తెలంగాణలో చేనేత రంగం దయనీయం

తెలంగాణలో చేనేత రంగం దయనీయం

తెలంగాణలో చేనేత రంగం మీద ఆధారపడి వేలాది కుటుంబాలు బతుకుతున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ రంగం మిణుకు మిణుకుమంటున్నది. మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. హైదరాబాద్​లో ఓల్డ్​సిటీ, కాటేదాన్, ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్​లో ఎక్కువగా ఈ కుటుంబాలు ఉన్నాయి. మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 2005 వరకు పరిస్థితి బాగానే ఉన్నా, ఆ తరువాత 2009 నుంచి పరిస్థితి దిగజారింది. తెలంగాణ ఏర్పాటు  తరువాత ఈ రంగంలో సమస్యలు మరింత పెరిగినాయి. ఇక్కడి చేనేత వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. గద్వాల్, నారాయణపేట, వరంగల్, గొల్లభామ నేతలేగాక, తేలియా, హిమ్రూ తదితర రకాలు కూడా ప్రసిద్ధి పొందాయి. గద్వాల్  రకం మహబూబ్ నగర్​లో మాత్రమే కాకుండా, కర్నూల్ జిల్లాలో కూడా అనేక గ్రామాల్లో నేస్తారు. అట్లాగే, పోచంపల్లి వెరైటీగా ప్రసిద్ధి చెందిన చిటికి, టై అండ్ డై చేనేత నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో నేస్తారు.

సాధారణంగా చేనేత అంటే పత్తి, పట్టు వస్త్రాలే మదిలోకి వస్తాయి.  చీరలు, ధోవతులు, తువ్వాళ్లు, దుప్పట్లు, తివాచీలు, లుంగీలు, ఉత్త బట్ట కూడా చేనేతరంగం నుంచి వస్తున్న వస్త్రాలు. గొంగళ్లు చాలా ప్రాంతాలలో నేసేవారు.  తెలంగాణ నుంచి కొన్ని చేనేత కుటుంబాలు గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. చాలామంది యువకులు మహారాష్ట్రలోని భివండి వెళ్లి పవర్​లూమ్​పరిశ్రమల్లో కార్మికులుగా చేరారు. చేనేత పని నేర్చుకుని  ఇక్కడ మరమగ్గాలు ఏర్పాటు చేసుకున్నవారూ ఉన్నారు. 

వృత్తి పట్ల గౌరవం

చేనేతకు మొదటి నుంచి కూడా పోటీ యాంత్రీకరణ వల్లనే. మరోవైపు ప్రభుత్వ వివక్ష వల్ల చేనేత నష్టపోతున్నది. కృత్రిమ నూలుతో చేసిన వస్త్రాలకు ధర తక్కువ కావడంతో వాటి మార్కెట్ పెరిగింది. దీంతో దిగుమతి పెరిగింది. నూలు ధరల పెరగడంతో చేనేత వస్త్రాల మార్కెట్ ధర ఎక్కువై కొనుగోలుదారులు దూరమవుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, చేనేత ఉత్పత్తి చాల సులభంగా జరిగేది. ఆదాయం తగ్గి ఆధునికత పెరుగుతున్న కొద్దీ  చేనేత కుటుంబాలపై ఒత్తిడి పెరిగింది. ఆదాయం ఎక్కువ లేకపోవడంతో, కొన్ని ఇండ్లల్లో భర్త వేరే పనికి పోతే, భార్య నేత పనిచేయడం, భర్త ఇంటికి వచ్చినాక సహాయం చేయడం కూడా కనిపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. చేనేత వృత్తిని కొనసాగిస్తున్న కుటుంబాలు కూడా అనేకం ఉన్నాయి. వారికి ఈ వృత్తి పట్ల ఉన్న గౌరవమే అండగా నిలుస్తోంది. 

