ఘోర ప్రమాదం.. జిమ్ పైకప్పు కూలి 11 మంది..

ఘోర ప్రమాదం..  జిమ్ పైకప్పు కూలి 11 మంది..

బీజింగ్: చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్సులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. వర్షాల కారణంగా క్వీక్వీహార్ సిటీలోని జిమ్ సెంటర్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందగానే ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుందని అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 

జిమ్ సెంటర్ పైకప్పు నిర్మాణానికి నీటిని పీల్చుకునే స్వభావమున్న పెర్ లైట్ అనే పదార్థాన్ని ఉపయోగించారని అధికారులు వెల్లడించారు.  గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెర్ లైట్ బరువు పెరిగి 1200 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న భవన పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిందని తెలిపారు. ప్రమాద సమయంలో జిమ్ లో 19 మంది ఉన్నారని..11 మంది చనిపోగా మరో నలుగురు గాయాలతో ట్రీట్ మెంట్ పొందుతున్నారని వివరించారు. ఇంకో నలుగురు సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. జిమ్ పైకప్పును కట్టిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.