సర్కార్ బడుల్లో టీచర్లు లేక స్టూడెంట్ల ఇబ్బందులు

సర్కార్ బడుల్లో టీచర్లు లేక స్టూడెంట్ల ఇబ్బందులు
  • ఆందోళనలో టెన్త్ స్టూడెంట్లు
  • మరో 3 నెలల్లో ఎగ్జామ్స్.. 
  • వేలాది స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత 
  • హైస్కూళ్లలో దాదాపు 5 వేల ఖాళీలు 
  • వలంటీర్లను రెన్యూవల్ చేయని సర్కారు​ 

వెలుగు, నెట్​వర్క్:సర్కార్ బడుల్లో టీచర్లు లేక స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం అయిపోవస్తున్నా సిలబస్ పూర్తి కాలేదని, పరీక్షలు ఎట్ల రాసుడని ఆవేదన చెందుతున్నారు. మరో మూడు నెలల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటి వరకు వేలాది స్కూళ్లలో సబ్జెక్ట్​ టీచర్లు లేక సిలబస్ పూర్తి కాలేదు. సోషల్, బయాలజీ లాంటి సబ్జెక్టులను స్టూడెంట్లు సొంతంగా చదువుకుంటున్నా.. మ్యాథ్స్, ఫిజిక్స్​, ఇంగ్లిష్​లాంటి సబ్జెక్టులు చదవలేక, చదివినా అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్లయితే  స్టూడెంట్లు ఆయా పుస్తకాలను ఇప్పటివరకు తెరిచి కూడా చూడలేదు. ఇటీవల పలు జిల్లాల్లో కొంతమంది టీచర్లను సర్దుబాటు చేసినా మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లకు వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి​చూపకపోవడంతో ఎప్పట్లాగే ఖాళీలే ఉన్నాయి. టీచర్లు లేకపోవడంతో విద్యాశాఖ ఆదేశాలతో వారం రోజులుగా నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులు కూడా ఆయాచోట్ల మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రైవేట్​స్కూళ్లలో ఇప్పటికే సిలబస్​పూర్తయి స్టూడెంట్లు రివిజన్​చేస్తుండగా, సర్కారు బడుల్లో చదివే టెన్త్​క్లాస్​స్టూడెంట్లు మాత్రం టీచర్లు లేక, సిలబస్​ పూర్తికాక ఎగ్జామ్స్​ఎలా రాయాలో అని ఆందోళన చెందుతున్నారు. 

ఐదేండ్లుగా పోస్టుల భర్తీ లేదు.. 

రాష్ట్ర వ్యాప్తంగా 26,040 స్కూళ్లలో 20 వేల దాకా టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం రెండేండ్లకోసారి డీఎస్సీ నిర్వహించేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒకేసారి టీఆర్టీ ద్వారా టీచర్​ పోస్టులు భర్తీ చేసిన సర్కారు.. ఐదేండ్లుగా నోటిఫికేషన్​వేయలేదు. 2019–-20 అకడమిక్ ఇయర్​ కోసం ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్లోకి 16 వేల మంది విద్యావలంటీర్లను తీసుకున్నారు. అయితే కరోనా తర్వాత వీవీలను రెండేండ్ల నుంచి రెన్యూవల్ చేయడం లేదు. దీంతో ఇటు విద్యావలంటీర్లు లేక, అటు టీచర్ ​పోస్టులను భర్తీ చేయక బడుల్లో చదువులు ఆగమవుతున్నాయి. 

అసలు క్లాసులకే దిక్కు లేదంటే.. స్పెషల్ క్లాసులట?  

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేంద్రానికి పంపిన నివేదికలో ఎలిమెంటరీ లెవెల్​లో 11,348 పోస్టులు, సెకండరీ లెవెల్​లో 4,774 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈ లెక్కన చూసినా హైస్కూళ్లలో దాదాపు 5 వేల వరకు టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా చోట్ల మ్యాథ్స్​, ఫిజిక్స్​, బయాలజీ, ఇంగ్లిష్​, తెలుగు, హిందీ, సోషల్​లాంటి సబ్జెక్ట్​లకు​ 2019, అంతకుముందు నుంచే టీచర్లు లేరు. దీంతో ఆరు నుంచి పదోతరగతి  స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడేండ్లుగా సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో ప్రస్తుతం టెన్త్​చదువుతున్న పిల్లలు బేసిక్స్​మరిచిపోయారు. ఈసారి కూడా టీచర్లు రాకపోవడంతో పాఠాలు చెప్పేవారు లేక ఆయా సబ్జెక్టులపై స్టూడెంట్లకు కనీస అవగాహన కూడా లేకుండా పోయింది. పరిస్థితి ఇలా ఉంటే టెన్త్ స్టూడెంట్లకు స్పెషల్​క్లాసులు, రివిజన్​ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు వారం క్రితం ఆదేశాలు జారీ చేశారు. అసలు క్లాసులకే దిక్కు లేదంటే స్పెషల్​క్లాసులకు ఏం చేయాలి? అని హెడ్మాస్టర్లు తల పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో ఇద్దరేసి సబ్జెక్ట్​ టీచర్లు ఉన్న స్కూళ్లతో పాటు అప్పర్,​ ప్రైమరీ స్కూళ్ల నుంచి కొందరు టీచర్లను సర్దుబాటు చేసినా మారుమూల ప్రాంతాల్లోని బడుల్లో మాత్రం సమస్య ఎప్పట్లాగే ఉంది. ఇక సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న సక్సెస్​స్కూళ్లలోనూ సరిపడా టీచర్లు లేక స్టూడెంట్లు నష్టపోతున్నారు. నిజానికి సక్సెస్​ స్కూళ్లలో తెలుగు, ఇంగ్లిష్​ మీడియం స్టూడెంట్లకు వేర్వేరుగా క్లాసులు నిర్వహించాలి. కానీ సబ్జెక్ట్​ టీచర్లు లేరనే సాకుతో తెలుగు, ఇంగ్లిష్​ మీడియం స్టూడెంట్లను ఒకేచోట కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. దీంతో తెలుగు చెప్పాలో, ఇంగ్లిష్​చెప్పాలో తెలియక టీచర్లు తల పట్టుకుంటున్నారు. 

