
న్యూఢిల్లీ: రైటాఫ్ లోన్లను రికవరీ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించనున్నాయి. పీఎస్‌బీలు రైట్-ఆఫ్ లోన్లపై దృష్టి పెట్టాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.2 లక్షల కోట్లను రికవరీ చేసేందుకు ప్రయత్నించాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. 2021-– 22 వరకు గత ఆరేళ్లలో పీఎస్‌బీలు రూ. 8.16 లక్షల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేశాయి. తాజా డేటా ప్రకారం, 2022–-23 మొదటి తొమ్మిది నెలల్లో, పీఎస్‌బీలు రూ.90,958 కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేశాయి. బ్యాంకులు వాటి బోర్డులతో చర్చించి వ్యక్తిగత లక్ష్యాలను నిర్ణయించుకోవాల్సిందిగా కోరామని సంబంధిత అధికారి చెప్పారు. పీఎస్‌బీల స్పెషల్ డ్రైవ్ కారణంగా భారీ ఎత్తున రైటాఫ్ లోన్లు వసూలయ్యే అవకాశం ఉందని వివరించారు. ఈ విషయంలో బ్యాంకులు తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తాయని, అయితే ఈ కేసుల్లో కొన్ని సంవత్సరాలు తరబడి రికవరీ ట్రిబ్యునల్స్, కోర్టుల్లో ఇరుక్కున్నాయని సీనియర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. సమీప భవిష్యత్తులో రికవరీ అసాధ్యమని అనిపించినప్పుడు మాత్రమే బ్యాంకులు లోన్లను రైటాఫ్ చేస్తాయని అన్నారు. లోన్ రైటాఫ్‌ల వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యంగా కనిపిస్తాయి. అప్పులు ఎక్కువగా ఉండవు.
అప్పు కట్టాల్సిందే...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత డిసెంబరులో పార్లమెంట్‌లో మాట్లాడుతూ, రైటాఫ్ బకాయిలను వసూలు చేయడం కొనసాగుతుందని చెప్పారు. రైటాఫ్ వల్ల బారోవర్‌కు ప్రయోజనం ఉండదని అన్నారు. సివిల్ కోర్టులు లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లలో దావా వేయడం ఎన్పీఏల అమ్మకం ద్వారా కూడా బకాయిలను వసూలు చేసుకుంటున్నాయి. లోన్ల మంజూరు విషయంలో నిబంధనలను పాటించలేదని తేలితే అధికారులు బాధ్యత వహిస్తారని, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని సీతారామన్ చెప్పారు. రైటాఫ్ ఖాతాల నుండి రికవరీ రేటును 40 శాతానికి పెంచాలని ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ప్రస్తుతం, రైటాఫ్ ఖాతాల నుండి రికవరీ రేటు 15 శాతం కంటే తక్కువగా ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ కిందటి ఏడాది డిసెంబర్లో ఈ విషయమై మాట్లాడుతూ, గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు చాలా డబ్బును రైటాఫ్ లోన్ ఖాతాల నుంచి రికవరీ చేశాయని పార్లమెంటుకు తెలియజేశారు.