
టెస్టుల్లో వేగంగా 7000 పరుగుల క్లబ్‌లో చేరి కొత్త చరిత్రను తన పేరు మీద రాసుకున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్. తొమ్మిది సంవత్సరాల క్రితం తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన స్మిత్.. ప్రస్తుతం పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘనత సాధించాడు. స్టీవ్ కేవలం 126 ఇన్నింగ్స్‌లోనే 7000 పరుగుల మైలు రాయిని అందుకొని ఈ ఘనత సాధించాడు. పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ మూసా వేసిన బంతికి సింగిల్ తీసి స్టీవ్ ఈ మార్కును చేరుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ ప్లేయర్ హామ్మండ్ ఈ ఘనతను 1946లో అంటే 73 ఏళ్ల క్రితం 131 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. హామ్మండ్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ 7000 పరుగుల క్లబ్‌లో చేరాడు. భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్ 134 ఇన్నింగ్స్‌ల్లో, సచిన్ 136 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. వీరి తర్వాత కోహ్లీ, సంగక్కరా, గ్యారీ సోబర్స్‌లు 138 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించి అయిదవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆసీస్ తరపున 7000 పరుగులు చేసిన ఆటగాళ్లలో 11వ స్థానాన్ని సంపాదించాడు స్మిత్. అంతేకాకుండా, ఆసిస్ బ్యాట్‌మెన్ బ్రాడ్‌మన్ టెస్టుల్లో చేసిన 6,996 పరుగుల మార్కును కూడా స్మిత్ దాటేశాడు.
సంబంధిత వార్తల కోసం..