కాంగ్రెస్ ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

కాంగ్రెస్ ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఆపాలని నినాదాలు చేశారు. నిత్యావసరాలపై జీఎస్టీ, ధరల పెరుగుదలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

విజయ్ చౌక్ వరకు ర్యాలీగా చేరుకున్న కాంగ్రెస్ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ లైన్స్కు తరలించారు. కేంద్రం సామాన్యుడి తరఫున ప్రశ్నిస్తున్న తమ పార్టీ ఎంపీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న తమను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో విపక్ష ఎంపీలు కీలక అంశాలను లేవనెత్తినప్పుడు సస్పెండ్ చేస్తున్నారని, నిరసన చేస్తే అదుపులోకి తీసుకుని పోలీస్ లైన్స్ కు తరలిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీలంతా పోలీస్ లైన్ లోనే ఉంటున్నప్పుడు కొత్త పార్లమెంటు బిల్డింగ్ ఎందుకు కడుతున్నారని ప్రశ్నించారు. 

మరోవైపు సోనియా గాంధీని ఈసీ ప్రశ్నించడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం బయట భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.