
షాపులు పెట్టడం మరీ తేలిక
హోటల్స్ పెట్టాలన్నా రూల్స్ తక్కువే
ఇందుకోసం చట్టం మార్పు
న్యూఢిల్లీ: ఇప్పుడున్న విధానంలో చిన్న కిరాణా దుకాణం పెట్టాలంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సహా 28 రకాల అనుమతులు కావాలి. సాధారణ హోటల్ తెరవాలంటే పోలీసులకు 24 రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలి. అదే ఒక పిస్టల్ వంటి ఆయుధం కొనుక్కోవడానికి 13 రకాల డాక్యుమెంట్లు సరిపోతాయి. ఇక నుంచి ప్రభుత్వం ఇలాంటి అసంబద్ధ విధానాలను రద్దు చేయబోతున్నది. చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి అనుమతుల సంఖ్యను వీలున్నంత వరకు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపారాలను సులువుగా ప్రారంభించే విధానాలను అమలు చేయాలని, అధికారుల జోక్యాన్ని తగ్గించాలనే డిమాండ్లను పరిశీలిస్తోంది. కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేయాలంటే తూనికలు, కొలతల అధికారుల అనుమతి కూడా పొందాలి. ధాబా లేదా హోటల్ పెట్టాలంటే పోలీసులు, అగ్నిమాపకశాఖ, మున్సిపల్ శాఖ వంటి ఎన్నో విభాగాల నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్‌ఓసీ) ఉండాలి. సంగీతం వినిపించడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలని దుకాణాలు, సముదాయాల చట్టం స్పష్టం చేసింది. కొన్ని నిబంధనలు ఒక్కో నగరానికి ఒక్కో రకంగా ఉంటున్నాయి. సింగపూర్, చైనా వంటి దేశాల్లో 4 రకాల అనుమతులు తీసుకొని రెస్టారెంట్ తెరవొచ్చు. ఇండియాలోనూ అలాంటి విధానాలను తేవడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫలితంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో 50 స్థానాల్లోపు ఉండాలని కోరుకుంటోంది.
చట్టాన్ని మార్చాల్సిందే…
షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ వంటి పాత చట్టాల వల్ల తమకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సంఘం నాయకులు చెప్పారు. కేవలం శాండ్‌విచ్ అమ్మాలన్నా 24 రకాల పత్రాలను సమర్పించాల్సి రావడం ఇబ్బందికరమని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు, ది బీర్ కేఫ్ సీఈఓ రాహుల్ సింగ్ ఆక్షేపించారు. ఆయుధం కొనుక్కోవడానికి మాత్రం 13 డాక్యుమెంట్లు ఇస్తే చాలనడం సరికాదని అన్నారు. ఇలాంటి విషయాలన్నీ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ రిటైల్ ట్రేడ్ (డీపీఐఐటీ) దృష్టికి వచ్చాయి. లైసెన్సుల రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని ఇది భావిస్తోంది. దీని వల్ల చిన్న దుకాణాలు నిరాటంఈకంగా వ్యాపారాలను కొనసాగించుకుంటాయని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదని అధికారి ఒకరు అన్నారు. ‘‘రెన్యువల్ రద్దు వంటి సానుకూల చర్యలను స్వాగతిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడం, అనుమతులు ఇచ్చే విధానాన్ని తీసుకురావాలి.
ఇప్పుడైతే రోజంతా డాక్యుమెంట్ల జిరాక్స్ కోసమే సరిపోతోంది. అన్ని రాష్ట్రాల్లో, నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడానికి చిరు వ్యాపారులకు చాలా సమయం పడుతోంది. రెస్టారెంట్లకు ఒక్కో చోట ఒక్కో రూల్ ఉంది. అగ్నిమాపకశాఖ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అన్న వాదనను ఒప్పుకోవాల్సిందే. రెస్టారెంటు తెరవడానికి కూడా పర్యాటకశాఖ అనుమతి తీసుకోవాలనడం ఎంత వరకు సరైంది ?’’ అని సింగ్ ప్రశ్నించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ సమస్యలన్నింటినీ వ్యాపారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీపీఐఐటీ అనుమతుల తగ్గింపుపై దృష్టి పెట్టింది. ఏయే రంగాలకు ఎలాంటి పర్మిషన్లు కావాలనే విషయమై కసరత్తు చేస్తోంది. కిరాణాలు, చిన్న రెస్టారెంట్లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తాయని, పెద్దగా పెట్టుబడి అవసరమూ ఉండదు కాబట్టి వీటికి త్వరగా అనుమతులు ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.