వనపర్తి డీఈవో ఆఫీస్​లో ఇద్దరు ఏడీలు!

వనపర్తి డీఈవో ఆఫీస్​లో ఇద్దరు ఏడీలు!
  • ఎవరి మాట వినాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న సిబ్బంది

వనపర్తి, వెలుగు : వనపర్తి డీఈవో ఆఫీస్ లో ఇద్దరు ఏడీలు ఉండడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులర్​ ఏడీ నరహరి లాంగ్​లీవ్​ అనంతరం ఎలాంటి ఉత్తర్వులు లేకుండా జాయిన్​ కావడం, ఇన్​చార్జి ఏడీగా పని చేస్తున్న సూపరింటెండెంట్​ విజయలక్ష్మికి రిలీవ్​ ఆర్డర్​ ఇవ్వకపోవడం ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇదిలాఉంటే మే 20 నుంచి లాంగ్​లీవ్​లో వెళ్లిన ఏడీ నరహరి జాయినింగ్  ఆర్డర్  లేకుండానే డ్యూటీకి వస్తున్నారు.

వాస్తవానికి నరహరి లాంగ్  లీవ్  కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో డైరెక్టర్  ఆఫ్  స్కూల్ ఎడ్యుకేషన్  ఆఫీసర్లు తిరిగి డ్యూటీలో జాయిన్  అయ్యే సమయంలో ఇన్​చార్జి డీఈవోగా బాధ్యతలు చేపట్టాలని ఆర్డర్  జారీ చేశారు. అప్పటి వరకు నాగర్ కర్నూల్  డీఈవో గోవిందరాజులుకు ఇన్​చార్జి డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. కానీ, ఎలాంటి ఆదేశాలు, రీ జాయినింగ్  ఆర్డర్  లేకుండానే విధులు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తోంది.

ఈ వ్యవహారంపై 12 రోజులుగా డీఈవో ఆఫీస్​లో పంచాయితీ నడుస్తోంది. తాను ఇన్​చార్జి ఏడీ బాధ్యతల నుంచి రిలీవ్  కాకుండానే ఏడీ నరహరి డ్యూటీ చేయడంపై సూపరింటెండెంట్​ విజయలక్ష్మి, ఆఫీస్​ సిబ్బంది విస్తుపోతున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్  తేజస్  నందలాల్ పవార్​ దృష్టికి తీసుకెళ్లడంతో, రీ జాయినింగ్  ఆర్డర్  లేకుండా ఎలా డ్యూటీ చేస్తున్నాడని ఇన్​చార్జి డీఈవో గోవిందరాజులుపై ఫోన్ లోనే సీరియస్​ అయినట్లు తెలిసింది.

డీఈవో ఆఫీస్​లో ఇద్దరు ఏడీలు పని చేస్తుంటే స్టాఫ్​ ఎవరి మాట వినాలో, ఎవరి వద్ద పనులు చేయించుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. డైరెక్టర్  ఆఫ్  స్కూల్  ఎడ్యుకేషన్  ఆఫీస్​లోని ఓ ఉన్నతాధికారి ఫోన్  ద్వారా ఆదేశాలివ్వడంతోనే ఇన్​చార్జి డీఈవో గోవింద రాజులు జాయిన్  చేసుకున్నట్లు విద్యాశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

రెగ్యులర్  ఏడీగా కొనసాగుతున్నా..

వ్యక్తిగత కారణాలతో ఎన్నికల ముందు లాంగ్  లీవ్ పై వెళ్లాను. మే 20న ఇన్​చార్జి డీఈవోతో మాట్లాడి ఏడీగా విధుల్లో చేరాను. ఇన్​చార్జి ఏడీగా వ్యవహరిస్తున్న సూపరింటెండెంట్ తో  నాకు ఎలాంటి సంబంధం ఉండదు. రెగ్యులర్  ఏడీని కాబట్టి డ్యూటీలో చేరాను.
-
  నరహరి, ఏడీ, వనపర్తి

బాధ్యతల నుంచి రిలీవ్  కాలేదు

రెగ్యులర్  ఏడీ సెలవులో ఉండడంతో మార్చి నెలలో ఏడీ(ఎఫ్ఏసీ) బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నా డ్యూటీ  చేస్తుండగానే గత నెల 20 నుంచి రెగ్యులర్  ఏడీ నరహరి ఆఫీస్ లో విధులకు హజరవుతూ అన్ని బిల్లులు ఆయనే చేస్తున్నారు. ఇప్పటివరకు ఏడీ బాధ్యతల నుంచి రిలీవ్  అయ్యేందుకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.

విజయలక్ష్మి, సూపరింటెండెంట్