రాష్ట్రంలోఅన్నీ పిరమే.. ద్రవ్యోల్బణంలో తెలంగాణే టాప్​

రాష్ట్రంలోఅన్నీ పిరమే.. ద్రవ్యోల్బణంలో తెలంగాణే టాప్​
  • రాష్ట్రంలోఅన్నీ పిరమే.. ద్రవ్యోల్బణంలో తెలంగాణే టాప్​
  • మార్చిలో 7.63%, జనవరిలో 8.58%, ఫిబ్రవరిలో 8.56% గా నమోదు
  • జాతీయ సగటు కన్నా మన దగ్గరే ఇన్​ఫ్లేషన్​రేటు అధికం
  • పాలు, కూరగాయలు, పెట్రోల్​ వరకు అన్ని ధరలు భగ్గుమంటున్నయ్​
  • పెరిగిన కరెంట్​ చార్జీలు, బస్సు
  • కిరాయిలతో సామాన్యుడికి ఇంకిన్ని తిప్పలు

హైదరాబాద్​, వెలుగు: దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే అన్నిటి ధరలు భగ్గుమంటున్నాయి. పాలు మొదలు పెట్రోల్​ దాకా అన్నీ పిరమైనయ్​. అత్యధిక ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రం తెలంగాణే. ఈ ఏడాది వరుసగా మూడు నెలలు ద్రవ్యోల్బణంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. కన్జూమర్​ ప్రైసెస్​ ఇండెక్స్​ (సీపీఐ) రిపోర్ట్​ను ఇటీవల ఆర్బీఐ విడుదల చేసింది. అందులో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ టాప్​లో నిలిచింది. మార్చి నెలలో 7.63 శాతం ఇన్​ఫ్లేషన్​ రేట్​తో మన రాష్ట్రం ముందుంది. అది జాతీయ సగటు 5.66 శాతంతో పోలిస్తే అధికం. ఫిబ్రవరి, జనవరిలోనూ ఇంత కన్నా ఎక్కువ ద్రవ్యోల్బణం రికార్డయింది. మన రాష్ట్రంలో ఇన్​ఫ్లేషన్​ రేటు జనవరిలో 8.58 శాతం, ఫిబ్రవరిలో 8.56 శాతంగా రికార్డయింది. ఆయా నెలల్లోనూ జాతీయ సగటు 6.52 శాతం, 6.44 శాతంతో పోలిస్తే తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఆ రెండు నెలలతో పోలిస్తే మార్చిలో ఇన్​ఫ్లేషన్​ రేటు కాస్త తగ్గినా.. టాప్​లో మాత్రం తెలంగాణే ఉంది. ఇది రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిని సూచిస్తున్నది. 

2012తో పోలిస్తే ధరలు 80% పైనే పెరిగినయ్​

కొన్ని నెలలుగా రాష్ట్రంలో ప్రతి వస్తువు పిరమైంది. పప్పులు, ఉప్పులు, కూరగాయల దగ్గర్నుంచి పెట్రోల్​ దాకా అన్ని రేట్లు  మండిపోతున్నాయి. 2012 ప్రామాణికంగా 100 బేసిస్​ పాయింట్లను లెక్కలోకి తీసుకుంటే.. ప్రస్తుతం అన్ని వస్తువుల రేట్లు 80 శాతానికిపైగానే పెరిగాయి. పెట్రోల్​, డీజిల్​ ధరలు 77 శాతం ఎక్కువయ్యాయి. బట్టలు, చెప్పుల ధరలూ రెట్టింపయ్యాయి. పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, కూరగాయల ధరలు 80 శాతం కన్నా ఎక్కువయ్యాయి. ఏ కూరగాయలు తీసుకుందామన్నా కిలోకు రూ. 60కి తక్కువ లేదు. ఇటు కందిపప్పు కిలో ధర రకాన్ని బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు పలుకుతున్నది. వంట నూనెల ధరలూ ఎక్కువయ్యాయి. లీటర్​ పల్లీ నూనె రూ. 200కు (ఎంఆర్​పీ)  చేరువైంది. సన్​ఫ్లవర్​ నూనె ధర కూడా రూ.140 అయింది. 

పెట్రోల్​, డీజిల్​ రేట్లలో తెలంగాణ సెకండ్​

రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ రేట్లు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా అధికంగా ఉన్నాయి. నిరుడు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్​ ట్యాక్స్​లను తగ్గించడంతో చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వ్యాట్​ను తగ్గించుకున్నాయి. దీంతో లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై సగటున రూ.10 వరకు ఆయా రాష్ట్రాల్లో  తగ్గింది. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం వ్యాట్​ను తగ్గించలేదు. ప్రస్తుతం దేశంలో అత్యధిక పెట్రోల్​, డీజిల్​ రేట్లున్న రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్​లో లీటర్​ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉండగా.. ఆ తర్వాత తెలంగాణలోనే రూ.109.66గా ఉంది. డీజిల్​ రేట్లూ అదే స్థాయిలో ఉన్నాయి. ఏపీలో అత్యధికంగా రూ. 98.27కాగా.. తెలంగాణలో రూ.97.82గా ఉంది. నేషనల్​ కో ఆపరేటివ్​ డెయిరీ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​ ప్రకారం.. పాల ధరల్లోనూ తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

ఉత్తరాఖండ్​లో లీటర్​ పాల ధర సగటున రూ.62 ఉండగా.. తెలంగాణలో రూ.61 ఉంది. కొద్ది నెలల కిందట్నే రాష్ట్ర సర్కారు పాల ధరలను రూ. 2 నుంచి రూ.4 మేర పెంచింది. రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ రేట్లను తగ్గించకపోవడం.. ట్రాన్స్​పోర్టేషన్​ ధరలూ ఎక్కువ కావడంతో సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారింది. నెలకు రూ. 4 వేలు పెట్టనిదే ఇంట్లో సరుకులు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు ఏదైనా జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళ్దామన్నా డాక్టర్​ ఫీజులూ భారీగా పెరిగాయి. గత ఏడాది వరకు సగటున డాక్టర్​ ఓపీ ఫీజులు రూ.400 ఉండగా.. ఇప్పుడు మినిమమ్​ కన్సల్టేషన్​ ఫీజే రూ.500గా ఉంది. మందుల ధరలు కూడా వంద శాతం పెరిగాయి.