బతుకమ్మ పథకంతో సూరత్ వారికి లబ్ధి

బతుకమ్మ చీరల పథకం గత నాలుగు ఏండ్లుగా అమలు చేస్తున్నా చేనేత రంగానికి చేకూరిన లాభం శూన్యం . 2019-–20 నుంచి రూ.2000 కోట్ల పైన ప్రభుత్వం ఖర్చు చేసినా అది ఇక్కడవారికి కాకుండా సూరత్ పట్టణంలో ఉండేవారి ఉపాధికి ఊతం అయింది. ఇక్కడ చేనేతలకు అందులో 2 శాతం కూడా ఇవ్వలేదు. తెలంగాణలో గ్రామీణ ఉపాధి స్థిరంగా ఉండేవిధంగా ఇక్కడ కనీస ప్రభుత్వ పెట్టుబడులు లేవు.  సంస్థాగత రుణాలు రావడం లేదు. ప్రైవేటు అప్పుల భారం పెరిగింది. గత ఆరు సంవత్సరాల్లో చేనేత రంగానికి కేటాయింపులు లేనే లేవు. చేనేత మిత్ర పథకం అని బయట ప్రకటిస్తూ మభ్యపెడుతున్నారు. అది కూడా చేనేత కుటుంబాలు దాచుకున్న సొమ్మును తమ నిధులుగా చూపెడుతున్నారు. మిల్ గేటు ప్రైస్ పథకం కింద కేంద్రం ఇస్తున్న సబ్సిడీ తెలంగాణాలో చేనేత రంగానికి అధికంగా ఉపయోగించుకునే వ్యవస్థ లేదు. చేనేత ఉత్పత్తికి ప్రధాన ఆటంకం ముడిసరుకు ధరలు అస్తవ్యస్తంగా పెరగడం.  సహకార సంఘాలు నిర్వీర్యం అయిన పరిస్థితుల్లో చేనేత రంగానికి ప్రభుత్వ వ్యవస్థనే ఊతమివ్వాలి. కేంద్ర మెగా క్లస్టర్ల పథకాన్ని తెలంగాణ ఉపయోగించుకోలేదు.  చేనేత సంక్షేమ పథకాలకు కేటాయింపులు లేనే లేవు. విద్య, వైద్యానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక వైపు చేనేతకు కేటాయింపులు తగ్గుతుంటే, ఆధునిక యంత్రాల జౌళి రంగానికి ప్రభుత్వ పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. సబ్సిడీలు ఇస్తూనే ఉన్నారు. పన్ను మినహాయింపులు ప్రకటిస్తూనే ఉన్నారు.  చేనేతపైన తెలంగాణ ప్రభుత్వ వివక్ష అది.

ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి

పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగం మీద భారం పడకుండా మనగలిగే సామర్థ్యం చేనేత రంగానికే ఉంది.  తెలంగాణలో చేనేత రంగ అభివృద్ధికి సానుకూల రాజకీయ దృష్టి కావాలి. జాతీయ జౌళి విధానాలను ప్రశ్నించాలి. రాష్ట్ర స్థాయిలో జౌళి విధానాన్ని చేనేత కుటుంబాలతో సంప్రదింపులు జరిపి ప్రకటించాలి. చేనేత విధాన రూపకల్పనకు కమిటీ వేసి ఆ కమిటీలో చేనేత ప్రతినిధులకు, పత్తి, నూలు రైతులు, ఇతర వృత్తిదారులకు స్థానం కల్పించాలి. చేనేత రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు కనీసం రూ.2000 కోట్లు పెట్టాలి.  రుణాలు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందించాలి.  చేనేతరంగానికి ప్రత్యేక  బ్యాంకు ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. తెలంగాణలో  చిన్న పత్తి, నూలు మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలి. పత్తి రైతులకు, చేనేత కార్మికులకు నేరుగా సంబంధం ఏర్పరచాలి.  చేనేత రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. మార్కెట్ వసతులు, సౌకర్యాలు కల్పించాలి. ఎగుమతులకు అవకాశం కల్పించాలి.   తెలంగాణకు ప్రత్యేక అపెక్స్ సహకార సంస్థ ఏర్పాటు చేయాలి. చేనేత కార్మికులకు  కనీస వేతనాల చట్టం అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కుల గణన చేయాలి.  పూర్తి స్థాయి గణన వల్ల కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచే అవకాశం ఉంది.  చేనేత మీద జీఎస్టీ ఎత్తివేయాలి. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన జీఎస్టీలో తన వాటా మేరకు చేనేతలకు నిధులు ఇవ్వాలి. 

