ఓ వైపు యాక్టర్.. మరో వైపు ఆర్జే కమ్ యాంకర్

ఓ వైపు యాక్టర్.. మరో వైపు ఆర్జే కమ్ యాంకర్

అందరివాడు వేణు శ్రావణ్

ఎదుటి మనిషిలో ఎలాంటి మార్పు తేవాలన్నా.. మనసుకు హత్తుకునే ఒక్క మాట చాలు. అలాంటి మాటలు కొన్ని జీవితాలపై ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. చావాలనుకున్న మనిషిలో బతకాలనే ఆశలు కలిగిస్తాయి. కంటికి కనిపించకుండా.. కేవలం తమ మాటలతోనే ప్రజలకు దగ్గరవుతారు రేడియో జాకీలు. అలా రెయిన్ బో ఎఫ్ఎంలో శ్రోతలను అలరిస్తూనే, బుల్లితెర సీరియళ్లలో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వేణు శ్రావణ్. 

 

రేడియోలో ఆర్జే అంటే.. శ్రోతలను అలరించడమే కాదు.. వాళ్లలో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపడం కూడా. అవును.. ఇటు కాలర్స్​తో ముచ్చటిస్తూ.. నచ్చిన పాటలను వినిపిస్తూ.. వాళ్ల సమస్యలకు తోచిన సలహాలు, పరిష్కారాలు ఇస్తూ.. ‘వేణు.. ఈ అబ్బాయి చాలా మంచోడు’ అన్న ట్యాగ్​లైన్​తో ఎంతోమంది ప్రేమాభిమానాలను సంపాదించుకున్నాడు రెయిన్​బో ఎఫ్​ఎం (101.9) ఆర్జే వేణు శ్రావణ్​. కేవలం ఆర్జేగానే కాదు.. దూరదర్శన్​లో యాంకర్​గానూ ప్రోగ్రామ్స్​ చేస్తుంటాడు. ఇంతేనా.. నటనపై ఉన్న ఆసక్తితో సినిమా, సీరియల్స్​లోనూ నటించాడు. వీటన్నింటికన్నా ముఖ్యమైంది అతని మంచి మనసు. ఎవరు ఆపదలో ఉన్నారని తెలిసినా, వెంటనే ‘నేనున్నాను’ అంటూ సాయం చేయడానికి ముందుకొస్తాడు. ఈ కరోనా టైమ్​లో కూడా ఎంతోమందికి అండగా నిలుస్తున్నాడు ఆర్జే కమ్​ యాక్టర్​ వేణు శ్రావణ్​ గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..

మీ ఫ్యామిలీ, పర్సనల్​ లైఫ్​ గురించి..

మాది ఖమ్మం జిల్లాలో ఒక పల్లెటూరు. డిగ్రీ వరకు ఖమ్మంలోనే వివిధ ప్రాంతాల్లో చదివాను. నాన్న పోస్ట్​మాస్టర్​గా చేస్తున్నారు. అమ్మ ప్రమీలకు వినపడదు, మాట్లాడలేదు​. అయినా చాలా యాక్టివ్​గా ఉంటుంది. అలాగే మా తాతయ్య (అమ్మవాళ్ల నాన్న), మామయ్య ఫ్యామిలీ  కూడా మా లైఫ్​లో చాలా ఇంపార్టెంట్​. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు, పాఠాలను నేను, నా చెల్లెలు వీణ.. మా అమ్మ నుంచే నేర్చుకున్నాం. తనకు మాటలు రాకపోయినా, ప్రతి విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో.. అవతలి వాళ్లకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో బాగా తెలుసు. చిన్నప్పట్నించి అమ్మతో సైగలు చేస్తూ ఉండటం వల్లేనేమో, నేను యాక్టింగ్​ బాగా చెయ్యగలుగుతున్నాను.

రేడియో జాకీగా చేయాలని ఎందుకు అనుకున్నారు?

నేను రేడియోలో జాయిన్​ అవ్వకముందే యాక్టింగ్​ ఫీల్డ్​లో ఉన్నాను. దాంతో మొదట్లో రేడియోలో చేయడానికి ఇంట్రెస్ట్​ చూపించలేదు. తర్వాత ఆర్జేగా కూడా జనాలను ఎంటర్​టైన్​ చేయొచ్చు కదా అనుకుని.. 2007లో ఆలిండియా రేడియోలో ఆర్జే పోస్ట్​లకు అప్లై చేస్తే సెలెక్ట్​ అయ్యాను. అప్పట్నించి పదమూడేళ్లుగా రకరకాల కాన్సెప్ట్​లతో రెయిన్​బో ఎఫ్​ఎంలో ప్రోగ్రామ్స్​ చేస్తున్నాను.​

ఆర్జేగా మీరు ఎమోషనల్​గా, ఫ్రౌడ్​గా ఫీలైన సందర్భాలు ఏంటి?

