తిన్నది పడట్లేదా!

V6 Velugu Posted on Oct 05, 2021

ఆరోగ్యం కోసం, బరువు తగ్గడం కోసం, ఫిట్​నెస్​ కోసం... ఒక్కొక్కరు ఒక్కో డైట్​ ఫాలో అవుతుంటారు.  డైట్​లో భాగంగా పచ్చి కూరగాయలు, వెజిటబుల్​ సలాడ్స్​, నట్స్​, బీన్స్​ వంటివి ఎక్కువ తింటుంటారు. అయితే, కొందరికి ఇవి జీర్ణం కావు. దాంతో జీర్ణపరమైన సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులు వస్తాయి. అందుకు కారణం కొన్ని రకాల కూరగాయలు, బీన్స్​, పప్పుల్లో ఉండే లెక్టిన్​ అనే ప్రొటీన్​.  

గోధుమలు, కిడ్నీ బీన్స్​ (రాజ్మా), ఆలుగడ్డ, చిక్కుడు జాతికి చెందిన బీన్స్, బఠాణి, శనగ గింజల్లో లెక్టిన్​  ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఉడకబెట్టి తింటే ఏ సమస్యా ఉండదు. అలాకాకుండా  పచ్చిగా తింటే వీటిలోని లెక్టిన్​ ప్రొటీన్​ జీర్ణాశయంలోకి పోతుంది. ఇది​ జీర్ణాశయం పనితీరుని దెబ్బతీస్తుంది. ఇన్​ఫ్లమేషన్​ కి కారణమవుతుంది. వెజిటేరియన్లలో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లలో లెక్టిన్​ ప్రభావం ఎక్కువ. ​ 
వీళ్లలో సమస్య ఎక్కువ
క్రోన్స్​ డిసీజ్, పొట్టలో అల్సర్లు ఉన్నవాళ్లలో జీర్ణాశయం గోడలు బలంగా ఉండవు. లెక్టిన్​ ప్రొటీన్​ వాటిని మరింత పలచగా చేస్తుంది. జీర్ణాశయం గోడలు దాటి, రక్తంలో కలిసి, ఆటోఇమ్యూన్​ రెస్పాన్స్​కి కారణమవుతుంది. దీనివల్ల  సొంత కణాలనే బయటి నుంచి వచ్చిన కణాలు అనుకుని రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీల్ని రిలీజ్​ చేస్తుంది. దాంతో, రుమటాయిడ్​ ఆర్థరైటిస్, టైప్​ 1 డయాబెటిస్, సిస్టమిక్​ ల్యూపస్​ ఎరిటిమటోసస్​ వంటి ఆటోఇమ్యూన్​ డిసీజ్​లు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా జింక్, క్యాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, ఐరన్​ వంటి పోషకాల్ని జీర్ణాశయంలోని  బ్యాక్టీరియాకి అందకుండా చేస్తుంది ఈ ప్రొటీన్.  
లెక్టిన్​ వీటిలో ఉంటుంది
చిక్కుడు జాతి గింజలు, గోధుమలు, పప్పులు. కొన్ని రకాల నట్స్, కీరదోస, టొమాటో, ఆలుగడ్డ, వంకాయ, బెల్​ పెప్పర్స్​లో  లెక్టిన్​ ప్రొటీన్​ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రొటీన్​ ఉంది కదా అని వీటిని తినకుండా ఉండలేం. ఎందుకంటే వీటిలో లెక్టిన్​తో పాటు శక్తి, ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు చాలా ఉంటాయి. లెక్టిన్​ ప్రొటీన్​ నీటిలో కరుగుతుంది. 
అంటే లెక్టిన్​ ప్రొటీన్​ ఉన్న పప్పులు, కిడ్నీ బీన్స్ వంటి వాటి​ని నీళ్లలో నానబెట్టిన తర్వాతే వంటల్లో వాడాలి. 
బీన్స్​, నట్స్​ని ఉడకబెట్టి తినాలి. ఇలాచేస్తే వీటిలోని లెక్టిన్​ తగ్గిపోతుంది. వీటిని నానబెట్టి మొలకలు వచ్చాక తిన్నా కూడా లెక్టిన్​ ప్రభావం ఉండదు. 
వెజ్​టేరియన్స్​లోనే ఎక్కువ
ప్రొటీన్ల కోసం ఎగ్, నాన్​–వెజ్​, సోయా బీన్స్​ తింటారు చాలామంది. బీన్స్​ రకాల్లో ఉండేవి సెకండరీ గ్రేడ్​ ప్రొటీన్స్. లెక్టిన్​ ప్రొటీన్​లో ఇన్​ఫ్లమేషన్​కి కారణమయ్యే గుణాలు ఉంటాయి. అందరికీ లెక్టిన్​ ప్రొటీన్​తో సమస్య ఉండకపోవచ్చు. జీర్ణవ్యవస్థ సెన్సిటివ్​గా ఉన్నవాళ్లకి లెక్టిన్​  ఈజీగా డైజెషన్​ అవ్వదు. సోయాబీన్స్ కూడా అరగక అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు వీళ్లు. అయితే,  వెజ్​​, నాన్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెజ్​... రెండూ తినేవాళ్లకి లెక్టిన్​ ఉన్న ఫుడ్​తో ఏ సమస్యా ఉండదు.  
 ఇలా చేయాలి
జీర్ణానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నవాళ్లు లెక్టిన్​ ప్రొటీన్​ ఉన్న ఫుడ్​ తక్కువ తినాలి.  ఎందుకంటే వీళ్లకి లెక్టిన్​ ప్రొటీన్​ అరిగించుకునే శక్తి తక్కువ. అయితే, వీటిని మిగతా ఫుడ్స్​తో కలిపి తింటే సమస్య ఉండదు. వెజిటేరియన్​​ డైట్​ ఫాలో అయ్యేవాళ్లు మూడు పూటలా బీన్స్​ తినొద్దు. ​ డైట్​లో వారానికి రెండు సార్లు కిడ్నీ బీన్స్, ఇతర బీన్స్ ఉండేలా ప్లాన్​ చేసుకోవాలి. అప్పుడు కూడా ఉడకబెట్టినవే తినాలి. క్యాబేజి, బ్రకోలి, కాలీఫ్లవర్​, క్యారెట్స్​, పుట్టగొడుగులు, గుమ్మడికాయ వంటి లెక్టిన్–ఫ్రీ  ఫుడ్​ తినాలి. కిడ్నీబీన్స్​తో పాటు వేరే బీన్స్​ని కూడా ఉడకబెట్టి తింటే బెటర్​. జీర్ణపరమైన సమస్యలు ఉన్నవాళ్లు న్యూట్రిషనిస్ట్​ని కలిసి ఎలాంటి ఫుడ్​ తీసుకోవాలో తెలుసుకుంటే మరీ మంచిది.
                                                                                                                                                      - సుజాత స్టీఫెన్, ఛీఫ్​ న్యూట్రిషనిస్ట్​ యశోదా హాస్పిటల్స్​, హైదరాబాద్. 

