రాష్ట్రంలో క్యాచర్లు లేక ఆగుతున్న కోతుల ఆపరేషన్లు

రాష్ట్రంలో క్యాచర్లు లేక ఆగుతున్న కోతుల ఆపరేషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న కోతుల సంఖ్యను నియంత్రించేందుకు జిల్లాకో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రం పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మంకీ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని వ్యవసాయ, అటవీశాఖ ఆఫీసర్లు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాలు, కోతుల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సెంటర్లు పెట్టేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నుంచి ప్రతిపాదనలు పంపించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న వెటర్నరీ హాస్పిటల్స్‌‌లోనే మంకీ కు.ని సెంటర్లు కూడా పెట్టాలని భావిస్తున్నారు. ‌‌ఒక్కో సెంటర్‌‌‌‌కు రూ.1.65 కోట్లు కేటాయించాలని సర్కార్‌‌‌‌ను కోరారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో ఓ సెంటర్‌‌‌‌ అందుబాటులో ఉండగా, మరో 9 నుంచి 12 సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సర్కార్ పర్మిషన్ ఇస్తే వెంటర్నరీ డాక్టర్లను హిమాచల్ ప్రదేశ్‌‌కు పంపించి, కోతుల కుటుంబ నియంత్రణ సర్జరీలో ట్రైనింగ్ ఇప్పించాలని యోచిస్తున్నారు.

నిధుల్లేక క్యాచర్లను రప్పిస్తలేరు.. 

రాష్ట్రంలో కోతులను చాకచక్యంగా పట్టేవాళ్లు దొరుకుతలేరు. దీంతో ఎక్కడైనా కోతులను పట్టాలంటే ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి క్యాచర్లను పిలిపిస్తున్నారు. కోతుల సంఖ్య, కోతులు పట్టే ప్రాంతాన్ని బట్టి వీరు ఒక్కో కోతికి రూ.500 నుంచి వెయ్యి వరకూ చార్జ్ చేస్తున్నారు. కోతులు పట్టేందుకు అవసరమైన సామగ్రిని క్యాచర్లే తెచ్చుకుంటుండగా, కోతులను తరలించడానికి అవసరమైన కేజులు, వాహనాలను అటవీశాఖ సమకూరుస్తోంది. ప్రస్తుతం నిర్మల్‌‌లో మాత్రమే సెంటర్‌‌‌‌ ఉండడంతో, వందల కిలో మీటర్లు కోతులను తరలించాల్సి వస్తోంది. కోతులను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు ఏవీ లేకపోవడంతో, ఇతర పద్దుల్లో నుంచి నిధులను అడ్జస్ట్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి తీవ్రంగా ఉంటే తప్పితే, క్యాచర్లను పిలిపించేందుకు ఫారెస్టు ఆఫీసర్లు మొగ్గు చూపడం లేదు. దీనివల్ల నిర్మల్ సెంటర్‌‌‌‌లో డాక్టర్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. నిధులు సర్దడం తమకు భారంగా మారుతోందని, స్థానిక గ్రామ పంచాయతీలు లేదా మునిసిపాలిటీలే కోతులను పట్టిస్తే బాగుంటుందని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కోతుల తరలింపు, ఆపరేషన్లు, ఆ తర్వాత వాటిని అడవుల్లో వదిలేయడం వంటి కార్యక్రమాలను తాము పర్యవేక్షిస్తామంటున్నారు. ఎక్కడికి అక్కడ మంకీ ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్లు ఉండడం అవసరమని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇప్పటి నుంచి స్టెరిలైజ్ చేస్తూ పోతే, ఒకట్రెండు దశాబ్దాల తర్వాత కోతుల సంతతి నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ల్యాప్రోస్కోపిక్‌‌ సర్జరీ

నిర్మల్‌‌ సెంటర్‌‌‌‌లో రెండేండ్లలో 925 కోతులకు కు.ని. ఆపరేషన్లు చేశారు. ఈ సెంటర్‌‌‌‌లో ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు పనిచేస్తున్నారు. వీరు హిమాచల్ ప్రదేశ్‌‌ వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నారు. కోతుల సమస్య ఎక్కువగా ఉందని అటవీశాఖకు కంప్లైంట్లు వస్తే, ప్రొఫెషనల్ క్యాచర్లతో కోతులను పట్టించి నిర్మల్ సెంటర్‌‌‌‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ 2,204 కోతులను పట్టి ఈ సెంటర్‌‌‌‌కు తరలించారు. ఇందులో పిల్ల కోతులను పక్కనబెట్టి.. పెద్ద కోతులకు(925) మాత్రమే సర్జరీలు చేశారు. మగ కోతులకు ఆపరేషన్ చేయడం సులభమే అయినప్పటికీ, ఆడ కోతులకు చేయడం మాత్రం కొంత కాంప్లికేటుగా ఉంటుంది. ల్యాప్రోస్కోపిక్‌‌ పద్ధతిలో ఈ సర్జరీలు చేస్తున్నారు. మగ కోతులను సర్జరీ తర్వాత రోజే వదిలేస్తుండగా, ఆడ కోతులను ఐదు నుంచి వారం రోజులు అబ్జర్వేషన్‌‌లో ఉంచుకుని, వాటి ఆరోగ్యం బాగుంటేనే వదిలేస్తున్నారు. అక్కడ రెండొందల కోతులను అబ్జర్వేషన్‌‌లో పెట్టేందుకు అనువుగా ఎన్‌‌క్లోజర్స్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.