యూట్యూబ్ పాఠాలే దిక్కు.. 

ఇది మహబూబ్​నగర్​జిల్లా బాలానగర్​లోని గర్ల్స్ హైస్కూల్. మొత్తం 254 మంది స్టూడెంట్లకు గాను టెన్త్​క్లాస్​లో 45 మంది ఉన్నారు. ఇది సక్సెస్ స్కూల్ కావడంతో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కాస్లులు వేర్వేరుగా నిర్వహించాలి. ఇందుకోసం 12 మంది టీచర్లు ఉండాలి. కానీ 8 మంది మాత్రమే ఉన్నారు. మ్యాథ్స్, బయోసైన్స్​కు ఒక్కో టీచర్​ మాత్రమే ఉండడంతో తెలుగు, ఇంగ్లిష్​ మీడియం స్టూడెంట్లకు కలిపే పాఠాలు చెబుతున్నారు. దీంతో తమతో పాటు స్టూడెంట్లకు ఇబ్బంది అవుతోందని టీచర్లు అంటున్నారు. ఇక ఫిజికల్ సైన్స్​కు ఒక్క టీచర్​ కూడా లేకపోవడంతో స్టూడెంట్లు కియాన్, యూట్యూబ్​లలో చూసి చదువుకుంటున్నారు. 

బయో సైన్స్ మొదలే పెట్టలే.. 

స్కూల్ ప్రారంభం నుంచి బయో సైన్స్ టీచర్ లేరు. దీంతో ఆ సబ్జెక్టు సిలబస్ మొదలే కాలేదు. ఎగ్జామ్ ఎలా  రాయాలో అర్థం కావడం లేదు. వెంటనే బయో సైన్స్ టీచర్​ను నియమించాలి. 
- బి.లక్షిత, పదో తరగతి, జెడ్పీహెచ్ఎస్ ములుగుపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా  

రెగ్యులర్ టీచర్లను నియమించాలి.. 

ఈ అకడమిక్ ప్రారంభం నుంచి సోషల్, బయాలజీ టీచర్లు లేరు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్తున్నారు. పరీక్షలు దగ్గర పడతుండడంతో 15 రోజుల కింద మా స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు స్టూడెంట్లను సమీపంలోని కొత్తపల్లి హైస్కూల్ కు పంపించాం. ప్రభుత్వం టీచర్లను నియమిస్తే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వెంటనే రెగ్యులర్ టీచర్లను నియమించాలి.  - శ్రీరాముల లక్ష్మణ్, హెచ్ఎం, మూలసాల, పెద్దపల్లి

ముగ్గురు టీచర్లు లేరు..  

మాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ లోని బాబాపూర్-గంగాపూర్ హైస్కూల్. ఇక్కడ 25 మంది టెన్త్​స్టూడెంట్స్ ఉన్నాం. అకడమిక్​ఇయర్​మొదలైనప్పటి నుంచి హిందీ, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లు లేరు. మార్చిలో పరీక్షలు ఉన్నాయి. ఏం చదవాలో, ఎగ్జామ్స్ ఎలా రాయాలో అర్థమైతలేదు. 
- మీనతి మండల్, పదో తరగతి 

తెలుగు, హిందీ సార్లు లేరు.. 

ఈ అకడమిక్​ఇయర్​మొదలైనప్పటి నుంచి తెలుగు, హిందీ సార్లు లేరు. సొంతంగా చదవలేకపోతున్నాం. ఎగ్జామ్స్ దగ్గర పడ్తున్నాయి. ఎలా పాసవుతామోనని టెన్షన్​గా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం సార్లను నియమించాలి. 
- కుంట సిద్ధార్థ, టెన్త్ క్లాస్, జెడ్పీహెచ్ ఎస్ బోయినపల్లి, సిరిసిల్ల జిల్లా