జీర్ణాశయ బ్యాక్టీరియాకి మంచివి
అన్నిరకాల పోషకాలు తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అయితే, జింక్, మాంగనీస్​, సెలీనియం, ములిబ్డినం, కోబాల్ట్​ వంటి మైక్రోన్యూట్రియెంట్స్ ​ పప్పులు, కూరగాయల్లో దొరకవు. శరీరానికి వీటి  అవసరం తక్కువే అయినప్పటికీ, ఇవి కూడా డైట్​లో ఉండాల్సిందే. ఈ మైక్రోన్యూట్రియెంట్స్ అందాలంటే ​కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తినాలి.  వెజిటబుల్​ సలాడ్స్​, ఫ్రూట్స్​ ఎక్కువ తినడం వల్ల మూడు లాభాలుంటాయి. వీటిలో ఫుడ్​లో దొరకని పోషకాలు ఉంటాయి. వెజిటెబుల్స్​ని వండితే  వాటిలోని న్యూట్రియెంట్స్​ పోతాయి. మాంసంలోని ప్రొటీన్లు ఈజీగా డైజెస్ట్​ కావు. మొక్కల ప్రొటీన్లు తొందరగా జీర్ణమవుతాయి.  అందుకే చాలామంది ప్లాంట్​ ప్రొటీన్లు ఉన్న పండ్లు, కూరగాయలు తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్లాంట్​ ప్రొటీన్లు చిక్కుడు జాతి గింజల్లో ఎక్కువ. అలాగే కూరగాయలు, పండ్లలోని ఫైబర్​ జీర్ణాశయం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పచ్చి కూరగాయలు, పండ్లు  జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా పెరగ డానికి సాయపడతాయి కూడా. 
భోజనం​ తర్వాత వద్దు 
కొన్ని రకాల పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, మరికొన్నింటిలో విటమిన్​–సి, విటమిన్–ఇ,  కొన్నింటిలో నీళ్ల శాతం ఎక్కువ. అయితే బాగా తీపిగా ఉన్న  పండ్లు తింటే శరీరంలో ఫ్రక్టోజ్​ అనే కార్బొహైడ్రేట్​ లెవల్స్​ పెరుగుతాయి. శరీరం గ్లూకోజ్​ని మాత్రమే ఉపయోగించుకుంటుంది. దాంతో,  ఫ్రక్టోజ్​ని  కొలెస్ట్రాల్ లేదా యూరిక్​ యాసిడ్​గా మార్చేస్తుంది. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు, యూరిక్​ యాసిడ్​తో మూత్రాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బోజనం​ చేసిన వెంటనే పండ్లు తింటే అదనంగా వచ్చే షుగర్​ కొలెస్ట్రాల్​గా మారుతుంది. 
                                                                                                                                 - డాక్టర్​. రాహుల్​ అగర్వాల్​ కన్సల్టంట్​ జనరల్ మెడిసిన్​​,  కేర్​ హాస్పిటల్స్, హైదరాబాద్​.

Tagged health, food, life style, , gastrointestinal

Latest Videos

Subscribe Now

More News