కివీస్‌తో మ్యాచ్.. గెలవకుంటే భారత్‌‌కు కష్టమే

కివీస్‌తో మ్యాచ్.. గెలవకుంటే భారత్‌‌కు కష్టమే

యూఏఈ: టీ20 వరల్డ్ కప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్, న్యూజిలాండ్‌కు పాకిస్థాన్ షాకిచ్చింది. ఇండియాపై 10 వికెట్ల తేడాతో నెగ్గిన పాక్.. కివీస్‌ మీద 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టి గ్రూప్‌ 2లో టాప్‌లో నిలిచింది. దీంతో ఆ జట్టు సెమీస్ బెర్తు దాదాపుగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు వెళ్లే మరో టీమ్ ఏదనేది ఆసక్తికరంగా మారింది. నమీబియా, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్ లాంటి జట్లు ఇదే గ్రూప్‌లో ఉన్నప్పటికీ టీమిండియా, న్యూజిలాండ్‌కు సెమీస్‌కు వెళ్లడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

నెగ్గకుంటే ఇంటికేనా?

భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం సెకండ్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌‌లో ఇండియా మీద కివీస్ గెలిస్తే.. పాక్‌‌తో ఓడింది కాబట్టి.. మిగతా మూడు మ్యాచ్‌‌ల్లో నెగ్గి 8 పాయింట్లు సాధించే ఆస్కారం ఉంది. అప్పుడు పాక్, కివీస్ చెరో 8 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలుస్తాయి. అదే టైమ్‌లో భారత్ మాత్రం 6 పాయింట్లతో సెమీస్  రేసు నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది. గ్రూప్ 2 నుంచి సెమీస్‌ సమీకరణాలు ఎలా ఉండనున్నాయి.. భారత్, కివీస్ జట్ల అవకాశాల గురించి తెలుసుకుందాం.. 

ఒకవేళ కివీస్‌ను భారత్ ఓడిస్తే.. 

భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగే మ్యా్చ్‌లో ఇండియా గెలిస్తే దాదాపుగా సెమీస్‌కు చేరుకున్నట్లేనని చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌ తర్వాత అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా లాంటి చిన్న జట్లతో మ్యాచ్‌‌‌లు ఉంటాయి. వాటిపై గెలవడం భారత్‌కు అంత కష్టం కాబోదు. కాబట్టి కివీస్‌తో పోరే భారత్‌కు కీలకం. ఒకవేళ ఇలా జరిగితే గ్రూప్ 2 నుంచి పాక్, ఇండియాలు సెమీస్‌కు చేరుకుంటాయి. 

భారత్‌పై న్యూజిలాండ్ నెగ్గితే.. 

ఇండియాను న్యూజిలాండ్ ఓడిస్తే ఆ జట్టు సెమీస్ చేరుతుంది. కివీస్ చేతిలో ఓడి.. అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలపై గెలిచినా భారత్ 6 పాయింట్లతో ఉంటుంది. అదే టైమ్‌లో ఇండియా‌తోపాటు మిగిలిన జట్ల మీద నెగ్గితే కివీస్ 8 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు పాక్‌‌‌తో కలసి న్యూజిలాండ్ సెమీస్ చేరుతుంది. ఈ సమీకరణాలన్నీ పాకిస్థాన్, ఇండియా, న్యూజిలాండ్‌లు.. అఫ్గానిస్థాన్, నమీబియా, స్కాట్లాండ్‌ల పైన గెలిస్తేనే సాధ్యమవుతుంది. 

ఓడినా సెమీస్‌కు వెళ్లొచ్చు

ఇండియా, కివీస్ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు సెమీస్ అవకాశాలు పూర్తిగా ఉండవని చెప్పలేం. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఏదైనా చిన్న జట్టు షాక్ ఇస్తే అది సాధ్యమవుతుంది. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి.. పొట్టి ఫార్మాట్‌లో ఏ జట్టయినా ఎవరి మీద అయినా గెలవొచ్చు. ఒక్క ఓవర్‌లో అంతా మారిపోయే టీ20ల్లో.. ఆ రోజు ఎవరు బాగా ఆడతారు, ఏ జట్టు తమ ప్లాన్స్‌ను పక్కాగా అమలు చేస్తుందో వారే విజేతలుగా నిలుస్తారు. 

మరిన్ని వార్తల కోసం: 

విశ్లేషణ: 2500 నాటికి.. ఇండియా ఇట్లుంటదట!

అమ్మో ఒకటో తారీఖు.. భయపడుతున్న ఆర్థికశాఖ

కెప్టెన్ నా సోల్‌మేట్.. మేం ప్రేమికులం కాదు