
- ఆరు యూఎస్ టెలీకమ్యూనికేషన్ కంపెనీల్లోకి చొరబడిన హ్యాకర్లు
- న్యూయార్క్ టైమ్స్ కథనంలో వెల్లడి
వాషింగ్టన్: అమెరికా సహా 80కి పైగా దేశాల టెలీకమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను చైనాకు చెందిన "సాల్ట్ టైఫూన్" అనే సైబర్ గ్రూప్ హ్యాక్ చేసింది. ఆయా దేశాల్లోని మొత్తం 200 కంపెనీల సున్నితమైన డేటాతోపాటు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ(మేధో సంపత్తి)ని చోరీ చేసింది. ప్రధానంగా అమెరికాలోని ఆరు ప్రముఖ టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లలోకి చొరబడి దాదాపు ప్రతి అమెరికన్ డేటాను హ్యాకర్లు సేకరించారు. దీనికి సంబంధించి అమెరికన్ నిఘా వర్గాలు, అధికారులు తెలిపిన వివరాలతో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. సాల్ట్ టైఫూన్ సైబర్ గ్రూప్ కు చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (ఎంఎస్ఎస్)తో సంబంధాలు ఉన్నాయి. 2019 నుంచి ఆరేండ్లుగా సైబర్ దాడులకు పాల్పడుతున్నది. ముఖ్యంగా అమెరికా సహా 80కి పైగా దేశాల టెలీకమ్యూనికేషన్, ప్రభుత్వ, రవాణా, లాడ్జింగ్, డిఫెన్స్ రంగాలను లక్ష్యంగా చేసుకున్నది. హ్యాకర్లు.. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులందరి ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లను సేకరించారు. ఇందులో కాల్ తేదీలు, టైం, ఐపీ అడ్రెస్, ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హ్యాకర్లు.. రాజకీయ నాయకులు, గూఢచారులు, యాక్టివిస్టుల ఫోన్ కాల్స్ ఆడియో రికార్డింగ్‌లను కూడా సంపాదించారు. బాధితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వంటి ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. డెమోక్రటిక్ నాయకుల ఫోన్‌లు కూడా హ్యాక్ అయ్యాయి. ఏటీ&టీ, వెరిజోన్, లూమెన్ టెక్నాలజీస్ వంటి ఆరు అమెరికన్ టెలికాం కంపెనీలూ హ్యాక్ అయ్యాయి.
ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ చోరీ
సాల్ట్ టైఫూన్ గ్రూప్ సైబర్ దాడులు కేవలం డేటా సేకరణకే పరిమితం కాలేదు. చిప్ డిజైన్‌లతో సహా కీలకమైన ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కూడా చోరీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఆయా దేశాల్లో కొత్తగా సృష్టించిన ఆవిష్కరణలు, రచనలు, డిజైన్‌లు, సాహిత్యం, కళలు, లేదా వాణిజ్య చిహ్నాలు, ఆలోచనల వంటి వాటిని చోరీ చేసింది. అయితే, హ్యాకర్లు 2018 నుంచి ఉన్న పాత నెట్‌వర్క్ లోపాలను ఉపయోగించుకుని.. సిస్కో రౌటర్లు, ఫోర్టినెట్ డివైస్‌లలోని లోపాలతో దోపిడీ చేశారు.
పలు దేశాలపై ప్రభావం
సాల్ట్ టైఫూన్ గ్రూప్ సైబర్ అటాక్ కు యూరప్, ఇండో-పసిఫిక్ ప్రాంతాలతో సహా 80కి పైగా దేశాలలోని 200కి పైగా సంస్థలు బాధితులుగా ఉన్నాయి. అయితే, చైనా జరిపిన ఈ దాడులు.. అమెరికా, దాని మిత్రదేశాలతో సమానంగా సైబర్ సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించాయి. యూఎస్, కెనడా, ఫిన్‌లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ వంటి దేశాలు చైనా సైబర్ దాడులను ఖండించాయి. కాగా, ఈ ఆరోపణలు నిరాధారమైనవని చైనా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.