తైవాన్‌ అధ్యక్ష రేసులో ఫాక్స్‌కాన్‌ ఫౌండర్.. ఎదురయ్యే సవాళ్లు ఇవే..!

తైవాన్‌ అధ్యక్ష రేసులో ఫాక్స్‌కాన్‌ ఫౌండర్.. ఎదురయ్యే సవాళ్లు ఇవే..!

తైపీ : తైవాన్ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. 2024లో జరిగే ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రముఖ బిలియనీర్‌, ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ అధినేత టెర్రీ గౌ (Terry Gou) ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన టెర్రీ గౌ.. వివిధ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సోమవారం (ఆగస్టు 28వ తేదీ) ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్తున్న టెర్రీ గౌ.. ప్రస్తుతం తైవాన్ లో అధికారంలో ఉన్న డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (DPP)పై విమర్శలు చేస్తున్నారు. డీపీపీ విధానాలు తైవాన్‌ను చైనాతో యుద్ధం ముప్పులోకి నెట్టేశాయని ఆరోపించారు.

కనీసం ఒక్కసారి అయినా తైవాన్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని కలలుగంటున్న టెర్రీ గౌ... 2019లో ఫాక్స్ కాన్ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అదే సంవత్సరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్ష కువోమింగ్‌తాంగ్‌ పార్టీలో చేరారు.

కువోమింగ్‌తాంగ్‌ పార్టీ.. తనను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తుందని అనుకున్నాడు. కానీ.. ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేట్‌ కాకపోవడంతో అప్పుడు తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్‌ ప్రోగ్రోసివ్‌ పార్టీ అభ్యర్థి అయిన త్సాయి ఇంగ్‌ వెన్‌ (Tsai Ing-wen) అధ్యక్షురాలిగా విజయం సాధించారు.

తాజాగా మరోసారి కువోమింగ్‌తాంగ్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. కానీ.. ఈ సారి కూడా టెర్రీ గౌను కాకుండా న్యూ తైపీ సిటీ మేయర్‌ హు యు ఇయ్‌ను ఎంపిక చేశారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, బయటకు వచ్చారు. మూడు నెలల నుంచి ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

చైనాకు తూర్పు దిశన180 కిలోమీటర్ల దూరంలో తైవాన్ చిన్న దేశంగా ఉంది. దానికి ఉత్తరాన, ఈశాన్యాన తూర్పు చైనా సముద్రం ఉంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో తైవాన్ ఒక రాష్ట్రమని డ్రాగన్ కంట్రీ చెబుతోంది. తమది రిపబ్లిక్ ఆఫ్ చైనా(ఆర్ఓసీ) పేరు గల స్వతంత్ర దేశమని తైవాన్ వాదిస్తోంది. తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించవద్దని ఇతర దేశాలపై చైనా దౌత్యపరంగా ఒత్తిడి తెస్తోంది. తైవాన్ ప్రజాస్వామిక దేశంగా ముందుకు సాగడం చైనాకు కంటగింపుగా ఉంది. 

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌కు ఫాక్స్‌కాన్‌ ప్రధాన ముడిసరుకు సరఫరాదారుగా ఉన్న విషయం తెలిసిందే. చైనాలో ఈ కంపెనీకి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. తైవాన్‌ను చైనా తమ భూభాగంగానే పరిగణిస్తోంది. ఇక్కడి ప్రధాన ప్రతిపక్షమైన కువోమింగ్‌తాంగ్‌ పార్టీకి చైనాతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు తైవాన్‌ ప్రయత్నిస్తున్న వేళ.. 2024 జనవరిలో జరిగే అధ్యక్ష ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.