కేరళను తాకిన నైరుతి పవనాలు

కేరళను తాకిన నైరుతి పవనాలు

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త వినిపించింది. అనుకున్న తేదీ కంటే రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది. దీంతో ఖరీఫ్ సీజన్ కాస్త ముందుగానే జోరందుకోనుంది. మే 27 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని మొదట భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగా కాకుండా ఇవాళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ 1న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు వస్తుంటాయి. ఈ సీజన్ లో రెండు రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకాయని IMD ప్రకటించింది. 

అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల కదలికకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, మరో రెండు మూడు రోజుల్లో కేరళ వ్యాప్తంగా నైరుతి మరింతగా విస్తరిస్తుందని IMD అంచనా వేసింది. అయితే వాతావరణంలో ఏవైనా అనూహ్య మార్పులు జరిగినా, గాలుల దిశ, ఉపరితల ఆవర్తనాల ఎఫెక్ట్ ఉంటే కాస్త ఆలస్యమవుతుంటాయి. అరేబియా సముద్రం నుంచి వస్తున్న గాలులు, ఆవర్తనం ఎఫెక్ట్ తో ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే వచ్చే 5 రోజులు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరిలోనూ వానలు పడుతాయని ప్రకటించారు. వాతావరణం చల్లబడుతుండడంతో దేశవ్యాప్తంగా హీట్ వేవ్ కండీషన్స్ తగ్గుతాయని IMD తెలిపింది. ప్రస్తుతం కేరళకు ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు ఆవరించాయి. అవి మరింత ముందుకు కదులుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

బిహార్ లో భారీ గోల్డ్ మైన్