
- ఇద్దరు డ్రగ్స్ సప్లయర్లతో పాటు 12 మంది కస్టమర్లు అరెస్ట్
- మరో 33 మంది కస్టమర్లను గుర్తించిన టీఎస్ న్యాబ్ పోలీసులు
హైదరాబాద్,వెలుగు : డ్రగ్స్‌కు బానిసలైన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గుట్టురట్టైంది. ఓ అపార్ట్‌మెంట్ అడ్డాగా డ్రగ్స్ దందా చేస్తుండగా.. టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీఎస్ న్యాబ్) ఛేదించింది. సోమవారం మీడియాకు టీఎస్ న్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి వివరాలు వెల్లడించారు. అమీర్‌పేట్ మైత్రివనం వద్ద డ్రగ్స్ విక్రయించే ఆశిక్ యాదవ్‌ను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద 2 ఎక్స్‌టసీ పిల్స్ ను పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఎస్‌ఆర్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. సోమవారం ఉదయం దాడి చేసి రాజేశ్ తోపాటు 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌ను అరెస్ట్ చేశారు. మరో 33 మంది డ్రగ్ కస్టమర్లను గుర్తించారు. 10 మందికి డ్రగ్ టెస్ట్‌లు చేయించారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది.
గోవాలో డ్రగ్స్ పార్టీలు, సిటీలో కస్టమర్లు
ఏపీలోని నెల్లూరు జిల్లా ఫతేఖాన్ పేటకు చెందిన జల్లి ఆశిక్ యాదవ్(26) గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్ వచ్చాడు. అమీర్‌పేట్‌లోని జీఎస్‌ఆర్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ ఓ ఎమ్‌ఎన్‌సీ లో బీపీఓగా జాబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్‌లో నెల్లూరుకు చెందిన అతని ఫ్రెండ్స్ దుడ్డు రాజేశ్, సాయిచరణ్ సిటీకి వచ్చారు. సాయిచరణ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సిటీలో తన గర్ల్ ఫ్రెండ్‌ను కలిసేందుకు వస్తుండేవాడు. అందరూ కలిసి 45 సార్లు గోవాకు కూడా వెళ్లారు. లిక్కర్, డ్రగ్స్ పార్టీలు చేసుకోగా.. సాయిచరణ్‌తో పాటు ఆశిక్ యాదవ్, రాజేశ్‌లు గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారారు.
పబ్స్, రేవ్, కిట్టీ పార్టీలకు సప్లై
డ్రగ్స్ కోసం ఈజీ మనీ కోసం ప్లాన్ చేశారు. ఆశిక్ యాదవ్ జూన్‌లో జాబ్‌ను వదిలేశాడు. రాజేశ్‌తో కలిసి డ్రగ్స్ సప్లై చేయడం ప్రారంభించాడు. గోవాలో బాబా వద్ద ఎక్స్‌టసీ పిల్స్ కొనుగోలు చేసి సిటీకి తెచ్చేవారు. కస్టమర్లకు సాయిచరణ్‌ను కూడా సప్లయర్‌గా మార్చారు. అమీర్‌పేట్‌లోని హాస్టల్ విద్యార్థులు, ఐటీ ఎంప్లాయీస్ ను టార్గెట్ చేసుకుని, నెల్లూరుతో పాటు సిటీలోనూ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. పబ్స్ లో కస్టమర్లకు డ్రగ్స్ అమ్మేవారు. రేవ్ పార్టీలు, కిట్టీ పార్టీలకు ఆర్డర్స్‌పై అందించే వారు. ఒక్కో ఎక్స్‌టసీ పిల్‌ను రూ.1000 కొనుగోలు చేసి డిమాండ్‌ను బట్టి రూ.4000 వరకు అమ్ముతున్నారు. అమీర్‌పేట్‌లోని మైత్రివనం పరిసర ప్రాంతాల్లోనూ విక్రయించేవారు.
న్యూ ఇయర్ టార్గెట్‌గా డ్రగ్స్ పార్టీలు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను క్యాష్ చేసుకోవాలనుకుని ఈనెల 12న ఆశిక్ యాద్, రాజేశ్, సాయిచరణ్ గోవాకు వెళ్లారు. డ్రగ్ పెడ్లర్ బాబా వద్ద రూ.60 వేలతో 60 ఎక్స్‌టసీ పిల్స్ కొనుగోలు చేశారు. ముగ్గురు 20 పిల్స్ చొప్పున పంచుకున్నారు. ఆశిక్ తన వద్ద ఉన్న పిల్స్‌లో 18 అమ్మాడు. మరో 2 పిల్స్‌ను తన వద్దనే ఉంచుకున్నాడు. నెల్లూరుకు చెందిన సంపత్ ఎస్సార్‌నగర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్నారు.
ఇందులో రాజేశ్ సప్లయ్ చేసిన డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారు. డ్రగ్స్ పార్టీలో ఉప్పల్‌కు చెందిన హృతిక్, శ్రీరామ్, సహా నెల్లూరుకు చెందిన మరో 19 మంది పాల్గొన్నారు. డ్రగ్ సప్లయర్స్ ఆశిక్ యాదవ్, రాజేశ్‌లను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు. 40 ఎక్స్ టసీ పిల్స్, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ పేరుతో నంబర్ ప్లేట్ ఉన్న స్కోడా కారును సీజ్ చేశారు.