కృత్రిమ నూలును ప్రోత్సహించడం తగదు

చాలామంది చేనేత రంగానికి, మరమగ్గ పరిశ్రమకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని విస్మరిస్తారు.  ప్రభుత్వం కూడా చేనేత రంగాన్ని, ఆధునిక యంత్రాలను ఒకే గాట కట్టడం సరైన ఆలోచన కాదు. పులిని మేకను ఒకే దగ్గర కట్టేసినట్టు. పులి ఆహారం మేకనే.. కానీ మేక ఆహారం పులి కాదు. చేనేత  ఉత్పత్తులు అనేక రకాలు. చేనేత మార్కెట్​అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ మార్కెట్​ను  నకిలీ ఉత్పత్తులు ముంచెత్తడం సరి కాదు. గత పది ఏండ్లలో జౌళి రంగంలో పెట్టుబడులు పెట్టిన రాజకీయ నాయకుల అండతో దాదాపు రూ.3 లక్షల కోట్ల సబ్సిడీలు వచ్చిన జౌళి రంగం వృద్ధి 14 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. అదేకాలంలో, చేనేత కుటుంబాలకు ఎటువంటి సహాయం ప్రభుత్వం నుంచి అందలేదు. అయితే ఉత్పత్తి శాతం తగ్గకపోవడం, ఈ రంగానికి ఉన్న జనాదరణను తెలియజేస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో  చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే రాజకీయ నాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. జాతీయ చేనేత విధానాన్ని విస్తృత సంప్రదింపుల అనంతరం ప్రకటించాలని చేనేత రంగం ఎప్పటి నుంచో కోరుతున్నది. ముసాయిదా జాతీయ ఫైబర్ విధానం చేనేత రంగానికి వ్యతిరేకంగా ఉంది.  కృత్రిమ నూలు రంగానికి, జౌళి పరిశ్రమ అభివృద్ధి పేరుతో, ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం వలన పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుంది. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం. దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టు. కృతిమ నూలు వలన దిగుమతులు పెరుగుతాయి, ఒకే కంపెనీ లబ్ధి పొందుతుంది, కోట్ల సంఖ్యలో ఉపాధి కోల్పోతారు. ఆర్థిక స్వావలంబన కోల్పోయి, పేదరికం పెరుగుతుంది.  కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేనేత రంగాన్ని ఆదుకొని చేనేత కుటుంబాలకు ఆ రంగంపై భరోసా కల్పించాల్సిన అవసరంఎంతైనా  ఉంది. 

చేనేత రక్షణ చట్టాలు పట్టవు

నిధుల లేమి, చేనేత రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాల ఉత్సవ విగ్రహ పాత్రగా మిగిలిపోయాయి.  వాటి ఉనికి కూడా తెలియని ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేనేత రంగం మీద తెలంగాణ శాసనసభలో ఒక్క రోజు కూడా పూర్తి స్థాయి చర్చ జరగలేదు. ఆధునిక వస్త్ర ఉత్పత్తికి,  భారీ యంత్రాల స్థాపనకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ‘చేనేత’ పట్ల సానుభూతి ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారింది. పవర్​లూమ్, గార్మెంట్ పరిశ్రమలు చేనేత ఉపాధిని హరిస్తున్నాయి. తెలంగాణ చేనేత అని టూరిస్టులకు గొప్పగా చెప్పడానికి, వారికి శాలువాలుగా అందించిన ఘనత ఈ ప్రభుత్వానిది. మాటలు కొండంత, చేసేది సున్నా. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు పోటీ పడి చేనేత రంగానికి నిధులు తగ్గిస్తున్నాయి. రాష్ట్రంలో చేనేతకు ఇచ్చే బడ్జెట్ చాలా తక్కువ. కేటాయించిన నిధుల్లో కూడా జౌళి రంగానికి, పవర్​లూమ్ రంగానికి, జీతాలకు పోగా నికరంగా చేనేత రంగానికి మిగిలేది  నామమాత్రమే. కేంద్రం జీఎస్టీ విధిస్తే దాన్ని విమర్శిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వసూలు చేస్తున్న జీఎస్టీలో రాష్ట్రానికి వాటా ఉంది అని విస్మరిస్తున్నది. రాజకీయంగా పోరాడడం ఒక ఎత్తు అయితే, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కూడా చేనేత కుటుంబాలకు ఒక సవాల్ గా మారింది. 

చేనేత వదిలి బీడీ కార్మికులుగా..

కరీంనగర్, వరంగల్, నిజామాబాద్​ జిల్లాలలోని అనేక గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి మెరుగైన కుటుంబాలు ఉన్నాయి. నష్టపోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. వలస వెళ్ళిన ప్రాంతంలోనే ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యుల ఆఖరి చూపునకు నోచుకోని అభాగ్యులు కూడా ఉన్నారు. ఇక్కడనే ఉండి, వారసత్వ వృత్తిని వదిలిపెట్టి ఇతర వృత్తులకు మారిన చేనేత కుటుంబాలూ ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మహిళలు ఎక్కువగా బీడీ కార్మికులుగా మారారు. తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వాల తీరు కారణంగానే చేనేత కుటుంబాలు తమ వృత్తిని వదిలి పోవాల్సి వచ్చింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి మారుతుందని ఆశించినవారు భంగపడ్డారు. చేనేత కుటుంబాలు బతికేందుకు సరిపోయేంత ఆదాయం లేకపోవడమే ప్రధాన సమస్య. తెలంగాణ చేనేత రంగం అనేక రకాల ఉత్పత్తులను అందించే స్తోమత ఉన్నా క్రమంగా కొన్ని  చేనేత రకాలు కనుమరుగు అవుతున్నాయి. 

- డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​