పత్తి రైతు దిగాలు.. దిగుబడి తగ్గడంతో అప్పులపాలు

పత్తి రైతు దిగాలు.. దిగుబడి తగ్గడంతో అప్పులపాలు

జయశంకర్‌ ‌భూపాలపల్లి, వెలుగు: ఈ ఏడాది భారీ వర్షాలు పత్తి రైతులను నట్టేట ముంచాయి. గులాబీ రంగు పురుగు బెడద లేదని తొలినాళ్లలో సంబరపడ్డ కర్షకులను పలు దఫాలుగా కురిసిన కుండపోత వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పంట చేతికందే సమయంలోనూ ఎడతెరపి లేని వానలతో పత్తి కాయలు మురిగిపోయాయి. సరిగా విచ్చుకోకుండా నల్లగా మారిపోయాయి. దీంతో పంట దిగుబడి 50 శాతానికి పైగా తగ్గిపోయింది. ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు పండాల్సిన పత్తి కేవలం 4 నుంచి 6 క్వింటాళ్లకే పరిమితమైంది. పండిన పంటలో సగం నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు మద్దతు ధరకు కొనడం లేదు. నల్లగా మారిన పత్తి క్వింటాల్‌‌కు రూ.4 వేల లోపే చెల్లిస్తున్నారు.  పత్తి సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక కర్షకులు కంటతడి పెడుతున్నారు. 

అప్పులపాలైన రైతులు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌‌లో 70 లక్షల ఎకరాల వరకు పత్తి పంట సాగు చేశారు. ఎకరానికి  రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ సారి బ్యాంకర్లు రైతులకు అప్పులివ్వకపోవడంతో ప్రైవేట్‌‌వడ్డీ వ్యాపారస్తుల వద్ద రూ.2 నుంచి రూ.4 చొప్పున వడ్డీకి అప్పులు తీసుకొచ్చి సాగు చేశారు. ఒక్కో రైతు రూ.లక్షల్లో అప్పులు చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటపై అకాల వర్షాలు ఉప్పెనలా వచ్చి పడ్డాయి. సెప్టెంబర్‌‌, అక్టోబర్‌ ‌నెలల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వానలతో పూత, కాత రాలిపోయింది. దసరా వరకు పత్తి పంట చేతికి రావాలి. కానీ కాయలు మురిగిపోవడం వల్ల కాయలు పెద్దగా విచ్చుకోలేదు. నల్లగా మారిపోయాయి. కొన్ని కాయలు మాత్రం విచ్చుకొని పత్తి ఏరడానికి వీలయ్యింది.   రైతులు కూలీలతో పత్తి కాయలు తెంపి పత్తి వేరుచేయాల్సి వచ్చింది. ఇలా వేరు చేసిన పత్తి నల్లగా మారడంతో గాలికి ఆరబోశారు. ఎకరానికి 6 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. చెలక భూముల్లో అయితే 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని చెబుతున్నారు. 

పెట్టుబడి పైసలూ వస్తలేవు

ఈ ఏడాది మార్కెట్‌‌లో పత్తికి మంచి రేట్‌‌పలుకుతోంది. ప్రస్తుతం మేలు రకం పత్తి క్వింటాల్‌‌కు రూ.8 వేలకు పైగా ధర ఉంది. కానీ రైతులకు పండిన పత్తిలో సగానికి పైగా నల్ల రంగులో మారింది. వ్యాపారులు ఈ పత్తికి క్వింటాల్‌‌కు రూ.4 వేల లోపే తీసుకుంటున్నారు. ఎకరానికి సుమారు 3 క్వింటాళ్ల నాణ్యమైన పత్తి, మిగతా 2 క్వింటాళ్లు నల్లగా మారిన పత్తి కావడంతో రైతులకు పెట్టుబడి డబ్బులు కూడా చేతికి అందడం లేదు. ఎకరానికి రూ.40 వేలకు మించి రావడం లేదు. దీంతో ఏడాది పొడవునా చేసిన రెక్కల కష్టం పోవడంతో పాటు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు కంటతడి పెడుతున్నారు. పత్తి పంటను ఏడాది పంటగా చెబుతారు. కానీ ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చడానికి రైతులు పంట మధ్యలోనే పత్తిని తొలగించి మక్కజొన్న సాగు చేయాలని భావిస్తున్నారు.

మక్కజొన్న క్వింటాల్‌‌కు ప్రస్తుతం రూ.2,300 ధర పలుకుతోంది. యాసంగిలో మరో వంద, రెండు వందలు పెరిగే అవకాశాలున్నట్లు రైతులు చెబుతున్నారు. మక్కజొన్న ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినా పెట్టుబడి ఖర్చులు పోనూ 20 వేల నుంచి 30 వేలు మిగులుతుందని రైతులు భావిస్తున్నారు. ఈ ఏడాది కురిసిన వానలతో చెరువులు, బావుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. ఎస్సారెస్పీ ద్వారా కూడా కాలువ నీళ్లు వచ్చే పరిస్థితి కన్పిస్తుండటంతో రైతులంతా యాసంగిలో మక్కజొన్న పంట సాగువైపే మొగ్గుచూపుతున్నారు. చేసిన అప్పులు తీర్చాలంటే మొక్కజొన్న సాగే పరిష్కారమని అన్నదాతలు భావిస్తున్నారు. వచ్చే 15, 20 రోజుల్లో చాలా మంది రైతులు పత్తి పంటను తొలగించి మక్కజొన్న విత్తనాలు నాటుతారని వ్యవసాయ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. 

అప్పులెట్ల తీర్చాలో..

మూడెకరాలలో పత్తి పంట సాగు చేశా. ఇప్పటివరకు రూ.లక్ష అప్పు చేసి పెట్టుబడి పెట్టా. అనుకోకుండా కురిసిన వానలతో దిగుబడి తగ్గింది. ఎకరానికి 6 క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడి రాలేదు. పత్తి అమ్మితే రూ.80 వేలు వచ్చాయి. వీటితో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు.

‒ దామెరకొండ నర్సయ్య, శాయంపేట, హనుమకొండ జిల్లా 

పెట్టుబడి పెరిగింది

రెండెకరాల్లో పత్తి పంట వేశా. వర్షాల కారణంగా పంట మొత్తం ఖరాబైంది. ఎకరానికి రూ.30వేల చొప్పున రూ.60 వేలు పెట్టుబడి పెట్టా. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని పూత, కాత రాలిపోయింది. పండిన కాస్త పత్తిని ఏరడానికి 50 మంది కూలీలు అవసరమయ్యారు. ఎకరానికి 3 క్వింటాళ్ల చొప్పున 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పత్తి అమ్మితే వచ్చే డబ్బులతో అప్పులు తీరవు. 

‒ గొట్టం రవీందర్‌‌, వెంకటాపూర్‌, ములుగు జిల్లా