అమెరికాలో భారత సంతతి బిలియనీర్ల హవా.. చైనా, ఇజ్రాయెల్‌‌‌‌, తైవాన్‌‌‌‌ కంటే ఎక్కువ మంది మనోళ్లే !

అమెరికాలో భారత సంతతి బిలియనీర్ల హవా.. చైనా, ఇజ్రాయెల్‌‌‌‌, తైవాన్‌‌‌‌ కంటే ఎక్కువ మంది మనోళ్లే !
  • ఫోర్బ్స్‌‌‌‌ రిపోర్ట్ వెల్లడి
  • అమెరికాలో అత్యంత ధనవంతుడైన వలసదారుడు ఎలాన్ మస్క్‌‌‌‌


న్యూఢిల్లీ: అమెరికాలో నివసిస్తున్న  విదేశీ బిలియనీర్లలో చైనా, ఇజ్రాయెల్ కంటే  ఎక్కువ మంది ఇండియా నుంచే ఉన్నారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం, ప్రస్తుతం 125 మంది విదేశీ సంతతి అమెరికన్ పౌరులు అక్కడి బిలియనీర్ల జాబితాలో ఉన్నారు.  2022లో ఈ సంఖ్య 92గా ఉంది. ఈ వలసదారులు 43 దేశాల నుంచి వచ్చారు.  అమెరికాలో ఉన్న మొత్తం 9‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 మంది బిలియనీర్లలో వీరి వాటా 14శాతంగా ఉంది.  

ఈ అమెరికన్ వలస బిలియనీర్ల మొత్తం సంపద 1.3 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా,  అమెరికా మొత్తం బిలియనీర్ల సంపదైన 7.2 ట్రిలియన్ డాలర్లలో ఇది 18శాతం వాటాకు సమానం.  ఈ వలస బిలియనీర్లలో 2022లో భారత్ నుంచి 7 మంది ఉన్నారు.  ఇజ్రాయెల్, కెనడా, చైనా (7 మంది చొప్పున) తో సమానంగా ఇండియా నిలిచింది. కానీ 2025లో న్యూ ఢిల్లీ 12 మందితో మొదటి స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ (11), తైవాన్ (11) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనా నుంచి 2022లో 7 మంది, 2025లో 8 మంది బిలియనీర్లు ఉన్నారు.  

ఫోర్బ్స్ జాబితాలో జే చౌదరి (జెడ్‌‌‌‌స్కేలర్‌‌‌‌‌‌‌‌ సీఈఓ, 17.9 బిలియన్ డాలర్ల సంపద), సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ, 1.1 బిలియన్ డాలర్లు), సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌‌‌‌, 1.1 బిలియన్ డాలర్లు) వినోద్ ఖోస్లా (ఖోస్లా వెంచర్స్, 9.2 బిలియన్ డాలర్లు) వంటి భారతీయ- అమెరికన్లు ప్రముఖ వలస బిలియనీర్లుగా ఉన్నారు. అమెరికాలో అత్యంత ధనవంతుడైన వలసదారుడిగా ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు.  టెస్లా,  స్పేస్‌‌‌‌ఎక్స్ వంటి బడా కంపెనీలకు బాస్ అయిన ఆయన, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. మస్క్ సంపద సుమారు 393 బిలియన్ డాలర్లు ఉంది. 

మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించి, కెనడా ద్వారా అమెరికాకు కాలేజీ విద్యార్థిగా వచ్చారు. ఈ లిస్ట్‌‌‌‌లో  రెండో అత్యంత ధనవంతుడిగా   సెర్గీ బ్రిన్ (గూగుల్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌) ఉన్నారు. ఆయన  సంపద  139.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం అమెరికానే కాదు,  ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ముగ్గురు వలసదారులే ఉన్నారు. ఈ వలస బిలియనీర్లలో చాలా మంది టెక్ రంగంలో (53 మంది),  ఫైనాన్స్ రంగంలో (28 మంది) సంపద సృష్టించారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వెంచర్ క్యాపిటలిస్ట్ ఒరెన్ జీవ్ తన విభిన్న ఆలోచనా విధానంతో విజయం సాధించారు.