ఏసీడీ పేరిట కరెంట్ బిల్లుల మోత

ఏసీడీ పేరిట కరెంట్ బిల్లుల మోత
  • ఏసీడీ పేరిట ఒక్కో బిల్లుపై ఏడాదికి రూ.3,500కుపైగా అదనం
  • వ్యతిరేకత రావద్దని వినియోగదారులకు విడతల వారీగా వడ్డింపు
  • గతంలో కంటే ఎక్కువ యూనిట్లు వాడుతున్నారనే సాకుతో అడ్డగోలు వసూళ్లు 
  • కనెక్టెడ్ లోడ్ పేరుతో 6 నెలల కిందనే డెవలప్ మెంట్ చార్జీలు 

వరంగల్ ప్రతినిధి, వెలుగు: రాష్ట్ర సర్కార్ నుంచి రావాల్సిన సబ్సిడీలు అందక, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు వసూలుకాక నిండా నష్టాల్లో మునిగిన డిస్కమ్​లు.. ఆ నష్ట భారమంతా జనంపై మోపుతున్నాయి. ఏడాదికోసారి రకరకాల చార్జీల పేరుతో బిల్లుల మోత మోగిస్తున్నాయి. ఆరు నెలల కిందనే కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ డెవలప్​మెంట్ చార్జీల పేరిట అదనపు వసూళ్లు చేసిన కరెంట్ సంస్థలు.. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ యూనిట్లు వాడుతున్నారనే సాకుతో అడ్వాన్స్ కన్జంప్షన్ డిమాండ్ (ఏసీడీ) పేరుతో అడ్డగోలుగా డిపాజిట్లు గుంజుతున్నాయి. ఈసారి సమ్మర్ లో వచ్చిన ఒక నెల బిల్లుకు సమానంగా ఒక్కో కనెక్షన్ పై రూ.3,500కు పైగా అదనంగా వసూలు చేస్తున్నాయి. ఈ చార్జీలు అందరికీ ఒకేసారి వేస్తే వ్యతిరేకత వస్తదని, విడతల వారీగా వడ్డిస్తున్నాయి. అసలు బిల్లుల కంటే వివిధ చార్జీల పేరుతో వడ్డిస్తున్న కొసరు బిల్లులే ఎక్కువయ్యాయని జనం లబోదిబోమంటున్నారు. 

ఏంటీ ఏసీడీ? 

ఎవరైనా కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు ఏసీడీ, లోడ్/సర్వీస్ కనెక్షన్, మీటర్ సెక్యూరిటీ డిపాజిట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని నాన్ రీఫండబుల్, మరికొన్ని రీఫండబుల్ చార్జీలుంటాయి. డిస్కమ్ రూల్స్ ప్రకారం.. ఏసీడీ చార్జీలు రీఫండబుల్. వినియోగదారులు ఎవరైనా కరెంట్ బిల్లు ఎగ్గొడితే.. ఏసీడీ చార్జీల రూపంలో వసూలు చేసిన సెక్యూరిటీ డిపాజిట్​ను బిల్లుగా అడ్జస్ట్ చేయడం వల్ల సంస్థకు ఎలాంటి నష్టం ఉండదు. సాధారణంగా ఈ విధానం లక్షల్లో బిల్లులు వచ్చే ఇండస్ట్రీలు, సంస్థలకే వర్తించేది. ఇండస్ట్రీలు మూతపడినా, బిల్లులు కట్టకపోయినా డిస్కమ్‌‌లు నష్టపోతాయి. అందుకే ఇండస్ట్రీలు ఏటా వినియోగించే సగటు విద్యుత్‌‌ చార్జీలకు రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ గా డిస్కమ్‌‌లు ముందస్తుగా వసూలు చేస్తుంటాయి. కానీ ఇప్పుడు డిస్కమ్‌‌లు ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తూ వస్తున్న డొమెస్టిక్ వినియోగదారులకు కూడా ఏసీడీ చార్జీలు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. 

కనెక్టెడ్ లోడ్ పై అవగాహన కల్పిస్తలే.. 

ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల ఆధారంగా ఎన్ని కిలోవాట్ల కెపాసిటీ కనెక్షన్ కావాలనేది కనెక్షన్ తీసుకునేటప్పుడే వినియోగదారుడు నిర్ణయించుకోవాలి. ఆ కెపాసిటీ ఆధారంగానే విద్యుత్ సంస్థలు.. డెవలప్ మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్స్ కట్టించుకుని కనెక్షన్ ఇస్తాయి. డొమెస్టిక్ విభాగంలో చాలామంది ఒకటి లేదా రెండు కిలోవాట్ల కెపాసిటీ కనెక్షన్లు తీసుకొని.. ఆ మేరకే చార్జీలు చెల్లిస్తుంటారు. ఈ విషయంలో వినియోగదారులకు విద్యుత్ అధికారులు, సిబ్బంది ఎలాంటి అవగాహన కల్పించడం లేదు. ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల సంఖ్య పెరిగినప్పుడు కరెంట్ కనెక్టెడ్ లోడ్ క్రమంగా పెరుగుతుంది. ఒక కిలోవాట్ కెపాసిటీ కనెక్షన్ మాత్రమే ఉండి.. అంతకుమించి కరెంట్ వాడినప్పుడు రికార్డెడ్ మ్యాగ్జిమం డిమాండ్ (ఆర్ఎండీ) పెరిగి ఆ వినియోగదారుడు రెండు లేదంటే మూడు కిలోవాట్ల కేటగిరీలోకి వస్తున్నాడు. అలా మిగిలిన కిలోవాట్ లేదా రెండు కిలోవాట్లకు సంబంధించిన డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్స్, ఏసీడీ డ్యూస్ ‌‌‌‌‌‌ను నెల బిల్లులో కలిపి వేస్తున్నారు. 

సర్కార్ బకాయిలు 5 వేల కోట్ల పైనే..   

ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగు నీటి స్కీమ్ ల కరెంట్ బిల్లులను సర్కార్ సకాలంలో డిస్కంలకు చెల్లించడం లేదు. ఇరిగేషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులు రూ.5,321 కోట్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 48 పంపులు నడుస్తుండగా రూ.1,745.48 కోట్లు, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టువి రూ.1,375.16 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బిల్లులు రూ.460.93 కోట్లు, మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ మోటార్ల బిల్లులు రూ.631 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవే కాకుండా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కరెంట్ బిల్లులు రూ.వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నష్టాలను పూడ్చుకునేందుకు డిస్కమ్ లు రకరకాల మార్గాలు వెతుకుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే వివిధ చార్జీల పేరుతో బిల్లుల మోత మోగిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. 

హనుమకొండలోని విద్యారణ్యపురికి చెందిన వి.కొండల్ రావుకు పోయినేడాది మార్చిలో వచ్చిన బిల్లులో డెవలప్ మెంట్ చార్జీల పేరుతో రూ.2,832, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో మరో రూ.400 వేశారు. అప్పట్లో కరెంట్ ఆఫీస్ కు వెళ్లి అడిగితే కనెక్టెడ్ లోడ్ పెరిగిందని, అందుకే వేశామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అడ్వాన్స్ కన్జంప్షన్ డిమాండ్ (ఏసీడీ) చార్జీల పేరుతో ఏకంగా రూ.3,642 బిల్లు అదనంగా వేశారు. ఇలా ఏడాదికోసారి రకరకాల చార్జీల పేరుతో బిల్లులు వేస్తే తాము ఎలా బతకాలని కొండల్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.