గర్భంతో ఉన్న లేడీ పోలీస్‌ను చంపిన తాలిబాన్లు

గర్భంతో ఉన్న లేడీ పోలీస్‌ను చంపిన తాలిబాన్లు

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ను చెర పట్టిన తాలిబాన్లు ఆ దేశంలో మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. మహిళల స్వేచ్ఛకు, వాళ్లు ఉద్యోగాలు చేయడానికి బద్ధ వ్యతిరేకులైన తాలిబాన్లు ఇప్పుడు అరాచకాలకు దిగుతున్నారు. అఫ్గాన్ సర్కారులో గడిచిన 20 ఏండ్లుగా ఉద్యోగాలు చేసిన మహిళలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. శనివారం రాత్రి ఘోర్ ప్రావిన్స్‌లోని ఫిరోజ్‌కోహ్‌లో ఒక మహిళా పోలీస్‌ను తాలిబాన్లు కాల్చి చంపారని అఫ్గాన్‌కు చెందిన జర్నలిస్ట్‌ బిలాల్ సర్వరీ ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేశారు. ఆరు నెలల గర్భిణిగా ఉన్న బానూ నిగరా అనే మహిళా పోలీస్‌ ఆఫీసర్‌ ఇంటికి తాలిబాన్లు వచ్చి, ఆమె భర్త, పిల్లల ఎదుటే అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే నిగరా హత్యపై వచ్చిన ఆరోపణలను తాలిబాన్లు కొట్టిపారేస్తున్నారు. ఆమె హత్య జరిగిన విషయం తమకు తెలిసిందని, అయితే ఆ పని చేసింది తాలిబాన్లు కాదని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని తాలిబాన్‌ ప్రతినిధి జబీయుల్లా ముజాహీద్‌ అంతర్జాతీయ మీడియాతో చెప్పాడు. వ్యక్తిగత గొడవలు, కక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని అన్నాడు. తాము ఇప్పటికే గత ప్రభుత్వంలో పని చేసిన అందరికీ క్షమాభిక్ష పెట్టామని గుర్తు చేశాడు.