అలాంటి వాళ్లను కాల్చేయండి..శ్రీలంక రక్షణ శాఖ ఆదేశాలు

అలాంటి వాళ్లను కాల్చేయండి..శ్రీలంక రక్షణ శాఖ ఆదేశాలు
  • మహింద రాజపక్స దేశం వీడిచి పారిపోకుండా చెక్ పాయింట్లు

శ్రీలంక  : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రక్షణ శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీని దోచుకునేందుకు ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని (శ్రీలంక) సైన్యానికి (Army) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఎవరైనా ఇతరులపై దాడి చేసినా, హాని చేసినా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. వారెంట్ లు లేకుండా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అధికారాలను కూడా కట్టబెట్టింది. దీంతో వందల మంది నిరసనకారులను పోలీసులు జైళ్లకు తరలిస్తున్నారు. 

శ్రీలంకలో తీవ్ర సంక్షోభం
హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం శ్రీలంక తగలబడిపోతోంది. సోమవారం (ఈనెల 11వ తేదీ) ఉధృత స్థాయికి చేరిన హింసాత్మక అల్లర్లు మంగళవారం (ఈనెల 10వ తేదీ) నాటికి తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారని, 220 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ఆహార సంక్షోభం కూడా తీవ్ర స్థాయికి చేరింది. నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. విదేశీ మారకద్రవ్యం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో దిగుమతులు చేసుకోలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల అల్లర్లు చెలరేగుతున్నాయి. లూటీలు జరుగుతున్నాయి. ఇలాంటి అల్లర్లలో గాయపడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. 

కొలంబో వీడిన మాజీ ప్రధాని మహింద రాజపక్సే కుటుంబం..?

ఇప్పటికే అల్లర్ల ధాటికి మాజీ ప్రధాని మహింద రాజపక్సే (Rajapakse) తన కుటుంబాన్ని నేవీ సురక్షిత ప్రాంతానికి తరలించారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రాజ‌ప‌క్స నివాసం వద్ద భారీ సంఖ్య‌లో ఆందోళ‌న‌కారులు చేరుకోవడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జ‌రిపారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆందోళనకారులను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు టియ‌ర్ గ్యాస్ కూడా ప్ర‌యోగించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌ప‌క్స అధికారిక నివాసం వ‌ద్ద వేల సంఖ్య‌లో బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఆయనను రక్షించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో సురక్షిత ప్రాంతానికి తరలించారని తెలుస్తోంది. 

శ్రీలంకలో కొనసాగుతున్న హింస
ప్రజాగ్రహం తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతుండడంతో రాజకీయ నేతలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తున్నా విపక్షాలు కూడా ముందుకు రావడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు చాలాచోట్ల హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీల అధికార నివాసాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. మాజీ ప్రధాని మహింద రాజపక్స మద్దతుదారులు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దేశంలో హింసకు కారణమైన మహింద రాజపక్సేను అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సోమవారం (ఈ నెల 9న) నిరసనకారులు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య చెలరేగిన ఘర్షణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను శ్రీలంక అటార్నీ జనరల్ ఆదేశించారు. దేశ వ్యాప్తంగా ప్రకటించిన కర్ఫ్యూని బుధవారం (ఈనెల 11వ తేదీ) వరకూ పొడిగించారు. 

మరోవైపు మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం దాటి పారిపోతాడనే ప్రచారం ఊపందుకోవడంతో ఆయన కోసం గాలింపు చర్యలు తీవ్రం చేశారు నిరసనకారులు.  చాలా చోట్ల చెక్ పాయింట్ లు ఏర్పాటు చేసి, రాజపక్సను, అతని విధేయులను పారిపోకుండా కాపలా కాస్తున్నారు ప్రజలు. రాజపక్స కుటుంబ అనుయాయులు దేశం విడిచి పారిపోకుండా కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిపై ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేకతతో నిరసనలు కొనసాగుతుండగా.. గత రెండు రోజులుగా పరిణామాలు హింసాత్మకంగా మారిపోయాయి. 

దేశ ప్రజలకు శ్రీలంక అధ్యక్షుడు పిలుపు 
మరోవైపు పరిస్థితులు చేజారిపోకుండా దేశ ప్రజలందరూ సంయమనం పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పిలుపునిచ్చారు. హింసను ఆపాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతీకార చర్యలు మానుకోవాలని కోరారు. ఏకాభిప్రాయం ద్వారా రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి,ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటు శ్రీలంకలో పరిస్థితులపై స్పందించిన ఐక్యరాజ్య సమితి వీలైనంత త్వరగా సంక్షోభం ముగియాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. 

మరిన్ని వార్తల కోసం..

అసైన్డ్ భూముల్ని దోచుకోవడంపైనే కేసీఆర్ ఫోకస్

టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు

దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి