టీఎస్​పీఎస్సీ చైర్మన్​ రాజీనామా

టీఎస్​పీఎస్సీ చైర్మన్​ రాజీనామా
  • సీఎం రేవంత్​ను కలిసిన గంటలోనే నిర్ణయం
  • రిజైన్ లేఖను రాజ్‌‌భవన్‌‌లో అందజేసిన జనార్దన్‌‌రెడ్డి
  • ఆమోదించి, సీఎస్‌‌కు సమాచారమిచ్చిన గవర్నర్ ఆఫీస్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌‌పీఎస్సీ) చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవి నుంచి తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం రాజ్‌‌భవన్‌‌లో అందజేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గంటలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జనార్దన్‌‌రెడ్డి రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై.. ఈ సమాచారాన్ని సీఎస్‌‌కు అందించారు.

సచివాలయం నుంచి నేరుగా రాజ్ భవన్‌‌కు

సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయన అపాయింట్ మెంట్ కోసం జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన్ను కలిసేందుకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సీఎంఓ నుంచి జనార్దన్‌‌రెడ్డికి ఫోన్ వచ్చింది. దీంతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిశారు. టీఎస్‌‌పీఎస్సీలో జరిగిన అంశాలను సీఎంకు వివరించారు.

తమ తప్పేమీ లేదని చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో టీఎస్‌‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకున్నట్టు సీఎం ఆయనతో చెప్పినట్టు తెలిసింది. తర్వాత సచివాలయం నుంచి బయటకు వచ్చి.. నేరుగా రాజ్ భవన్‌‌కు జనార్దన్‌‌రెడ్డి వెళ్లారు. అక్కడ గవర్నర్ తమిళిసై లేకపోవడంతో రాజ్ భవన్ అధికారులకు రాజీనామా లేఖను అందించారు. 

వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్న జనార్దన్ రెడ్డి 2021 మే 21న టీఎస్‌పీఎస్సీ చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి కమిషన్ బాధ్యతలు స్వీకరించారు. 2024 నవంబర్ వరకు చైర్మన్ గా ఉండేందుకు ఆయనకు అవకాశం ఉంది. కానీ దాదాపు ఏడాది ముందే ఆయన తప్పుకున్నారు.

మెంబర్లదీ అదే దారి?

టీఎస్‌పీఎస్సీలో ప్రస్తుతం ఐదుగురు మెంబర్లున్నారు. ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రానంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ 2021 మే 21న సభ్యులుగా చేరారు. వీరిలో కొందరు బీఆర్ఎస్ లీడర్లుగా కొనసాగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రావడంతో వీరు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితారాంచంద్రన్‌నూ ఆ బాధ్యత నుంచి తప్పించే అవకాశం ఉంది. మళ్లీ కొత్తగా కమిషన్‌ను నియమించాలని సర్కారు భావిస్తున్నది.

వివాదాల కమిషన్

గ్రూప్1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో అప్పటికే నిర్వహించిన ఆయా పరీక్షలను టీఎస్​పీఎస్సీ రద్దు చేసింది. కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ లీకులతో సంబంధం ఉన్న సుమారు వంద మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే కమిషన్ సెక్రటరీపై గానీ, సెక్షన్ ఆఫీసర్‌‌పై గానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనలు చేశారు.

మరోపక్క నిరసనల మధ్యనే రెండోసారి గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వహించారు. కానీ ఈ ఎగ్జామ్ విషయంలో కూడా నిబంధనలు అమలు చేయలేదనే ఆరోపణలతో హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో నిరుద్యోగుల్లో టీఎస్​పీఎస్సీపై నమ్మకం తగ్గింది. కమిషన్ చైర్మన్, సెక్రటరీ సహా మెంబర్లను తొలగించాలనే నిరుద్యోగులు, రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీకి ఎన్నికలు రావడంతో ప్రతిపక్షాలకు ఇదే ప్రధాన ఎజెండాగా మారింది.

కాంగ్రెస్ పార్టీ ఏకంగా పలు పోటీపరీక్షల షెడ్యూల్‌తో కూడిన జాబ్ క్యాలెండర్‌‌ను రిలీజ్ చేసింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి జనార్దన్ రెడ్డి తప్పుకున్నారు.

అశోక్ నగర్‌‌‌‌లో నిరుద్యోగుల సంబురాలు

టీఎస్‌‌పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో అశోక్ నగర్‌‌‌‌లో నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ రియాజ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి యువకులు పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కారణంగా నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. జనార్దన్ రెడ్డి రాజీనామాతో టీఎస్‌‌పీఎస్సీ ప్రక్షాళన అవుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని, నిరుద్యోగుల పోరాటానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చేయని తప్పుకు శిక్ష అనుభవించిన :  జనార్దన్ రెడ్డి

తన 30 ఏండ్ల సర్వీస్‌లో ఎలాంటి రీమార్క్ లేదని, కానీ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాకే అనేక అవమానాలు ఎదుర్కొన్నానని జనార్దన్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆయన్ను కలిసిన మీడియాతో మాట్లాడారు. తన సర్వీసులో ఎప్పుడూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదని, చేయని తప్పుకు శిక్ష అనుభవించానని పేర్కొన్నారు.

రిక్రూట్‌మెంట్‌పై రివ్యూ వాయిదా

టీఎస్‌పీఎస్సీతో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరగాల్సిన సమీక్ష వాయిదా పడింది. ఈ రివ్యూ సచివాలయంలో ఉదయం జరగాల్సి ఉండగా.. రైతుబంధు, వ్యవసాయ శాఖపై సీఎం సుదీర్ఘ సమావేశం నేపథ్యంలో వాయిదా పడిందని అధికారులు చెప్పారు. త్వరలో మళ్లీ రివ్యూ జరిగే అవకాశం ఉందని తెలిపారు.