
స్త్రీ నిధిలో ..అంతా నా ఇష్టం
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎండీ విద్యాసాగర్‌రెడ్డి
ఆయన చెప్పింది వినకపోతే ఉద్యోగం ఊస్టింగే
ఎండీ వేధింపులతో రెండేండ్లలో 170 మందిసిబ్బంది రిజైన్, తొలగింపు
కాంట్రాక్ట్‌పై వచ్చి 12 ఏండ్లుగా అదే పోస్టులో కొనసాగుతున్న వైనం
హైదరాబాద్, వెలుగు : స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఓ అధికారి తీరుతో అభాసుపాలవుతోంది. బోర్డు డైరెక్టర్లను పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి అంతా తానే అన్నట్లు సంస్థలో ఇష్టారాస్యంగా వ్యవహరిస్తున్నారు. ఫీల్డ్‌లో రికవరీకి సిబ్బంది లేకపోయినా ఇష్టారాజ్యంగా లోన్లు ఇవ్వడం, సెర్ప్ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టడంతో ఏటేటా ఎన్పీఏ(నిరర్థక ఆస్తుల) పర్సంటేజీ పెరిగిపోతున్నది. ఎండీ తనకు నచ్చని సిబ్బందిని టార్గెట్ చేసి మరి జాబ్ నుంచి తొలగిస్తున్నారు. లేదంటే వారంతట వారే రిజైన్ చేసి వెళ్లేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా రెండేళ్లలో 170 మంది సిబ్బంది రిజైన్ చేయడమో, ఎండీ తొలగించడమో జరిగిందని మాజీ ఉద్యోగులు అంటున్నారు.
12 ఏండ్లుగా ఎండీగానే..
విద్యాసాగర్ రెడ్డి నాబార్డ్‌లో ఏజీఎం క్యాడర్‌లో వీఆర్ఎస్ తీసుకొని సెర్స్‌లో 2009లో కన్సల్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత ఎస్‌హెచ్‌జీ బల్క్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా, స్టేట్ మైక్రో ఫైనాన్స్ అడ్వయిజర్‌గా, బ్యాంక్ లింకేజీ, ఐబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేప్టటారు. 2011లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్త్రీ నిధి మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 12 ఏండ్లుగా ఆయనే కొనసాగుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో ఆయన చేసిందే చట్టం అనే విధంగా పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేండ్లు కాంట్రాక్టుపై స్త్రీనిధికి వచ్చిన విద్యాసాగర్‌రెడ్డి.. 2022లో తన రిటైర్మెంట్ వయసు దాటినా కుర్చీ వదలడం లేదు. ఆయన కొనసాగింపుపై ఎలాంటి జీవో విడుదల కాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం ఏదైన ప్రభుత్వ రంగ సంస్థలో రూ.328 కోట్ల టర్నోవర్ దాటితే ఆ సంస్థ వ్యవహారాలను ఐఏఎస్ స్థాయి అధికారి చూడాల్సి ఉంటుంది. కానీ రూ.5,400 కోట్ల టర్నోవర్ ఉన్న స్త్రీనిధికి ఎండీగా ఐఏఎస్ ఆఫీసర్‌ను కేటాయించకుండా రిటైర్డ్ అధికారిని కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళల పొదుపు సొమ్ముతో స్త్రీనిధి..
2010 కంటే ముందు ఉమ్మడి ఏపీలో మైక్రో ఫైనాన్స్/షేర్ ముల్ సంస్థల ఆగడాలు భరించలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో మహిళ సమాఖ్యల భాగస్వామ్యంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2011 సెప్టెంబర్‌లో రూ.800 కోట్ల మూలధనంతో ‘స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్’ను స్థాపించింది. ఇందులో మహిళా సమాఖ్యల డబ్బులు రూ.700 కోట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.100 కోట్లు ఉంది. ఈ మూలధనాన్ని ష్యూరిటీగా చూపి వివిధ బ్యాంకుల నుంచి రూ.3,500 కోట్లు అప్పుగా తీసుకుని మహిళలకు రుణాలు ఇస్తున్నారు.
తగ్గుతున్న ఉద్యోగులు.. పెరుగుతున్న ఎన్‌పీఏలు..
స్త్రీనిధిలో 2020 వరకు వివిధ స్థాయిల్లో 520 మంది వరకు ఉద్యోగులు పని చేస్తుండేవారు. ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్య 350కి చేరింది. జాబ్ వదిలేసిన సుమారు 170 మందిలో కొందరిని ఎండీ టార్గెట్ చేసి తీసేసిన వాళ్లు ఉండగా, మరికొందరు ఆయన వేధింపులు భరించలేక రిజైన్ చేసి వెళ్లిపోయారు. దీంతో రుణాల పంపిణీ, రికవరీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2019 నుంచే స్త్రీనిధి ఇచ్చే రుణాల మంజూరు, రికవరీలో సెర్ప్ ఉద్యోగులను ఎండీ దూరం పెట్టారు. వారికి ఇచ్చే ఇన్సెంటివ్స్ బంద్ చేశారు. దీంతో వారు కేవలం ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకు, గ్రామీణ వికాస బ్యాంకు తదితర బ్యాంకుల నుంచి మంజూరయ్యే లింకేజీ రుణాలను మాత్రమే మానిటర్ చేస్తున్నారు. స్త్రీనిధికి రెండు, మూడు మండలాలకో అసిస్టెంట్ మేనేజర్ ఉండడం, విలేజ్ బ్యాంకు మిత్రలు అన్ని గ్రామాల్లో లేకపోవడంతో ఈఎంఐ చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల వీఏఓలు, తమ సంఘ లీడర్లకు మహిళలు కిస్తీ డబ్బులు ఇస్తే వారు స్త్రీనిధి ఖాతాల్లో జమ చేయడం లేదు. ఫలితంగా ఎగవేతల పర్సంటేజీ 14 శాతానికి పెరిగినట్లు తెలిసింది.
కక్ష గట్టి జాబ్ నుంచి తీసేశారు..
పల్లె సమగ్ర సేవా కేంద్రాలకు ప్రభుత్వం 2015లో ఫ్రీగా లాప్‌టాప్స్ ఇచ్చింది. వాటికి రూ.50 వేల లోన్ కింద తీసుకున్నట్లు కేంద్రాల నిర్వాహకుల నుంచి ఈఎంఐ వసూలు చేయాలని ఎండీ నన్ను కోరారు. ఫ్రీగా ఇచ్చిన వాటికి ఈఎంఐ ఎలా వసూలు చేస్తామని అడిగాను. ఆ విషయాన్ని ఆయన మనసులో పెట్టుకొని, నన్ను టార్గెట్ చేశారు. లాప్‌ట్యాప్ ఎక్చేంజ్ విషయంలో జరిగిన పొరపాటును దొంగతనంగా చూపి జాబ్ నుంచి తీసేశారు. దీంతో నేను నేషనల్ బీసీ కమిషన్‌ను ఆశ్రయించాను. ఆ తర్వాత నన్ను ఉద్యోగంలోకి తిరిగి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ బోర్డు డైరెక్టర్లు ఒప్పుకోవడం లేదనే సాకుతో నన్ను జాబ్‌లోకి తీసుకోవడం లేదు.
- ప్రవీణ్, స్త్రీనిధి మాజీ ఉద్యోగి