- నోటీసు లేకుండా ఐడీ బ్లాక్ చేయొద్దు
- గిగ్ వర్కర్ల సంక్షేమ నిబంధనలు అమల్లోకి
- తొలగించాలంటే 7 రోజుల ముందు లిఖితపూర్వక నోటీసు
- రేటింగ్ తగ్గింపు, బ్లాక్‌లిస్ట్‌ల వేధింపులపై నిషేధం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి గిగ్ వర్కర్‌కు ఆధార్‌తో అనుసంధానమైన జీవితకాల గుర్తింపు సంఖ్య (జీఐడీ) రానుంది. ఈ ఐడీ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో జీవితాంతం చెల్లుతుంది. అదే సమయంలో ఎలాంటి నోటీసు లేకుండా యాప్ కంపెనీలు గిగ్ వర్కర్ల ఐడీలు బ్లాక్ చేసి రోడ్డున పడేసే రోజులకు చెక్ పడింది. ఏ కార్మికుడినైనా తొలగించాలంటే కనీసం ఏడు రోజుల ముందు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాల్సిందేనని, ఆటోమేటెడ్ అల్గారిథమ్‌లతో అకస్మాత్తుగా తొలగించొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్‌లిస్ట్ చేయడం, కావాలని రేటింగ్ తగ్గించడం, ఇన్సెంటివ్‌లు రద్దు చేయడం వంటి దొడ్డిదారి శిక్షలపై నిషేధం విధించింది.
‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ నిబంధనలు–2026’శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. గిగ్ వర్కర్ల చట్టానికి అనుగుణంగా రూపొందించిన ఈ నిబంధనలపై కార్మిక శాఖ తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముసాయిదాపై 45 రోజుల పాటు ప్రజలు, కార్మిక సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి తుది నిబంధనలు ఖరారు చేసింది. రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ నిబంధనలు విడుదలయ్యాయి.
15 పనిదినాల్లో జీఐడీ
గిగ్ వర్కర్లు బోర్డు వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా పౌరసేవా కేంద్రాల ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు పరిశీలించిన 15 పనిదినాల్లో జీఐడీ జారీ చేయాలి. రైడ్ షేరింగ్, ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్, ఈ-కామర్స్, గృహ సేవల ప్లాట్‌ఫామ్‌లన్నీ 45 రోజుల్లో బోర్డు పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, తమ దగ్గర పనిచేసే కార్మికుల వివరాలు అనుసంధానించాలి. ప్రతి నెలా ఏడో తేదీలోగా కార్మికుల సంఖ్య, ప్రతి త్రైమాసికంలో కొత్తగా చేరిన, వెళ్లిపోయిన వారి వివరాలు అప్డేట్ చేయాలి. కార్మికుల వ్యక్తిగత డేటాను డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం–2023 ప్రకారం భద్రపరచాలి, సామాజిక భద్రత అవసరాలకే వాడాలి. నిబంధనలు పాటించని కంపెనీలకు 30 రోజుల గడువుతో నోటీసు ఇచ్చి జరిమానాలు విధిస్తారు.
తొలగింపుపై హెచ్ఆర్ సమీక్ష తప్పనిసరి
తొలగింపుపై విచారణ ముగిసిన 7 రోజుల్లోగా తుది నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలి. ఈ నిర్ణయాన్ని కంపెనీ హెచ్ఆర్ అధికారి స్వయంగా సమీక్షించి, కారణాలు రికార్డుల్లో నమోదు చేశాకే అమలు చేయాలి. ప్రతి నెలా తొలగింపుల నివేదికను బోర్డుకు పంపాలి. వినియోగదారులకు ప్రమాదం ఉన్నప్పుడు, మహిళలు, పిల్లలపై నేరాలు, శారీరక దాడుల కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు, ఆర్థిక మోసాలకు పాల్పడినప్పుడు తొలగింపునకు అనుమతి ఉంటుంది. అప్పుడు కూడా 24 గంటల్లో కారణాలు చెప్పాలి.
