చదివింది ఎనిమిదో క్లాస్. ఇంగ్లీష్ రాదు. అయితేనేం జీవితంలో గెలవాలన్న కసి, సొంతంగా ఎదగాలన్న తపన ఉంది. మొక్కల మీద ఇష్టంతో ల్యాండ్‌స్కేప్ గార్డెన్ డిజైనర్ అయ్యాడు. మార్కెటింగ్‌లో డిగ్రీలు లేవు. కానీ, ఇతను సొంతంగా కంపెనీ పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నాడు. మూడొందల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. దేశంలోనే బెస్ట్ ల్యాండ్‌స్కేప్ గార్డెన్ డిజైనర్స్‌లో నాలుగో వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు కె.పి.రావు.మారుమూల పల్లెటూరి నుంచి పెద్ద కలతో వచ్చి, జీవితాన్ని గెలిచిన ఇతని పూర్తి పేరు కొవూరు ప్రద్యుమ్న రావు. ఇదంతా ఎలా సాధ్యమైంది అని అడిగితే... ‘కష్టపడే గుణమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. మొక్క నాటి... బుక్క తిన్నా’ అంటాడు.
బాల్కనీకి అందం తెచ్చే మొక్కల నుంచి టెర్రస్ గార్డెన్ ఎలా ఉండాలి? వెంచర్లో ల్యాండ్ స్కేప్ గార్డెన్ ఎలా ఉండాలి? వాల్ హ్యాంగర్స్, మెత్తని తివాచీ లాంటి కొరియన్ గ్రాస్, లోటస్ పాండ్, వాక్‌వేస్.... ఇలా కస్టమర్ల ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా గార్డెనింగ్ డిజైన్ చేయడంలో ఎక్స్పర్ట్ ఈయన. అంతేనా ఇంటీరియర్ డిజైనర్ కూడా. దేశంలోనే నాలుగో బెస్ట్ ల్యాండ్ స్కేప్ గార్డెన్ డిజైనర్‌గా నిలిచిన ఇతను చదివింది ఎనిమిదో క్లాస్. అది కూడా మధ్యలోనే ఆపేశాడు.
చదువుకునే వయసులో కూలికి
ఈయన సొంతూరు రంగారెడ్డి జిల్లాలో కందుకూరు మండలంలోని గుమ్మడవెల్లి. అమ్మ విజయలక్ష్మి. నాన్న కిషన్ రావు. తాత కరణం కావడంతో దేనికీ లోటు లేకుండా బతికారు. కానీ, తండ్రి ఉద్యోగం పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. దాంతో ఎనిమిదో క్లాస్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. బతుకుదెరువు కోసం కుటుంబమంతా హైదరాబాద్‌లోని వనస్థలిపురం వచ్చింది. చదువులేకపోవడంతో కొన్నిరోజులు కూలి పనులకు వెళ్లాడు. అక్కడే ఉండే వాళ్ల కజిన్ బ్రదర్ నారాయణరావుని చూసి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అతని ఆసక్తిని గమనించి సరూర్‌నగర్‌లోని తమ ‘గ్రాస్ వరల్డ్’లో నెలకు రూ.1200 జీతానికి పనికి పెట్టుకున్నాడాయన. అక్కడ ఏడాదిన్నర పనిచేశాడు. తనకు నచ్చిన, వచ్చిన పనినే కెరీర్‌గా ఎంచుకోవాలని ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్ వైపు అడుగులు వేశాడు.
అవకాశం వచ్చిందిలా...
