శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 420, డీజిల్ 400

శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 420, డీజిల్ 400

ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న శ్రీలంకలో పెట్రో మంట ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. తాజాగా  లీటరు పెట్రోలు ధర రూ.420కి చేరింది. ఒక్కరోజులోనే  రికార్డు స్థాయిలో రూ.92 ( 24.3 శాతం) మేర ధర పెరగడం గమనార్హం.  మరోవైపు లీటరు డీజిల్ ధర కూడా రూ.111 (38.4 శాతం) మేర పెరిగి రూ.400కు ఎగబాకింది.  శ్రీలంకను ఆర్థిక సంక్షోభం ముసురుకున్నప్పటి నుంచి ఇంత భారీ స్థాయికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరడం ఇదే తొలిసారి. చివరగా ఏప్రిల్ 19న శ్రీలంకలో ఇంధన ధరలను పెంచారు. మళ్లీ ఇప్పుడు వాటిని పెంచుతున్నట్లు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ధరల పెరుగుదలకు సంబంధించిన నిర్ణయాన్ని  శ్రీలంక క్యాబినెట్ ఆమోదించిందని ఆ దేశ విద్యుత్ , ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర ప్రకటించారు. పెంచిన ధరల్లోనే ఎగుమతి, దిగుమతి వ్యయాలు, లోడింగ్, అన్ లోడింగ్ చార్జీలు, పన్నులు అన్నీ కలిసి ఉంటాయని చెప్పారు. శ్రీలంకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ  ‘లంక్ ఐఓసీ’కూడా ఈమేరకు ధరలను పెంచింది. ఈనేపథ్యంలో శ్రీలంక ఆటోవాలాలు చార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు.మొదటి కిలోమీటరు దూరానికి రూ.90, రెండో కిలోమీటరు దూరానికి రూ.80 చొప్పున చార్జీ వసూలు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు శ్రీలంకలో ద్రవ్యోల్బణం రేటు 40 శాతం దిశగా వెళ్తోంది. ఇంధనాలు, కూరగాయలు, మందుల ధరలు పెరుగుతూ పోతున్నాయి.  

మరిన్ని వార్తలు.. 

ఒకే ఫ్రేమ్‌‌లో పవన్, అఖిరా, రేణుదేశాయ్, ఫాన్స్ ఫుల్ ఖుష్

‘పై ఫోనా’ మజాకా.. అంతరిక్షం నుంచీ కాల్స్