7 రోజుల్లో పేమెంట్.. ఫీజు కంపెనీలదే
ప్రతి అగ్రిగేటర్ సంస్థ పేఅవుట్ సైకిల్ ముగిసిన 7 రోజుల్లోగా గిగ్ వర్కర్ల బ్యాంక్ ఖాతాల్లో సంపాదన జమ చేయాలి. స్థూల ఆదాయం, కోతలకు కారణాలు, నికర వేతనం స్పష్టంగా కనిపించేలా డిజిటల్ పత్రం ఇవ్వాలి. ప్రతి లావాదేవీ పేఅవుట్పై గరిష్ఠంగా రెండు శాతం సంక్షేమ నిధి ఫీజు విధిస్తారు. ఈ ఫీజును పూర్తిగా కంపెనీలే భరించాలి; ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల సంపాదన నుంచి, కమీషన్ల నుంచి కట్ చేయొద్దు. టిప్స్, ఇన్సెంటివ్‌లు, రెఫరల్ బోనస్‌లను ఫీజు లెక్కింపు నుంచి మినహాయించారు. కంపెనీలు ప్రతి నెలా ముగిసిన ఐదు పనిదినాల్లో ఫీజును బోర్డు ఖాతాలో జమ చేయాలి; దీన్ని రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తారు. ఫీజు చెల్లింపు ఆలస్యమైతే వడ్డీ వసూలు చేస్తారు.
సంక్షేమ నిధితో బీమా, పింఛన్
సంక్షేమ ఫీజు, కంపెనీల విరాళాలు, సీఎస్ఆర్ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లతో సంక్షేమ నిధి నడుస్తుంది. ఈ నిధితో గిగ్ వర్కర్లకు జీవిత బీమా, ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్య ప్రయోజనం, వైద్య సాయం, మహిళలకు ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య పింఛన్ అమలు చేస్తారు. అర్హతకు కనీస పని గంటలను బోర్డు నిర్ణయిస్తుంది. కానీ పని వేళల్లో కార్మికుడు చనిపోతే ఈ నిబంధన వర్తించదు. బోర్డు పాలనా ఖర్చులు వార్షిక వసూళ్లలో 5 శాతానికి మించొద్దని, రూ.లక్షకు మించిన ఏ ఖర్చుకైనా బోర్డు ముందస్తు ఆమోదం తప్పనిసరి అని పరిమితి విధించారు. కార్మికుల భద్రత కోసం యాప్‌లలో పానిక్ బటన్, హెల్ప్‌లైన్ నంబర్లు, ప్రథమ చికిత్స వివరాలు ఉంచాలని, లైంగిక వేధింపుల నివారణ చట్టం–2013పై 30 రోజుల్లో శిక్షణ పూర్తి చేయాలని, ఏటా జులై 31లోగా భద్రతా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఫిర్యాదులకు మూడంచెల వ్యవస్థ
వంద మందికి పైగా కార్మికులున్న ప్రతి సంస్థ అంతర్గత వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీలో సంస్థ సీనియర్ ప్రతినిధి చైర్‌పర్సన్‌గా, ఇద్దరు మేనేజ్మెంట్ సభ్యులు, ముగ్గురు సీనియర్ గిగ్ వర్కర్లు ఉండాలి. వర్కర్లలో ఇద్దరు మహిళలు ఉండాలి. అల్గారిథమ్ వివక్ష, అకారణ తొలగింపు, వేతనాల కోతలు, పని పరిస్థితులపై 7 పనిదినాల్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన మూడు పనిదినాల్లో రసీదు, 14 రోజుల్లో చర్యల నివేదిక, 30 రోజుల్లో తుది ఉత్తర్వులివ్వాలి. దానిపై అసంతృప్తి ఉంటే జిల్లా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ అధికారి (జీఆర్వో)కి అప్పీల్ చేసుకోవచ్చు. ఆయన 30 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. ఆ ఉత్తర్వులపై 90 రోజుల్లో డిప్యూటీ కమిషనర్ స్థాయి అప్పిలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. అథారిటీ 90 రోజుల్లో తుది తీర్పు ఇస్తుంది, దాన్ని బోర్డు 60 రోజుల్లో అమలు చేయాలి.
ఉల్లంఘిస్తే జరిమానాలు ఇలా..
- సంక్షేమ ఫీజు ఎగ్గొడితే మొదటిసారి రూ.50 వేలు, రెండోసారి రూ.లక్ష, మూడోసారి రూ.1.50 లక్షలు
- మూడోసారి జరిమానా పడితే సంస్థ గుర్తింపు రద్దుకు బోర్డు సిఫార్సు
- నాలుగోసారి నుంచి చెల్లించాల్సిన ఫీజుకు ఐదు రెట్ల పెనాల్టీ
- నివేదికలు ఇవ్వని సంస్థలకు రూ.50 వేల దాకా జరిమానా
- జరిమానాకు ముందు 15 రోజుల షోకాజ్ నోటీసు
- 30 రోజుల్లో కట్టకపోతే భూ రెవెన్యూ బకాయిల మాదిరిగా రికవరీ
- మూడుసార్లకు మించి ఉల్లంఘిస్తే రాజీకి అవకాశం లేదు
- తనిఖీల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 15 రోజుల్లో బోర్డుకు నివేదిక