రేడియా జాకీగా చేయడం కొన్ని సందర్భాల్లో చాలా గర్వంగా అనిపిస్తుంది. అలా నా లైఫ్​లో మర్చిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక షోలో నేను చెప్పిన మాటలు విని.. ఒక అమ్మాయి తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుందట. భర్త వేధింపులు భరించలేక జీవితానికి ముగింపు చెప్పాలనుకున్న ఆమె… నా మాటలు విని.. ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు బిడ్డకోసం కాయాకష్టం చేసుకుంటూ బతుకుతోంది. ఈ విషయాన్ని ఆమె మరో ఎఫ్​ఎం ప్రోగ్రామ్​లో చెప్పింది. అది విన్న చాలామంది నాకు ఫోన్​ చేసి చెప్పారు. కొన్నిరోజుల తర్వాత నా టెన్​ ఇయర్స్​ స్పెషల్​ షోకి ఫోన్​ చేసి తనే మాట్లాడింది. ఇప్పుడు హైదదాబాద్​కి వచ్చి మంచి జీతం సంపాదిస్తూ తన కొడుకును పోషించుకుంటున్నానని చెప్పి సంతోషించింది. ఇలాంటివి మనసుకు చాలా హత్తుకుంటాయి. అలాగే లేడీ లాయర్స్​ ఫోన్​ చేసి, నా మాటలతో నేను మహిళల్లో పెంచుతున్న ధైర్యాన్ని మెచ్చుకుంటారు.

మరి యాక్టింగ్​​పై ఇంట్రెస్ట్​ ఎలా వచ్చింది?

చిన్నప్పట్నించే నాకు సినిమాలంటే చాలా ఇష్టం. యాక్టర్స్​ని ఇమిటేట్​ చేస్తూ ఉండేవాడ్ని. అలా నాకు యాక్టింగ్​పై ఇంట్రెస్ట్​ ఎప్పుడూ ఉండేది. ఖమ్మంలోనే డిగ్రీలో బీఎస్పీ చదువుతున్నప్పుడు కూడా.. ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్​కి వచ్చేవాడ్ని. పేపర్​లో ఏదైనా సినిమా ఆడిషన్​ యాడ్​ కనిపిస్తే, అవి ఫేక్​ అని తెలియక వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ వెళ్లేవాడ్ని. అలా యాక్టింగ్​ మీద ఇంట్రెస్ట్​తోనే డిగ్రీ పూర్తవ్వగానే సొంతూరును వదిలేసి సిటీకి వచ్చాను. ‘సైనికుడు’ వంటి సినిమాల్లో చిన్నచిన్న రోల్స్​, సీరియల్స్​లో లీడ్​ రోల్స్​ కూడా చేశాను.

మీరు చేసిన సీరియల్స్​ ఏంటి?

నేను బుల్లితెర మీద కనిపించిన మొదటి సీరియల్​ ‘ఈటీవీ’లో ప్రసారమైన ‘విధి’ సీరియల్​. అందులో రెండు రోజుల క్యారెక్టర్​ చేశాను. తర్వాత ‘ఈటీవీ’లోనే ‘ప్రియాంక’, ‘అలౌకిక’లో చిన్న రోల్స్​ చేశాను. తర్వాత ‘మా టీవీ’లో వచ్చిన ‘రాధ మధు’ సీరియల్లో మంచి రోల్​ చేసి అందరి మెప్పు పొందాను. ‘జెమిని టీవీ’లో ‘ఆమె’, ‘శుభలగ్నం’ సీరియల్స్​లో చేశాను. 2015లో ‘దూరదర్శన్​’లో ‘మనసంతా నువ్వే’ అనే సీరియల్​కి నాకు ‘బెస్ట్​ యాక్టర్​’ అవార్డు వచ్చింది. సుమన్​గారు ఉన్నప్పుడు ‘ఈటీవీ’లో హీరోగా నాలుగు టెలీఫిల్మ్స్​ చేశాను. ఈమధ్యే ‘జెమిని టీవీ’లో పూర్తైన ‘ప్రతిఘటన’ సీరియల్లో నటించాను. ప్రస్తుతం కొన్ని సీరియల్స్​కి టాక్​ నడుస్తోంది.

కలర్స్​ అవార్డ్స్​ సంగతేంటి?

ఆర్టిస్ట్​లకు రెమ్యూనరేషన్​ కన్నా తమ టాలెంట్​ని గుర్తించి ఇచ్చే అవార్ట్స్​ ఎక్కువ ఆనందాన్నిస్తాయి. అందువల్ల నేనే స్వయంగా 2013లో ‘కలర్స్​.. సర్వీస్​ అండ్​ ఎంటర్​టైన్​మెంట్​’ పేరుతో కల్చరల్​ అండ్​ సేవా ఆర్గనైజేషన్​ని స్థాపించాను. దాని ద్వారా ప్రతి ఏడాది టీవీ, సినిమా, సేవా రంగాల్లో గొప్పగా పని చేస్తున్నవాళ్లను ఎంపిక చేసి రవీంద్ర భారతి, శిల్పకళా తోరణం వంటి వేదికల మీద సత్కరిస్తున్నాం.

మీకు జీవితంలో తృప్తినిచ్చే అంశమేంటి?

నలుగురికీ సాయం చేయడం, ఆర్జేగా పనిచేయడం  నాకు తృప్తితో పాటు బాధ్యతను గుర్తుచేస్తాయి. అయితే అల్టిమేట్​గా నాకు యాక్టింగ్​ చేయడమే.. ‘మై కప్​ ఆఫ్​ కాఫీ’. సీరియల్స్​లో మంచి రోల్స్​ చేయాలని ఉంది. ఫైనల్​గా యాక్టింగ్​పై ఉన్న ప్యాషనే నాకు ఆనందాన్నిస్తుంది. -నిఖిత నెల్లుట్ల

అమ్మతో బాండింగ్​ ఎలా ఉంటుంది?

అందరికీ వాళ్ల లైఫ్​లో అమ్మ స్పెషలే.. అలాగే నా జీవితంలో కూడా మా అమ్మ నాకు చాలా ప్రత్యేకం. కొన్నేళ్ల క్రితం అమ్మకు సివియర్​ హెల్త్​ ఇష్యూస్‌ వస్తే.. ప్రతి క్షణం పక్కనే ఉండి చూసుకున్నాను.  అంటే హైదరాబాద్​కి వచ్చిన కొత్తలో హోమ్​ నర్సింగ్​ నేర్చుకోవడం నాకు అమ్మ విషయంలో చాలా హెల్ప్​ అయ్యింది. ఇప్పటికీ ఎవరికన్నా నర్సింగ్​ విషయంలో హెల్ప్​ కావాలంటే వెంటనే వెళ్లి చేస్తాను. మా అమ్మను ఇప్పుడు ఎవ్వరు చూసినా, తనకి అన్ని హెల్త్​ ఇష్యూస్‌ వచ్చి తగ్గాయా అని ఆశ్చర్యపోతారు. అంత యాక్టివ్​గా ఉంటుంది. నేను మా ఊళ్లో ఒక గోశాలను ఏర్పాటు చేశా. అమ్మ ఎక్కువగా చెట్లు, మూగజీవులతోనే గడుపుతుంది. వాళ్లకువాళ్లకు మధ్య స్పెషల్​ అటాచ్​మెంట్​ ఉండి ఉంటుంది. అంతేకాదు, ప్రతివిషయంలో ఎంత పొదుపుగా ఉండాలనే విషయాన్ని నేను అమ్మ నుంచే నేర్చుకున్నాను.

మీరు అందుకున్న అవార్డ్స్​ గురించి​..

అవార్డులను నేనెప్పుడూ గర్వంగా కాకుండా బాధ్యతగా భావిస్తాను. అయితే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది మాత్రం.. విజయవాడలో సీనియర్​ నటి వాణిశ్రీగారి చేతుల మీదుగా అందుకున్న ‘మహానటి సావిత్రి అవార్డ్​’. అలాగే ‘యునైటెడ్​ థియోలాజికల్​ రీసెర్చ్​ యూనివర్సిటీ’ ద్వారా డాక్టరేట్​ అందుకున్నాను. గతేడాది ఢిల్లీలోని ఏపీ భవన్​లో ‘నార్త్​ ఢిల్లీ కల్చరల్​ అకాడమీ ‌‌–2019 నేషనల్​ అవార్డు’ అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది.