సర్కార్ చేతుల్లోకి ధరణి..టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

సర్కార్ చేతుల్లోకి ధరణి..టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
  • త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్​కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు
  • ఇప్పటికే సీజీజీతో సంప్రదింపులు.. ‘భూమాత’గా మారనున్న పేరు
  • భూరికార్డులు, రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు
  • విదేశీ కంపెనీ చేతుల్లో ధరణి ఉండడంపై గతంలో విమర్శలు
  • అక్టోబర్​లో టెర్రాసిస్ కాంట్రాక్టు ముగిసినా, మళ్లీ దానికే 
  • అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం

ధరణిపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర భూ రికార్డులు, రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్ ​నిర్వహణను ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నది. ప్రస్తుతం ధరణి పోర్టల్ నిర్వహణను విదేశీ కంపెనీ టెర్రాసిస్ చూస్తున్నది. ఈ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ నిర్వహణను చూస్తున్న సెంటర్​ఫర్​ గుడ్​గవర్నెన్స్ (సీజీజీ)కు ధరణి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నది. అట్లయితే భూ రికార్డులు, రైతుల సమాచారం భద్రంగా ఉంటుందని.. ఎలాంటి అక్రమాలకు తావుండదని భావిస్తున్నది. ఈ విషయమై సీజీజీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని సెక్రటేరియెట్​లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై గతంలో విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీతో టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ ముగిసినా, మళ్లీ అదే కంపెనీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను సర్కార్ సంస్థకు అప్పగించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది. పోర్టల్ పేరును కూడా ‘భూమాత’గా మార్చాలని భావిస్తున్నది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ధరణిని తీసుకొచ్చింది. అప్పటి నుంచే అనేక భూసమస్యలు రైతులను చుట్టుముట్టాయి. ఎప్పుడో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూములకు గతంలో అమ్మినోళ్ల పేర్లు రావడం.. కొన్నిచోట్ల పట్టా భూములు ప్రభుత్వ, అసైన్డ్​ భూములుగా నమోదుకావడం.. విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పట్టాభూములు నిషేధిత జాబితాలో చేరడం, పేర్లు తప్పుగా నమోదు కావడం, కొందరి భూములు అసలు ధరణిలోనే నమోదు కాకపోవడం వంటివి జరిగాయి. మూడేండ్లు గడిచినప్పటికీ చాలా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించలేదు. పైగా వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ ధరణి పోర్టల్​లోనే జరుగుతున్నాయి. దీంతో పోర్టల్​ డేటా మెయింటెయిన్​ చేస్తున్న కంపెనీ బ్యాక్​ ఎండ్​లో భూముల వ్యవహారాలను అటుఇటు చేసే అవకాశం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో ధరణి స్థానంలో ‘భూమాత’ పేరుతో పారదర్శకమైన వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ధరణి పోర్టల్, రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్​రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధరణిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోర్టల్​నిర్వహణ నష్టాల్లో ఉన్న కంపెనీకి అప్పగించడం, అది కాస్త విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లడంతో డేటా భద్రంగా ఉంటుందని ఎలా అనుకున్నారని అధికారులను సీఎం ప్రశ్నించారు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలోనే ధరణి పోర్టల్​నిర్వహణను సెంటర్​ఫర్​గుడ్​గవర్నెన్స్​కు అప్పగించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ముందు దివాలా కంపెనీకి..తర్వాత విదేశీ సంస్థకు.. 

భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్​మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్)కు సాఫ్ట్ వేర్ డిజైన్, డెవలప్ మెంట్, ఇంప్లిమెంటేషన్ కోసం 2018 జనవరి 8న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్ పీ)ను ఆహ్వానించింది. ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుని 2018 మేలో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్​ పేరును ధరణిగా నాటి సర్కారు మార్చింది. అదే ఐఎల్ఎఫ్ఎస్​ కంపెనీ ధరణి నిర్వహణ కూడా చూసుకున్నది. అయితే ఆర్ఎఫ్ పీలోని రూల్స్‌ ప్రకారం కంపెనీ దివాలా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ అగ్రిమెంట్ చేసుకున్న నాలుగు నెలలకే ఐఎల్ఎఫ్ఎస్ ​కంపెనీ డిఫాల్ట్ లిస్టులో చేరినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ మెజార్టీ వాటాను 2021 నవంబర్​లో సింగపూర్​కు చెందిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీకి రూ.1,275 కోట్లకు అమ్ముకుంది. దీంతో ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీలో మెజార్టీ వాటా కొనుగోలు చేసిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీ... దాని పేరును టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మార్చింది. టెర్రాసిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ ను 2021 డిసెంబర్ లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. ధరణిని టెర్రాసిస్ కంపెనీ నిర్వహిస్తుండగా, దానికి టెక్నాలజీ సపోర్ట్​ను క్వాంటెలా సంస్థ అందజేస్తున్నది. అయితే ఒప్పందం ప్రకారం ఇప్పుడు ధరణి టెర్రాసిస్ కంపెనీ చేతుల్లోనే ఉన్నది.