
చైనా యువతలో నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అనేక రంగాల్లో దూసుకుపోతున్నామని డ్రాగన్ కంట్రీ పదే పదే చెబుతున్నప్పటికీ అక్కడ నిరుద్యోగం క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 2023 నాటికి పట్టణ ప్రాంతాల్లో 16 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో దాదాపు 21.3 శాతం మందికి ఉద్యోగాలు లేవని ఓ సర్వే స్పష్టం చేసింది.
పల్లెటూళ్లలో ఉద్యోగాలు వెతుక్కోండి
అంతకంతకూ నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా బయటకొస్తున్న గ్రాడ్యుయేట్‌లను పల్లెటూళ్లకు వెళ్లి వ్యవసాయం చేసుకోవాల్సిందిగా చైనా ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది. అయితే పట్టభద్రులైన యువత మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది.
కంపెనీల్లో నో వేకెన్సీ బోర్డులు
హాంగ్ కాంగ్‌కు పొరుగున ఉన్న గ్వాంగ్‌డోంగ్ ప్రావిన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా పేరొందింది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కంపెనీల ముందు భాగంలో నో వేకెన్సీ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజ్ గ్రాడ్యుయేట్లు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూవర్లు గ్రామాల్లో పనులు వెతుక్కోవాలని ఈ ప్రావిన్స్ ప్రభుత్వం సలహా ఇచ్చింది. గ్రామీణ యువతకు కూడా వారి వారిగ్రామాల్లోనే ఉపాధి అవకాశాలను వెతుక్కోవాలని తెలిపింది.
విద్యావంతులు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం తగిన సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించలేకపోతోందని చైనా యువత మండిపడుతున్నారు. ఇక తమ డిగ్రీలు పనికిరావని ఆన్‌లైన్‌లో జోకులు వేస్తున్నారు.