
ఇజ్రాయెల్‌పై దాడుల్లో భాగంగా.. హమాస్ చేతుల్లో కిడ్నాప్‌కు గురైన జర్మనీ మహిళ మృతి చెందింది. అంతకుముందు ఆమెను కిడ్నాప్ చేసి.. రోడ్లపై నగ్నంగా ఊరేగించారు. తాజాగా ఆమె మరణ వార్తను ఆమె కుటుంబం ప్రకటించింది.
జర్మనీకి చెందిన షానీ లౌక్ అనే మహిళ.. మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌కు వెళ్లింది. అక్టోబర్ 7న ఈ ఈవెంట్ జరిగ్గా.. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించారు. హమాస్ బృందం 5వేలకుపైగా రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ వీధుల్లో బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంలోనే మ్యూజిక్ ఫెస్టివల్లోకి ప్రవేశించి, హింసకు పాల్పడ్డారు. కాల్పుల మోత మోగించారు. అదే సమయంలో షానీ లౌక్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత.. ఆమెను నగ్నంగా చేసి, ట్రక్‌లో వీధుల్లో ఊరేగించారు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పలు ప్రపంచ దేశాలు, హమాస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అయితే దీని తర్వాత షానీ లౌక్ ఇప్పుడెక్కడ ఉంది.. అసలు బతికే ఉందా అన్న విషయంపై మాత్రం ఆ వీడియోలో స్పష్టత రాలేదు. తన బిడ్డను కాపాడాలని షానీ లౌక్ తల్లి రికార్డ.. ప్రపంచ దేశాలను వేడుకున్నారు. సోషల్ మీడియాలోకి వచ్చి అభ్యర్థనలు చేశారు. కొన్ని గంటల తర్వాత.. మరో అప్డేట్ ఇచ్చారు. "షానీ లౌక్కు తీవ్రంగా గాయాలయ్యాయి. గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స ఇస్తున్నార"ని పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే షానీ లౌక్ మృతదేహాన్ని గుర్తించినట్టు, పోలీసులు.. ఆమె కుటుంబానికి సమాచారం అందించారు.
"నా సోదరి మరణించిందని చెప్పడం చాలా బాధగా ఉంది. పోలీసులు ఆమెను కనుగొన్నారు. ఆమెను గుర్తించారు. ఆమె మరణించింది" అని షానీ లౌక్ సోదరి.. ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.