వరి- కొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు

 వరి- కొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు
  • పంట పొలాల్లో కొయ్యలను కాల్చేస్తే వాయు కాలుష్యం
  • హార్వేస్టర్ల నిర్లక్ష్యంతో ఫీటు కంటే ఎత్తులో వరి కొయ్యలు
  • నశిస్తున్న సూక్ష్మజీవులు, పోషకాలు కాల్చ వద్దంటున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు : పంట పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెడితే భూసారానికి ముప్పు జరిగే ప్రమాదం ఉంది. హార్వేస్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? లేదా రైతులే చెప్పారో కానీ వరి కోతలు ముగిసిన పొలాల్లో ఎక్కడ చూసిన ఫీటుకు పైగా ఎత్తున వరి కొయ్యలే కనబడుతున్నాయి. కొయ్యలు ఉన్నా అలాగే దున్ని నీటిలో మురగబెడితే.. అవి పొలాలకు ఎరువుగా ఉపయోడపడ్తాయి. కానీ వాటిని కాల్చేస్తే వాయు కాలుష్యంతోపాటు రైతులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. భూసారానికి ముప్పుగా మారడంతోపాటు పంటలకు ఉపయోగపడే మిత్ర జీవులు నశించిపోతాయి.

బెల్ట్ ​బిగించకపోవడంతోనే..

యాసంగి సీజన్​వడ్ల కోతల ప్రారంభానికి ముందే హార్వెస్టర్ల యజమానులను ఆఫీసర్లు అలెర్ట్​చేశారు. రూల్స్​కు అనుగుణంగా వ్యవహరించాలని మీటింగ్​పెట్టి మరీ చెప్పారు. అయినప్పటికీ చాలా మంది హార్టెస్టర్లు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. కోతల సమయంలో హార్వెస్టర్ ముందు భాగంలో ఉండే కట్టర్​బార్ బెల్ట్​ను భూమికి అరఫీట్ ఎత్తులో  బిగించినట్టయితే వరి కొయ్యలు కూడా అదే సైజులో మిగిలి, భూమిలో కలిసినట్టుగానే ఉంటాయి. పొలం దున్నే సమయంలో అవి తేలికగా భూమిలో కలిసిపోతాయి. 

అయితే కొందరు హార్వెస్టర్ల డ్రైవర్లు వర్క్​త్వరగా కంప్లీట్​ చేసుకోవాలనే ఉద్దేశంతో కట్టర్ బార్ బెల్ట్​ను భూమికి ఫీటు కంటే ఎత్తుగా బిగించి కోతలు జరుపుతారు. దీంతో జిల్లాలోని వేల ఎకరాల్లో వరి కొయ్యలు ఫీటు కంటే ఎత్తుగా పొలాల్లోనే మిగిలిపోయాయి. అయితే కొందరు రైతులు కూడా కోత త్వరగా ముగిసిపోవాలనే ఉద్దేశంతో హార్వెస్టర్లకు ఇలాగే కోయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. 

దున్నేస్తే ఓకే..

యాసంగి సీజన్ కోతలు​ముగిసి వడ్లు మార్కెట్​కు తరలిపోయాయి. వడ్ల కొనుగోళ్లు కూడా నెలాఖరుకు ముగిసిపోనున్నాయి. ఆఫీసర్లు వానాకాలం సీజన్​–2025 యాక్షన్ ప్లాన్ రెడీ చేసి 2.95 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తారని అంచనాలు వేశారు. మరికొద్ది రోజుల్లో రైతులు సాగులో బిజీ కానున్నారు. కానీ వేల ఎకరాల్లో ఎక్కడ చూసినా ఏపుగా ఉన్న వరి కొయ్యలే కనబడుతున్నాయి. వరి కొయ్యలు ఉన్నా పొలానికి నీరు పెట్టి ఎకరం పొలానికి 150 కిలోల సింగిల్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫాస్పెట్‌‌‌‌ (ఎస్​ఎస్​పీ)ను చల్లి కలియ దున్నితే త్వరగా కొయ్యలు మురిగి నేల సారవంతమవుతుంది. తద్వారా పొలానికి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడి పోషకాలు అందుతాయి. మిత్ర జీవులు వృద్ధి చెందుతాయి. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. అదే వరి కొయ్యలను కాల్చేసినట్టయితే త్వరగా పని అయిపోతుంది. 

కొయ్యలు కాలిస్తే నష్టాలే..

వరి కొయ్యలు కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ కొయ్యలు కాల్చిన సమయంలో వచ్చిన పొగతో రైతులకు ఊపరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొగ కారణంగా ఊపిరి ఆడకుండా రైతులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతేడాది సిద్దిపేట జిల్లా కోహెడలో వరికొయ్యలు కాల్చిన ఓ రైతు పొగతో ఊపిరాడక చనిపోయాడు. అంతేకాకుండా పంటల దిగుబడిపై కూడా ప్రభావం పడుతుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. 

వరి కొయ్యలు కాల్చడంతో నేలలోని నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు నశించిపోతాయని చెబుతున్నారు. పంటకు మిత్రులుగా ఉండే సూక్ష్మ జీవులు నాశనమై భూమి సమతౌల్యం కోల్పోతుంది. నేలలో తేమ శాతం తగ్గిపోవడంతోపాటు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. వరి కొయ్యల వంటి పంటల అవశేషాలతో నేలలో సారం పెరగడంతోపాటు పర్యావరణం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు.