
ఉక్రెయిన్లోని ఖార్కివ్లో జరిగిన క్షిపణి దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందడంపై రష్యా స్పందించింది. నవీన్ మృతిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు భారత్లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఉక్రెయన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయులందరికీ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై భారత్ తటస్థ వైఖరి ప్రదర్శించడాన్ని రష్యా రాయబారి ప్రశంసించారు.
మంగళవారం ఉక్రెయిన్లోని ఖార్కివ్లో రష్యా జరిపిన దాడిలో 21 ఏళ్ల నవీన్ శేఖరప్ప మృతిచెందాడు. కర్నాటకకు చెందిన ఆయన ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న సరుకులు తెచ్చేందుకు వెళ్లిన నవీన్ సూపర్ మార్కెట్ దగ్గర క్యూలో నిలబడి ఉండగా రష్యా జరిపిన బాంబు దాడిలో చనిపోయాడు.