భార్య ఆస్తి కొట్టేయాలని త్రాచుపాముతో కాటేయించాడు

భార్య ఆస్తి కొట్టేయాలని త్రాచుపాముతో కాటేయించాడు

కొల్లాం: కేరళలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య ఆస్తిని కొట్టేయాలనే కుట్రతో ఆమెను పాము కాటుతో చంపేశాడు. గతేడాది మేలో జరిగిన ఈ ఘటనపై కొల్లాం జిల్లా అడిషనల్ సెషన్స్  కోర్టులో విచారణ జరుగుతోంది. అతడిని ఇప్పటికే దోషిగా తేల్చిన కోర్టు.. ఈ కేసులో  అతడికి ఏ శిక్ష విధించాలన్నది బుధవారం తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు.. 28 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తి తన భార్య ఉత్తర ఆస్తిపై కన్నేశాడు. ఎలాగైనా ఉత్తర అడ్డు తొలగించుకుని..  ఆమె ఆస్తిని కాజేసి, మరో మహిళను పెళ్లి చేసుకుందామని స్కెచ్ వేశాడు. అయితే ఆమెను చంపినా తనకు దొరికిపోకుండా ఉండేలా ప్లాన్ చేసిన సూరజ్.. అందులో భాగంగా పామును వాడాడు.

పక్కా స్కెచ్‌తో మర్డర్ ప్లాన్

పాము కాటుతో భార్యను చంపి తప్పించుకుందామని సూరజ్ పథకం పన్నాడు. అయితే గతేడాది ఫిబ్రవరిలో ఈ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. కానీ మే నెలలో చేసిన రెండో అటెంప్ట్‌లో సక్సెస్ అయ్యాడు. పాములను పట్టుకునే మిత్రుడు సురేష్ సాయంతో భార్యను త్రాచు పాముతో కాటు వేయించాడు. దాని విష ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఉత్తర దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సొ పొందినప్పటికీ ప్రాణాలు దక్కించుకోలేకపోయింది. ఆమె జూన్ మొదటి వారంలో ప్రాణాలు కోల్పోయింది. అయితే ఉత్తర మృతి తర్వాత అల్లుడు సూరజ్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో ఆమె తల్లిదండ్రులు అతడిపై అనుమానంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో క్రైమ్‌ బ్రాంచ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనంతరం సూరజ్ కుతంత్రం బయటపడింది. సూరజ్‌, సురేష్.. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఎట్టకేలకు దాదాపు ఏడాది తర్వాత సూరజ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఏ శిక్ష విధించాలన్నదానిపై తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.

ఈ కేసు గురించి కేరళ డీజీపీ అనిల్ కాంత్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో హత్యలు చేసినా దొరకకుండా ఉండేందుకు కొందరు ఎంత సైంటిఫిక్‌గా, ప్రొఫెషనల్‌గా ప్లాన్ చేస్తున్నారో ఇలాంటి ఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కేసును ఛేదించడంలో క్రైమ్ బ్రాంచ్‌ పోలీసుల కృషిని మెచ్చుకున్నారు. విచారణలో ఫోరెన్సిక్ మెడిసిన్ అవుట్‌పుట్, ఫైబర్ డేటా, పాము డీఎన్‌ఏతోపాటు మిగిలిన ఆధారాలు చాలా ఉపయోగపడ్డాయన్నారు.

మరిన్ని వార్తలు: 

నా రాజీనామా వెనక బలమైన రీజన్ ఉంది: ప్రకాశ్ రాజ్

క్వారంటైన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన శ్రియ

కేసీఆర్ కుట్ర.. అసెంబ్లీలో ఈటల మొహం చూడొద్దని