నిజామాబాద్ లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గణేష్ నిమజ్జనం తర్వాత.. గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. వీసీ డబ్బులు ఎగురవేస్తూ.. డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో వీసీ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసే రవీందర్ గుప్తా.. రెండు రోజుల క్రితం ఓ మహిళా ప్రొఫెసర్ ను దుర్భాషలాడి మరో వివాదానికి తెర తీశారు.
తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కొత్త వీసీ వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీలో నిత్యం ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంది. ఏడు నెలల కింద నియమించిన రిజిస్ట్రార్ ను తొలగించడంతో, మరోసారి ఆ వర్సిటీ వార్తల్లో నిలిచింది. అనేక ఆరోపణలు వస్తున్నా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అప్పట్లో విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో నిరుడు మే 22న యూనివర్సిటీలకు సర్కారు వైస్చాన్సలర్లను నియమించింది. దీంట్లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీకి ప్రొఫెసర్ రవీందర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఏండ్లుగా ఇన్ చార్జి పాలనలో మగ్గిన తెలంగాణ వర్సిటీకి మంచిరోజులొచ్చాయని ఆశించిన ప్రొఫెసర్లు, స్టూడెంట్లకు నిరాశే మిగిలింది. ఆయన వచ్చినప్పటి నుంచి ఏవో వివాదాలు నడుస్తూనే ఉన్నాయని, అవన్నీ కూడా వీసీ చుట్టే తిరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియమాకం నుంచి రిజిస్ట్రార్ల తొలగింపు వరకూ ఏదో లొల్లి జరుగుతూనే ఉంది. వర్సిటీ అభివృద్ధిపై కాక వసూళ్లపైనే వీసీ దృష్టి పెట్టారనే ఆరోపణలూ వస్తున్నాయి.
