పీఎస్ఎల్వీ-సీ55 ప్రయోగం సక్సెస్

పీఎస్ఎల్వీ-సీ55 ప్రయోగం సక్సెస్

సింగపూర్​కు చెందిన మరో రెండు శాటిలైట్లను ఇస్రో విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. మధ్యాహ్నం 2.19 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ ముందుగా నిర్ణయించిన కక్ష్యలోకి టెలోస్-2, ల్యూమ్ లైట్-4 శాటిలైట్లను కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది.

శ్రీహరికోట (ఏపీ):   

సింగపూర్​కు చెందిన మరో రెండు శాటిలైట్లను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) విజయవంతంగా అంతరిక్షంలోకి చేర్చింది. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం  నుంచి శనివారం చేపట్టిన పీఎస్ఎల్ వీ–సీ55 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. మధ్యాహ్నం 2.19 గంటలకు నింగికి దూసుకెళ్లిన రాకెట్ ముందుగా నిర్ణయించిన కక్ష్యలోకి టెలోస్–2, ల్యూమ్ లైట్–4 శాటిలైట్లను కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. వీటిలో సింథటిక్ అపెర్చర్ రాడార్ పేలోడ్​తో మొత్తం 741 కిలోల బరువు ఉన్న టెలోస్–2 ఉపగ్రహం.. సింగపూర్​కు నిరంతరం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా అత్యంత రెసొల్యూషన్ తో కూడిన వెదర్ ఫొటోలను అందించనుంది. ఇక వీహెచ్ఎఫ్ డాటా ఎక్చేంజ్ సిస్టం పేలోడ్ తో 16 కిలోల బరువు ఉన్న ల్యూమ్ లైట్–4 అనేది నానో శాటిలైట్. మెరుగైన సముద్రయానం కోసం ఈ–నావిగేషన్ సేవలు అందించే పేలోడ్ టెస్టింగ్ కోసం దీనిని ప్రయోగించారు. సింగపూర్ ప్రభుత్వంతో ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ కుదుర్చుకున్న కాంట్రాక్ట్ మేరకు ఈ శాటిలైట్లను ఇస్రో స్పేస్ కు చేర్చింది. ఇంతకుముందు 2015 డిసెంబర్ లోనూ సింగపూర్​కు చెందిన టెలోస్–1 శాటిలైట్ తోపాటు మరో ఐదు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. కాగా, నాలుగు స్టేజీలతో 44.4 మీటర్ల పొడవు ఉన్న పీఎస్ఎల్ వీ-–సీ55 రాకెట్.. మొత్తం 228 టన్నుల బరువుతో నింగికి దూసుకెళ్లింది. ఇది పీఎస్ఎల్ వీ రాకెట్​కు 57వ ప్రయోగమని అధికారులు తెలిపారు.  

రాకెట్ అప్పర్ స్టేజీ కూడా శాటిలైటే..

పీఎస్ఎల్ వీ-సీ55 రాకెట్​లో మొత్తం 4 స్టేజీలు ఉండగా.. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నాలుగో (అప్పర్) స్టేజీని ఒక శాటిలైట్ మాదిరిగా ఉపయోగిం చుకునేలా ప్లాన్ చేశారు. ఇందుకోసం రాకెట్ నాలుగో స్టేజీలో 7 పేలోడ్​లను అమర్చారు. సూర్యరశ్మి నుంచి కరెంట్​ను తయారు చేసి, పేలోడ్​లకు అందించేలా దీనికి సోలార్ ప్యానెళ్లను జోడించారు. ‘పీఎస్ఎల్ వీ ఆర్బిటల్ ఎక్స్ పరిమెంటల్ మాడ్యూల్-2 (పోయెమ్-2)’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలోనూ రాకెట్ సత్తా చాటిందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ప్రకటించారు. రాకెట్ అప్పర్ స్టేజీకి సైతం డిప్లాయెబుల్ సోలార్ ప్యానెళ్లను అమర్చి వాడటం ఇదే తొలిసారి అని వెల్లడించారు. ‘పోయెమ్ (పద్యం) మరిన్ని పోయెమ్స్ రాయబోతోంది’ అంటూ ఆయన హర్షం వ్యక్తంచేశారు. శాటిలైట్లను ప్రవేశపెట్టిన తర్వాత రాకెట్ అప్పర్ స్టేజీని అంతరిక్షంలో ఎక్స్ పరిమెంట్స్ కు ఉపయోగించుకోవడం ఇది మూడోసారి అని తెలిపారు. పోయెమ్-2లో భాగంగా మొత్తం 7 పరికరాలను అమర్చి పంపామని తెలిపారు.