్య 119
తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ  1,57,02,122 ÷ 119= 131950.605042
131950.605042 ÷ 1000 = 131.95 
అంటే తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132
ఈ లెక్కన తెలంగాణ మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ 132 X 119 = 15,708

ఎంపీల ఓటు విలువ ఎలా లెక్కిస్తారంటే?

దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగించి ఓటు విలువ నిర్థారిస్తారు. 
ఎంపీ ఓటు విలువ = అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ÷ ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య
2017 రాష్ట్రపతి ఎన్నికల నాటికి దేశంలో 4,120 ఎమ్మెల్యే స్థానాలున్నాయి.  అప్పట్లో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉండగా మొత్తం ఓట్ల విలువ 5,49,495గా ఉండేది.  ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగని కారణంగా ఆ సంఖ్య 4,033కు తగ్గింది. దీంతో మొత్తం ఎంపీల ఓట్ల విలువ కూడా 5,43,200కు తగ్గింది. 
లోక్ సభలో 543, రాజ్యసభలో 233 మంది ఎంపీలతో కలుపుకొని మొత్తం ఎంపీల సంఖ్య 776.
ఎంపీల ఓటు విలువ =5,43,200 ÷ 776 =700

తెలంగాణ ఎంపీల ఓటు విలువ

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, 7 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్రం లో మొత్తం ఎంపీల సంఖ్య 24.
తెలంగాణ ఎంపీల ఓటు విలువ = 24 X 700 = 16,800
తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ: 15,708 + 16,800 = 32,508

ప్రపోషనల్ రిప్రెజంటేషన్ సిస్టం

రాష్ట్రపతి ఎన్నిక ప్రపోషనల్ రిప్రెజంటేషన్ పద్ధతిలో సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ విధానంలో జరుగుతుంది. అంటే ఎన్నికలో ఓటర్ల అందరికీ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు. సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ విధానంలో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది.  అంటే ఓటరు బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఒకటి, రెండు, మూడు, నాలుగు ఇలా ప్రాధాన్యతలవారీగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు కాదు. నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కోటాను నిర్ణయించేందుకు పోలైన వ్యాలిడ్ ఓట్లను 2తో భాగిస్తారు. ఆ సంఖ్యకు ఒకటి యాడ్ చేస్తారు.

ఉదాహరణకు 3500 వ్యాలిడ్ ఓట్లు పోలైతే నిర్దేశిత కోటా= 3,500 ÷ 2 = 1750
 1750+1 =1751

ఈ లెక్కన రాష్ట్రపతి బరిలో ఉన్న అభ్యర్థి గెలవాలంటే 1751 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థికి కోటా కన్నా ఎక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తే రిటర్నింగ్ అధికారి వారినే విజేతగా ప్రకటిస్తారు. లేనిపక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుపుతారు. అతి తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు పొందిన అభ్యర్థిని తొలగించి వారికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు సమానంగా పంచుతారు. రెండో ప్రాధాన్యతా ఓట్లలోనూ ఫలితం తేలకపోతే.. తక్కువ ఓట్లు వచ్చిన వారి ఓట్లను పోటీలో ఉన్న వారికి పోలైన ఓట్లకు కలుపుతూ ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. ఇలా ఎవరో ఒక అభ్యర్థి విజయం సాధించే వరకు లెక్కింపు జరుగుతుంది.