
- క్యాండీల్లో సైనైడ్ కలిపి.. 12 మంది ఫ్రెండ్స్ హత్య?
- థాయిలాండ్‌లో దారుణం.. నిందితురాలు అరెస్ట్
- డబ్బు కోసం హత్యలు చేసినట్లు అనుమానాలు
బ్యాంకాక్: సైనైడ్ ఇచ్చి12 మంది ఫ్రెండ్స్‌ను ఓ మహిళ హత్య చేసిన ఘటన థాయిలాండ్‌లో వెలుగు చూసింది. క్యాండీల్లో సైనైడ్ పెట్టి ఇస్తూ గత రెండున్నరేండ్లలో ఆమె ఈ హత్యలకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. థాయిలాండ్‌కు చెందిన సరరత్ రంగ్‌సివుతాపోర్న్(32) అనే మహిళ ఓ మాజీ పోలీసు ఆఫీసర్ భార్య. ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఆమె స్నేహితురాలి కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం బ్యాంకాక్‌లో అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. సరరత్ తన స్నేహితురాలు సిరిపోర్న ఖాన్వాంగ్‌తో కలిసి ఇటీవల రచ్చబురి ప్రాంతానికి టూర్ వెళ్లింది. అక్కడ వారు నదిలో బౌద్ధ పూజలు నిర్వహించారు.
పూజ ముగించుకొని వస్తుండగా సిరిపోర్న నది ఒడ్డున కుప్పకూలి మరణించింది. పోస్టుమార్టంలో ఆమె శరీరంలో సైనైడ్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆమె ఫోన్, డబ్బులు, నగల బ్యాగ్ కూడా కనిపించకపోవడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్మొదలుపెట్టారు. దర్యాప్తులో సరరత్ హత్య చేసినట్లుగా ఆధారాలు లభించాయి. అదే టైమ్‌లో ఆమె మాజీ ప్రియుడితో సహా 11 మంది ఫ్రెండ్స్కూడా ఇలాగే 2020 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ మధ్య అనుమానాస్పదంగా సైనైడ్ ప్రభావంతోనే చనిపోయారు. వారంతా 33 నుంచి 44 ఏండ్ల వారని, మృతులకు సంబంధిచిన డబ్బు, నగలు ఇలాగే చోరీ అయ్యాయని పోలీసులు చెప్పారు. దీంతో సరరతే డబ్బు కోసం హత్యలు చేసినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 13 మంది మృతిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.