
ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యా.. ఆ దేశంలో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒక్కో సిటీని ఆక్రమిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. అయితే దాదాపు ఐదారు రోజుల క్రితమే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి ఎంటరైనప్పటికీ.. ఆ సిటీని మాత్రం స్వాధీనం చేసుకోవడం ఇంకా సాధ్యం కాలేదు. ఓ వైపు యుద్ధం సాగిస్తుండగానే.. మరో వైపు శాంతి ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ఒక దఫా శాంతి చర్చలకు కూడా కూర్చున్నప్పటికీ రెండు దేశాల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఇవాళ రాత్రి రెండో దశ చర్చలకు సిద్ధమయ్యాయి. అయితే ఉక్రెయిన్ ఇటు నాటో కూటమిలో గానీ, అటు ఈయూలో గానీ చేరబోమని ఒప్పుకుంటేనే సానుకూల చర్చలు సాధ్యమని రష్యా షరతులు పెడుతోంది. తాము నాటో చేరకుంటే తమ దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో రష్యా కచ్చితమైన హామీ ఇస్తుందా అని ఉక్రెయిన్ నిలదీస్తోంది. ఈ తరహా వాదనలు నడుస్తున్న ఈ సమయంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లవ్‌రోవ్ యుద్ధంపై సంచలన కామెంట్స్ చేశారు.
చర్చలకు సిద్ధమే కానీ..
ఉక్రెయిన్‌తో రెండో దశ చర్చలకు రష్యా సిద్ధంగానే ఉందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి లవ్‌రోవ్ చెప్పినట్లు రష్యన్ వార్తా సంస్థలు ఆర్టీ న్యూస్ చానెల్, స్పుత్నిక్ పేర్కొన్నాయి. ‘‘ఉక్రెయిన్‌తో చర్చలకు మేం సిద్ధమే. కానీ తమ పక్షాన అమెరికాను తెచ్చుకునేందుకు సమయం కోసమే ఉక్రెయిన్ చర్చల పేరుతో నాటకాలు ఆడుతోందనిపిస్తోంది” అని లవ్‌రోవ్ అన్నారు. అయితే ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వరకు వెళ్తే మిగిలేది అణు విధ్వంసమేనని ఆయన చెప్పారు. అయితే పరిస్థితి అంతవరకూ రానివ్వబోమని, ఉక్రెయిన్‌ను అణ్వాయుధాలు సమీకరించుకోనివ్వబోమని అన్నారు.
Third World War would be nuclear and disastrous, Russian Foreign Minister Lavrov says: Russian media Sputnik
— ANI (@ANI) March 2, 2022
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంపైనా లవ్‌రోవ్ స్పందించారు. తమపై ఆంక్షల విషయంలో రష్యా ముందు నుంచే సిద్ధంగా ఉందని, అయితే తమ దేశ అథ్లెట్స్, జర్నలిస్టులు, కళాకారులు, కల్చరల్ విభాగాలకు సంబంధించిన ప్రతినిధులపై ఆంక్షలు ఉండవని భావించామన్నారు.