పప్పు దినుసులసాగుకు ప్రోత్సాహం సున్నా.. పండించేందుకు వెనుకాడుతున్న రైతులు

పప్పు దినుసులసాగుకు  ప్రోత్సాహం సున్నా.. పండించేందుకు వెనుకాడుతున్న రైతులు

సంగారెడ్డి, వెలుగు: పప్పు దినుసులు పండిస్తే అధిక లాభాలు ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులకు ప్రోత్సాహం అందడం లేదు. సంగారెడ్డి జిల్లాలో పప్పు దినుసులకు, నూనె గింజల పంటలకు అనువైన నేలలు, ఆసక్తి చూపే రైతులు ఉన్నారు. కానీ, వారికి  సరైన ప్రోత్సాహం లేక రైతులు  పంటలు పండించేందుకు ముందుకు రావడం లేదు.  కొంత మంది రైతులు పంటల సాగు చేస్తున్నప్పటికీ వారికి విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. పంటలు వేయడానికి ఆసక్తి ఉన్నా.. వ్యవసాయ అధికారులు ప్రోత్సహించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దుతిరుగుడు, పల్లి ఇతరత్రా నూనె గింజలు, పప్పు దినుసుల వేసే పరిస్థితి ఉన్నా.. అధికారులు పట్టించుకోక పోవడం వల్ల చాలామంది రైతులు మక్క పంటనే సాగు చేస్తున్నారు.  

ఆ రెండు ప్రాంతాల్లో...

జిల్లాలో పప్పు దినుసుల ఉత్పత్తికి జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలు సారవంతమైన నేలలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో కందులు, మినుము, పెసర పంటలు ఎక్కువగా పండిస్తారు. ఈ పరిస్థితి సంగారెడ్డి, పటాన్ చెరు, అందోల్ ప్రాంతాల్లో కనిపించదు. ఈ క్రమంలో పంటల మార్పిడి కోసం ప్రయత్నించే రైతులను వ్యవసాయ శాఖ ప్రోత్సహించి ముందస్తు ఏర్పాట్లు కల్పించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పప్పు దినుసుల సాగు చేస్తే..  భూమి కూడా  సారవంతంగా ఉంటుందని ఇదివరకే అనేక పరిశోధనల్లో తేలింది. నూనె గింజల పంటలతో పాటు పప్పు దినుసుల సాగు పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రతి సీజన్ లో అధికారులు చెప్పుకుంటూ వస్తున్నా ప్రయోజనం ఉండడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు   ఏర్పాటు చేయాలి

నాకు ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత ఏడాది మినుములు, పెసర, కందులు వేశాను. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు  చాలా కష్టమైంది.  ఈ పంటలు లాభసాటిగా ఉంటాయి.  కష్టాలకు ఓర్చి సాగు చేస్తే సర్కారు కేంద్రాలు పెట్టలేదు. ఇక్కడ కొనేటోళ్లు లేక కర్ణాటకకు పోయి అమ్ముకొచ్చిన. ప్రతి ఏడాది అధికారులు కొనుగోలు కేంద్రాలు పెడితే పంటల విస్తీర్ణం పెరుగుతది.

- బేగరి రాములు, రైతు, నిజాంపేట

ప్రోత్సాహం లేకనే

నాకున్న ఎనిమిది ఎకరాల్లో గత ఏడాది వానకాలం సీజన్ లో 6 ఎకరాల్లో కంది, రెండు ఎకరాల్లో మినుము పంటలు వేశాను. కోత కోసే టైంలో అకాల వర్షాలకు పూర్తి పంట నష్టపోవాల్సి వచ్చింది. మార్కెటింగ్ సౌకర్యం లేక చాలా రోజులు పంట కోయక నష్టపోయాను. అందుకే ఈసారి పత్తి పంట వేయాలని మూడు రోజుల క్రితమే విత్తనాలు వేశాను. సరైన టైంలో విత్తనాలు, ఎరువులు లభించక.. మార్కెటింగ్ లేక చాలామంది రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపిస్తున్నారు.

–నల్లారి సోమయ్య, రైతు,ఆత్మకూర్