
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కరపత్రాల కలకలం రేగింది. నగర అభివృద్ధి కాంక్షించే పౌరుల పేరుతో కరపత్రాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రిలీజ్ చేశారు. GWMC కి పూర్తిస్థాయి నిజాయితీగల ఐ.ఎ.ఎస్. అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు గడిచినా GWMC లో ఫ్లోర్ లీడర్లకు పార్టీల వారీగా గదులు కేటాయించలేదని.. తక్షణమే గదులు కేటాయించాలని కరపత్రంలో పేర్కొన్నారు.
ఫిర్యాదులు పట్టించుకొనే నాథుడే లేడు
ప్రతి నెల చివరి వారంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్టాడింగ్ కమిటి ఏర్పాటుతో పాటు.. కో-ఆప్షన్ సభ్యుల నియామకంలో అలసత్వాన్ని వీడి.. వెంటనే నియమించాలన్నారు. మున్సిపాల్టీకి సంబంధించిన స్థలాలను కొంతమంది కబ్జా చేసి ప్లాట్లుగా అమ్ముతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానికులు సిటి ప్లానర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కరపత్రంలో పేర్కొన్నారు.