
- సభ్యులుగా మంత్రులు తుమ్మల, జూపల్లి
- మెంబర్ కన్వీనర్‌గా ఇరిగేషన్ శాఖ కార్యదర్శి
- రేపు సెక్రటేరియెట్లోతొలి మీటింగ్
హైదరాబాద్, వెలుగు: సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా పేరుకుపోయిన పూడిక తొలగించి, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర సర్కారు నడుంబిగించింది. దీనికోసం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో డ్యామ్‌లు, రిజర్వాయర్ల పునరుద్ధరణకు సంబంధించిన విధివిధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనున్నది. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఈ మంత్రివర్గ ఉపసంఘం.. రాష్ట్రంలోని కీలకమైన భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక.. ప్రారంభ, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యాలపై స్టడీ చేసి రిపోర్టును ప్రభుత్వానికి సమర్పిస్తది. అందుకు అనుగుణంగా పూడికతీత పనులు, నివారణ చర్యలు చేపడుతుంది. కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు సెక్రటేరియెట్‌లోని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ చాంబర్లో కేబినెట్ సబ్ కమిటీ తొలిసారి భేటీ కానున్నది.
పూడికతీతపై గత ప్రభుత్వాల నిర్లక్ష్యం
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పూడికతీత విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ప్రాజెక్టుల్లో పూడిక చేరకుండా చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ఉదాహరణకు మహారాష్ట్ర నుంచి శ్రీరాంసాగర్, కడెం, గడ్డెన్నవాగులాంటి ప్రాజెక్టుల్లోకి వరదనీటితో పాటు భారీగా నల్లమట్టి వచ్చి చేరుతున్నదని చాలా ఏండ్ల కిందే ఇంజినీర్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా చోట్ల పెద్దసంఖ్యలో సిల్ట్ అరెస్ట్ ట్యాంకులు ఏర్పాటు చేశారు.
కానీ.. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎప్పట్లాగే తయారైంది. ఉత్తర తెలంగాణకు అత్యంత కీలకమైన శ్రీరామ్ సాగర్ లో పూడిక సమస్య తీవ్రంగా ఉంది. నిర్మాణ సమయంలో 112 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్.. 1994 సర్వే ప్రకారం.. 90 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుత నిల్వ సామర్థ్యం కేవలం 80.50 టీఎంసీలుగా చెప్తున్నా.. 2013–-14 సర్వే ప్రకారం..70 టీఎంసీలకు మించి లేదు. ఇలా ఏండ్ల తరబడి పూడిక తొలగించకపోవడంతో రాష్ట్రంలోని పలు డ్యామ్‌లు, రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయినట్లు సీనియర్ ఇంజినీర్లు చెప్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ రిపోర్టు ఇంకా రాలే
శ్రీశైలం ప్రాజెక్టుపై ముంబైకి చెందిన 12 మంది నిపుణుల బృందం 2021లో సర్వే చేసినా రిపోర్ట్ ఇంకా రాలేదు. 2010 నుంచి ఇప్పటివరకు ఆ రెండు కీలక ప్రాజెక్టుల సామర్థ్యం మరింతగా పడిపోయి ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మరో 30 నుంచి 40 టీఎంసీల వరకు పూడిక పేరుకుపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తున్నది. వాస్తవానికి ఆయా ప్రాజెక్టుల్లో పూడిక తీసేందుకు డ్రెడ్జింగ్ చేపట్టాలని 2010 సర్వే రిపోర్ట్ ఆధారంగా అప్పటి ప్రభుత్వం అనుకున్నా.. ప్రాజెక్టుల భద్రత, ఆర్థిక కారణాల దృష్ట్యా అది ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో సెడిమెంట్ మేనేజ్మెంట్పై స్టడీ చేయించేందుకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
భారీగా తగ్గిన సాగర్, శ్రీశైలం సామర్థ్యం
రెండు తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఆయువుపట్టుగా ఉంటున్నాయి. ఆయా ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికపై చివరిసారిగా ఉమ్మడి ఏపీలో 2010లో ‘‘ఏపీ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ’’ సర్వే చేసింది. 2009లో వచ్చిన భారీ వరదలతో ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ పెద్దఎత్తున పూడిక పేరుకుపోయిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దీంతో ఆ మరుసటి ఏడాది సర్వే చేయించగా, పూడికవల్ల ఈ రెండు ప్రధాన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 100 టీఎంసీల మేర పడిపోయినట్లు తేలింది. 408 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును 1960లో ప్రారంభిస్తే.. 2010 నాటికి సామర్థ్యం 312 టీఎంసీలకు తగ్గిపోయింది. 1981లో 308 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం.. 1990లో సర్వే చేయగా 263 టీఎంసీలకు, 2010 సర్వేలో 215 టీఎంసీలకు పడిపోయింది. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రెండు ప్రాజెక్టులే కాకుండా మిగతా ప్రాజెక్టుల పూడిక సమస్యపై సర్వేగానీ, అధ్యయనంగానీ చేయలేదు.