SA20, 2024: 30 బంతుల్లో 74 పరుగులు.. భీకర ఫామ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్

SA20, 2024: 30 బంతుల్లో 74 పరుగులు.. భీకర ఫామ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్

సఫారీ గడ్డపై జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తుది దశకు చేరుకుంది. గురువారం(ఫిబ్రవరి 8) జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్ విజయం సాధించి.. తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ జెయింట్స్ 211 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో సూపర్ కింగ్స్ 142 పరుగులకే కుప్పకూలింది. 

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన క్లాసెన్.. ఆ తర్వాత జూలు విదిల్చాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 30 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఇమ్రాన్ తాహిర్(15వ ఓవర్), సామ్ కుక్(18వ ఓవర్) బౌలింగ్‌లో 29 పరుగుల చొప్పున పిండుకున్నాడు. వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. క్లాసెన్ ఎదురుదాడికి సూపర్ కింగ్స్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. క్లాసెన్ కి తోడు వియాన్ ముల్డర్(50; 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి డర్బన్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 

అనంతరం 212 పరుగుల భారీ ఛేదనలో జోబర్గ్ సూపర్ కింగ్స్ 142 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మెుయిన్ అలీ(30) టాప్ స్కోరర్. సూపర్ జెయింట్స్ బౌలర్లలో జూనియర్ డాలా 4 వికెట్లు తీసుకోగా.. డ్వేన్ ప్రిటోరియస్, నవీన్ ఉల్ హక్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

ఆనందంలో సన్‌రైజర్స్ అభిమానులు

క్లాసెన్ ఇప్పటివరకూ ఈ టోర్నీలో 12 మ్యాచుల్లో 208.87 స్ట్రైక్ రేట్‌తో 447 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఈ ఫామ్‌ను క్లాసెన్ ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని హైదరాబాద్ అభిమానులు ఆశిస్తున్నారు. మరో మూడు వారాల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షెడ్యూల్ విడుదల చేయనుంది.