ఆ ఐఏఎస్​లు సీఎంను కలుస్తలె  .. రేవంత్​కు స్మిత సబర్వాల్, అర్వింద్ కుమార్ దూరం 

ఆ ఐఏఎస్​లు సీఎంను కలుస్తలె  .. రేవంత్​కు స్మిత సబర్వాల్, అర్వింద్ కుమార్ దూరం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉన్నతాధికారులంతా ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కొందరు ఐఏఎస్​లు మాత్రం రేవంత్​ను కలిసేందుకు ముందుకు రావడంలేదని, వరుసగా రెండు రోజులు సీఎం సెక్రటేరియెట్​కు వచ్చినా ఆ అధికారులు ఆయనను కలవలేదని సెక్రటరియెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. మాజీ సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్,  మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, ఐటీ, ఇండస్ర్టీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఇప్పటికీ సీఎం రేవంత్ ను కలువలేదని తెలిసింది. వీరంతా గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్​కు, మాజీ మంత్రి కేటీఆర్​కు దగ్గరగా పనిచేశారు.

స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఇరిగేషన్ కు ఇంచార్జ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సాధారణంగా సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత అన్ని శాఖల హెచ్ఓడీలు వచ్చి కలుస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొందరు ఐఏఎస్​లు సీఎంను కలువకపోవడం చర్చనీయాంశమైంది. ఎలాగైనా ఆ అధికారుల శాఖలను మారుస్తారని, అందుకే వారు సీఎం రేవంత్ ను కలువడంలేదని అంటున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్.. ఈ ముగ్గురు అధికారులపై విమర్శలు చేశారు. ఆఫీసర్లు ఆయనను కలవకపోవడం వెనక ఇదీ ఒక కారణం కావచ్చని చెప్తున్నారు.  

రిటైర్డ్ ఐఏఎస్​లలో టెన్షన్ 

ఏడుగురు సలహాదారుల నియామకాలు, ఎక్స్​టెన్షన్​లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో రిటైర్డ్ ఐఏఎస్​లలో టెన్షన్ మొదలైంది. గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ పదవిని సోమేశ్ కుమార్ కు ఇచ్చి, ఆయనను కొనసాగించడంతో సీఎస్ అయ్యే అర్హత ఉన్నా.. అధర్ సిన్హా, రాణి కుముదిని రెండేళ్లపాటు స్పెషల్ సీఎస్​గానే రీఅపాయింట్ అయ్యారు. వీరి ఎక్స్ టెన్షన్ కొన్ని నెలలైతే పూర్తవుతుంది.

ఆ తర్వాత కూడా ఈ ఇద్దరిని కొనసాగించేందుకు కొత్త సర్కారు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. వీరితోపాటు జీఏడీలో ప్రొటోకాల్ సెక్రటరీ అర్విందర్ సింగ్​ను కూడా రిటైర్ అయిన తరువాత మళ్లీ అదే పోస్టులో రెండేళ్ల పాటు గత ప్రభుత్వం నియమించింది. ఇక దేవాదాయ, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్ ను కూడా రిటైర్ అయ్యాక.. తిరిగి ఆ శాఖలోనే అదే పోస్టులో ప్రభుత్వం రీఅపాయింట్ చేసింది. ఒమర్ జలీల్ ను కూడా ప్రభుత్వ కార్యదర్శి, మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్​గా రీఅపాయింట్ చేసింది. వీరి విషయంలోనూ కొత్త ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.