పనిచేస్తూ కూడబెట్టుకున్న డబ్బుతో బెంగళూరు వెళ్లి మూడేండ్ల ‘ట్రోపికల్ ఎకాలజీ’ కోర్స్ చేశాడు. ఇంట్రెస్ట్ ఉంటే చాలు చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు. కోర్సు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి బాటనీ పుస్తకాలు చదివి, గూగుల్‌లో వెతికి ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్‌కి అనువైన మొక్కలు ఏంటి? వాటికి నీళ్లు, ఎండ ఎంత కావాలి? అనేవి తెలుసుకున్నాడు. 2003లో ‘వెంకటేశ్వర నర్సరీ అండ్ గార్డెన్స్’, ‘కె.పి.రావు అసోసియేట్స్’ పేరుతో రెండు కంపెనీలు పెట్టాడు. క్లయింట్స్‌తో మాట్లాడాలంటే ఇంగ్లీష్ రావాలి. దాంతో ఇంగ్లీష్ వచ్చిన ఫ్రెండ్‌ని అసిస్టెంట్‌గా పెట్టుకుని, నేర్చుకున్నాడు. రోజూ తాను వేసిన డిజైన్లు పట్టుకుని కంపెనీల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. చివరకు పేపర్లో యాడ్ ఇచ్చాడు. అది చూసి ఒక స్కూల్లో గార్డెన్ డిజైన్ చేయమన్నారు. అతడి వర్క్ నచ్చడంతో చిన్న చిన్న కంపెనీలు, అపార్ట్మెంట్లలో గార్డెన్, ఇంటీరియర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. అలా హైదరాబాద్‌లో ల్యాండ్ స్కేప్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
సెలబ్రిటీ డిజైనర్
ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్స్ వచ్చేవి. వాటిలో పెద్దది సామర్లకోట పవర్ ప్రాజెక్ట్ గార్డెనింగ్ డిజైనింగ్. అక్కడి వర్క్ చూసి పొలిటీషియన్లు, సినిమా స్టార్స్ తమ ఇంటీరియర్, గార్డెన్ డిజైనర్‌గా కె.పి.రావునే పిలిచేవాళ్లు. అంతేకాదు నవీన్ జిందాల్, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇళ్లకు కూడా గార్డెనింగ్, ఇంటీరియర్ డిజైన్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సినిమాల్లో పాటల బ్యాక్‌గ్రౌండ్ కోసం గార్డెన్ డిజైన్ చేశాడు. బాహుబలి సినిమాలో దేవసేన కుంతల రాజ్యం బ్యాక్‌గ్రౌండ్ గార్డెన్ లొకేషన్ డిజైన్ చేసింది ఈయనే. హైదరాబాద్ పోలీస్ టవర్స్‌కి గార్డెన్ డిజైన్ చేస్తున్నాడు ఇప్పుడు.
సంతోష్ బొందుగుల
సురేష్ రెడ్డి దుబ్బాక
మొక్కల్ని వారసత్వంగా ఇవ్వాలి
ఇల్లు, ఆఫీస్, గెస్ట్‌హౌస్... ఏదైనా మొక్కలు ఉంటే ఆ అందమే వేరు. అందుకనే చాలామంది కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు పెంచాలనుకుంటారు. ఎంత పచ్చదనం ఉంటే రేడియేషన్ అంత తగ్గిపోతుంది. స్థలం కొలత తీసుకుని సిటవుట్, వాక్ వే, ఎంట్రన్స్... ఏది? ఎక్కడ? ఉంటే బాగుంటుంది అనేది స్కెచ్ ఆర్ట్, త్రీడి డ్రాయింగ్ ద్వారా క్లయింట్స్‌కి చెప్తాను. స్థలం, గార్డెనింగ్ రకాన్ని బట్టి వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటా. థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేసియా నుంచి ఆర్నమెంట్ ప్లాంట్స్ తెప్పిస్తా. ఇప్పటివరకు ముప్పై మందికి ఈ వర్క్ నేర్పించా. నా టీంలో ఇద్దరు ఆర్కిటెక్ట్‌లు ఉన్నారు. ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్ అనేది కార్పొరేట్ జాబ్స్‌కు ఏమాత్రం తక్కువ కాదు. పచ్చదనాన్ని పెంచే ఈ ఫీల్డ్‌లోకి మరింత మంది రావాలి. అందుకోసం స్కూల్, కాలేజీలు, యూనివర్సిటీల్లో ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్ గురించి మోటివేషన్ క్లాస్‌లు కూడా చెప్తున్నా. రాబోయే తరాలకు ఆస్తులు ఇవ్వడం కాదు ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని వారసత్వంగా ఇవ్వాలి.
- కె.పి.రావు
