ఉత్తరాఖండ్​లోనూ జోషిమఠ్ ఘటనలు

ఉత్తరాఖండ్​లోనూ జోషిమఠ్ ఘటనలు

జోషిమఠ్​లో భూమి కుంగిపోతున్న ఘటన దేశ ప్రజలకు తీవ్రంగా భయపెడుతోంది. జోషిమఠ్ లో భూమి కుచించుకుపోతున్న  ఘటన మరచిపోకముందే.. ఉత్తరాఖండ్​లోని మరికొన్ని సిటీల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణప్రయాగ్, ఉత్తరకాశీ, గుప్తకాశీ, రుషికేశ్, నైనిటాల్, ముస్సోరిల్లోనూ ఇండ్లు, రోడ్లు నెర్రెలు వారుతున్నాయి. జోషిమఠ్​కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణప్రయాగ్​లోనూ చాలా వరకు ఇండ్లకు బీటలు వారడం కనిపించాయి. కొన్ని ఇండ్లైతే కనీసం ఉండేందుకు కూడా పనికి రాకుండా ఉన్నట్లు తెలుస్తోంది.

కొండలను తవ్వడం వల్లే..

చార్​ధామ్​ యాత్రకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అక్కడ రుషికేశ్​ నుంచి కర్ణప్రయాగ్​ వరకు రైల్​ లైన్​, చార్​ధామ్​ రోడ్​ నెట్​వర్క్​ను నిర్మిస్తోంది. దీని వల్లే తమ ఇండ్లు బీటలు వారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి అయితే.. నైట్​ షెల్టర్స్​లో తలదాచుకుంటున్నామని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బద్రీనాథ్​ హైవేలో ఉన్న బహుగుణనగర్​లో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. బహుగుణనగర్​లో ఇండ్లు, రోడ్లపై పగుళ్లు వచ్చాయంటున్నారు. కొండలను ఇష్టం వచ్చినట్లు తవ్వేయడం, నిర్మాణాలు చేయడం, చార్​ధామ్​ రోడ్​ ప్రాజెక్ట్​ వల్లే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు వాపోతున్నారు. 

శిథిలావస్థకు ఇండ్లు 

మరోవైపు.. రుషికేశ్​లోని అటాలీలో దాదాపు 85 ఇండ్లకు క్రాక్స్​ వచ్చి శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు అన్ని ఇండ్లు, పొలాల్లో నెర్రెలొచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుషికేశ్​, కర్ణప్రయాగ్​మధ్య నిర్మిస్తున్న రైల్వే టన్నెల్​ వల్లే ఇలా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెహ్రీ గర్హాల్​అనే  గ్రామంలోనూ భూమి కుంగిపోతోంది. ప్రత్యేకించి తెహ్రీ గర్హాల్​ పరిధిలోకి వచ్చే చంబ హామ్లెట్​లో పరిస్థితి తీవ్రంగా ఉంది. చార్​ధామ్​ కోసం తవ్వుతున్న 440 మీటర్ల పొడవైన టన్నెల్​తోనే భూమి కుంగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

పర్యావరణవేత్తల ఆందోళన

వందేళ్ల చరిత్ర ఉన్న ముస్సోరిలోని లాండౌర్​ బజార్​లో రోడ్​ చాలా వరకు కుంగిపోయింది. చాలా షాపులు, ఇండ్లకు క్రాకులు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది ఇప్పుడు ప్రమాదపుటంచున బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని చెబుతున్నారు. 2018లోనే నైనిటాల్​లోని లోయర్​ మాల్​ రోడ్​లో క్రాక్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అక్కడ అదే పరిస్థితి కనిపిస్తోంది. మాల్​ రోడ్​లో ట్రాఫిక్​ పెరగడం, వాహనాల బరువు ఎక్కువ కావడంతో రోడ్డు కుంగిపోతోందని స్థానికులు చెబుతున్నారు. రుద్రప్రయాగ్​లో ఉన్న అగస్త్యముని బ్లాక్​లోని ఝాలీమఠ్​ బస్తీలో పలు ఇండ్లకు నెర్రెలు రావడంతో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్​నాథ్​కు గేట్​వేగా చెప్పుకునే గుప్తకాశీ టౌన్​లోని పలు ప్రాంతాలు కూడా కుంగిపోతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. వివేకానంద పర్వతీయ అగ్రికల్చర్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​కు సమీపంలోని అల్మోరాలో భూమి కుంగిపోవడం చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యతోనే ఇనిస్టిట్యూట్​కు సంబంధించిన బిల్డింగ్​ను ఇటీవలే కూల్చారు. దాదాపు 15 ఏండ్లుగా ఇక్కడ భూమి కుంగిపోతోందని నిపుణులు కూడా చెబుతుండడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. పెరిగిన జనాభా, పర్యాటకులకు తగ్గట్టు సరైన ప్రణాళిక లేకుండా భారీ కట్టడాలను నిర్మించడం, ప్రాజెక్టులను చేపట్టడం వంటి కారణాల వల్లే ఉత్తరాఖండ్​లోని పట్టణాల్లో భూమి కుంగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.