V6 News

స్టూడెంట్ పై యాసిడ్ దాడి కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్

స్టూడెంట్ పై యాసిడ్ దాడి కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్

కాలేజీ అమ్మాయిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సచిన్ అరోరా (20) ఫ్లిప్ కార్ట్ లో యాసిడ్ కొనుగోలు చేశాడని పోలీసులు తేల్చడంతో.. ఆన్ లైన్ లో యాసిడ్ ఎట్ల అమ్ముతారని కమిషన్ ఫైర్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఫ్లిప్ కార్ట్ సహా అమెజాన్ కు గురువారం నోటీసులు జారీ చేసింది. ‘‘కూరగాయలు కొన్నంత ఈజీగా యాసిడ్ కొంటున్నరు. యాసిడ్ రిటైల్ అమ్మకాలపై నిషేధం విధించాలని మేం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తప్పనిసరిగా యాసిడ్ రిటైల్ అమ్మకాలపై నిషేధం విధించాలి” అని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. 

యాసిడ్​ దాడి కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కూడా ఫ్లిప్ కార్ట్ కు నోటీసులు జారీ చేశారు.‘‘ ఈ కేసులో ప్రధాన నిందితుడు సచిన్ అరోరా (20) ఫ్లిప్​కార్ట్​లో యాసిడ్ కొనుగోలు చేశాడు. అమ్మాయిపై దాడి చేసేందుకు ఇతనికి ఇద్దరు దోస్తులు హర్షిత్ అగర్వాల్ (19), వీరేందర్ సింగ్ (22) సహకరించారు. సచిన్ అరోరా, హర్షిత్ అగర్వాల్, వీరేందర్ సింగ్​లను అరెస్టు చేశాం. సచిన్ అరోరా ఆర్డర్ కు సంబంధించి వివరాలు ఇవ్వాలని ఫ్లిప్​కార్ట్​కు నోటీసులు ఇచ్చాం” అని ఢిల్లీ పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే నోటీసులపై ఫ్లిప్​కార్ట్ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, కేవలం లైసెన్స్ ఉన్న షాపులు మాత్రమే యాసిడ్ అమ్మాలని, అమ్మకాలకు సంబంధించి రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అది పట్టించుకోకుండా ఆన్​లైన్​లో అమ్మకాలు సాగుతున్నాయి.