పీపాలు పీపాలు తాగేస్తున్నారా.. : మందు కొట్టడంలో తెలంగాణ టాప్

పీపాలు పీపాలు తాగేస్తున్నారా.. : మందు కొట్టడంలో  తెలంగాణ టాప్
  • రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నరు
  • బీర్లు 11 లీటర్ల దాకా తాగుతున్నరు
  • ఎక్సైజ్ డిపార్ట్‌‌మెంట్ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లిక్కర్, బీరు తాగుట్ల రాష్ట్రం ముందున్నది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవిస్తున్నారు. రాష్ట్రంలో పర్ క్యాపిటా లిక్కర్ వినియోగం గడిచిన సంవత్సరంలో 9 లీటర్లుగా, బీరు వినియోగం 10.7 లీటర్లుగా నమోదైంది. లిక్కర్ సేల్స్, వినియోగంపై ఇటీవల సీఎం రేవంత్‌‌రెడ్డికి సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలను ఎక్సైజ్ డిపార్ట్‌‌మెంట్ వెల్లడించింది. ఏపీ, తమిళనాడు, కేరళలను మించి తెలంగాణలో లిక్కర్ వినియోగం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఆదాయం కూడా భారీగా సమకూర్చుకుంటున్నట్లు వివరించింది.

జనాభా తక్కువ.. లిక్కర్ వినియోగం ఎక్కువ

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.52 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రాతిపదికన ఒక ఏడాదిలో లిక్కర్ సేల్స్, వినియోగంపై ఎక్సైజ్ శాఖ లెక్కలు వేసింది. దీని ప్రకారం ఏపీ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ.. లిక్కర్, బీర్ల వినియోగం తక్కువగా ఉంది. ఏపీలో 4.93 కోట్ల మంది ఉండగా.. అక్కడ 2022–23లో 3.35 కోట్ల లిక్కర్ (ఐఎంఎల్) కేస్‌‌‌‌లు సేల్ అయ్యాయి. తలసరి మద్యం వినియోగం 6.04 లీటర్లు. అదే బీర్ల విషయానికొస్తే 1.16 కోట్ల కేస్‌‌‌‌లు అమ్ముడుపోగా.. సగటున ఒక్కొక్కరు కేవలం 1.86 లీటర్లు తాగుతున్నారు. తమిళనాడులో 7.21 కోట్ల జనాభా ఉంటే అక్కడ గడిచిన సంవత్సరంలో 5.69 కోట్ల లిక్కర్ కేస్‌‌‌‌లు అమ్ముడుపోయాయి. దీని ప్రకారం అక్కడ తలసరి లిక్కర్ వినియోగం 7.66 లీటర్లు. అదే బీర్ల విషయానికొస్తే 3.75 లీటర్లు సేవిస్తున్నారు. కేరళ జనాభా దాదాపు తెలంగాణతో సమానం. అక్కడ తలసరి లిక్కర్ వినియోగం 5.93 లీటర్లు, బీర్ల వినియోగం 2.63 లీటర్లు. ఒక్క ఐఎంఎల్ కేస్​ను 8.88 లీటర్లుగా లెక్కిస్తారు.

ఆదాయంలోనూ మనమే

లిక్కర్ తాగడంలోనే కాకుండా.. భారీగా రాబడి సమకూర్చుకుంటున్న దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత తెలంగాణే టాప్​లో ఉంది. తమిళనాడులో లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉండటంతో.. తక్కువ మొత్తంలో సేల్స్ ఉంటున్నా ఆదాయం భారీగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2022–23లో తెలంగాణలో రూ.33,268 కోట్లు, ఏపీలో రూ.23,804 కోట్లు, కర్నాటకలో రూ.29790కోట్లు, కేరళలో రూ.16,189 కోట్ల ఆదాయం వచ్చింది.

లిక్కర్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌పై కొత్త సర్కార్ ఫోకస్

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్.. డ్రగ్స్, లిక్కర్ సేల్స్‌‌‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. డ్రగ్స్‌‌‌‌ను పూర్తి స్థాయిలో నివారించడంతో పాటు లిక్కర్ సేల్స్‌‌‌‌ను నియంత్రణలోకి తీసుకురావాలని చూస్తున్నది. ఇదే విషయమై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సంకేతాలు పంపారు. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులతో జరిపిన ఉన్నత స్థాయి సమీక్షలోనూ బెల్ట్ షాపులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిస్థాయిలో తీసివేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో వైన్స్, బార్లను కంట్రోల్ చేయనున్నట్లు సమాచారం.