అత్యవసరంగా లోన్​ కావాలంటే..బంగారం ఉండాలె!

అత్యవసరంగా లోన్​ కావాలంటే..బంగారం ఉండాలె!
  • భారీగా పెరుగుతున్న గోల్డ్‌‌లోన్‌‌ కంపెనీ షేర్లు
  • ధర తగ్గితే మాత్రం వీటికి ఇబ్బందే

 ముంబై: ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్‌‌, డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ వంటివి  దివాలా తీశాక మిగతా ఎన్​బీఎఫ్​సీలు అప్పులు ఇవ్వలేకపోతున్నాయి. వాటి దగ్గర లిక్విడిటీ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితి కొన్ని ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు మాత్రం వరంగా మారింది. అవేంటో తెలుసా ?  బంగారాన్ని కుదువ పెట్టుకొని అప్పులు ఇచ్చే మణప్పురం, ముత్‌‌హూట్‌‌, ఐఐఎఫ్‌‌ఎల్‌‌ వంటి నాన్‌‌–బ్యాంకింగ్‌‌   కంపెనీలు (ఎన్‌‌బీఎఫ్‌‌సీలు).   ఇండియన్లకు బంగారంతో ఎంతో అనుబంధం ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకే ప్రపంచంలో ఏ ఇతర దేశంలో లేనంత బంగారం మన దగ్గర ఉంది. ఎన్‌‌బీఎఫ్‌‌సీ సెక్టార్‌‌కు ఇబ్బందులు వచ్చి, అప్పులు ఇవ్వడం తగ్గించాక రిటైల్​ కస్టమర్లు, చిన్న వ్యాపారులుం తమ దగ్గరున్న బంగారాన్ని కుదువబెట్టి డబ్బు తెచ్చుకుంటున్నారు. దీంతో గోల్డ్‌‌లోన్ల ఎన్‌‌బీఎఫ్‌‌సీల లాభాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మామూలు ఎన్​బీఎఫ్​సీల్లో డబ్బు డిపాజిట్​ చేయడానికి వెనకాడుతున్న పబ్లిక్​ మాత్రం గోల్డ్​లోన్​ కంపెనీల్లో మాత్రం ఉత్సాహంగా సొమ్ము డిపాజిట్​ చేస్తున్నారు. ఇవి బాండ్ల ద్వారా డబ్బులు సమకూర్చుకొని అప్పులు ఇస్తున్నాయి.  మణప్పురం ఫైనాన్స్‌‌ లిమిటెడ్‌‌ షేరు ధర గత ఏడాది రెట్టింపయింది. దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌‌లోన్‌‌ ఎన్‌‌బీఎఫ్‌‌సీ ముత్‌‌హూట్‌‌ ఫైనాన్స్‌‌ షేర్‌‌ విలువ 47 శాతం పెరిగింది. వీటి బాండ్లకు కూడా గిరాకీ పెరిగింది. గోల్డ్​లోన్లతో  చిన్న కంపెనీలు అప్పులను తీర్చుతున్నాయి. బాకీలు వసూలయ్యాక అప్పులు తీర్చి బంగారాన్ని విడిపించుకుంటున్నాయి.

కలిసి వచ్చిన రేట్ల పెరుగుదల

ఇటీవల బంగారం రేట్లు పెరగడం కూడా ఇలాంటి కంపెనీలకు వరంలా మారింది. మనదేశంలోని ఇళ్లలో దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువైన బంగారం ఉంటుందని అంచనా. చైనా తరువాత అత్యధికంగా బంగారాన్ని కొంటున్న దేశం మనదే! ‘‘మేం కొన్ని నెలల కోసం ఇచ్చే లోన్ల వల్ల కంపెనీల ఆర్థిక పరిస్థితి బాగుపడుతోంది. బంగారం ధరల పెరుగుదల వల్ల అసెట్‌‌ క్వాలిటీని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. అందుకే ఈక్విటీ, క్రెడిట్‌‌మార్కెట్లు మా లాంటి లెండర్లపై ఆసక్తి చూపుతున్నాయి’’ అని మణప్పురం ఫైనాన్స్‌‌ సీఈఓ వీపీ నందకుమార్‌‌ అన్నారు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడం, ఎన్‌‌బీఎఫ్‌‌సీల క్రైసిస్‌‌ ముగిసే అవకాశం లేకపోవడంతో గత 15 నెలల్లో చాలా షాడో బ్యాంకులు క్రెడిట్‌‌ మార్కెట్‌‌ నుంచి తప్పుకున్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లోన్లు ఇచ్చే దివాన్‌‌ హౌసింగ్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌ (డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌), ఆల్టికో క్యాపిటల్‌‌ ఇండియా వంటివి ఈ ఏడాదే దివాలా తీశాయి.

రిస్కులూ ఉన్నాయ్‌‌

అయితే గోల్డ్‌‌లోన్‌‌ ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు ఢోకా లేదని చెప్పలేం. వాళ్లూ రిస్కులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం బంగారం ధర బాగానే ఉంది కానీ ఇది తగ్గితే మాత్రం ఇబ్బందులు ఏర్పడుతాయి. కంపెనీ అసెట్‌‌ క్వాలిటీ, వ్యాపారం బాగా దెబ్బతింటుందని రేటింగ్‌‌ కంపెనీ ఇక్రా హెచ్చరించింది. గోల్డ్‌‌లోన్‌‌ ఎన్‌‌బీఎఫ్‌‌సీలు బాండ్ల ద్వారా భారీగా నిధులు తెచ్చుకుంటున్నాయి. మణప్పురం గత 12 నెలల్లో రూపాయి బాండ్ల ద్వారా దాదాపు రూ.138.8 కోట్లు సేకరించింది. ఇష్యూ ధర కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ.