ఉక్రెయిన్ నగరాలపై రష్యా ముమ్మర దాడులు

ఉక్రెయిన్ నగరాలపై రష్యా ముమ్మర దాడులు

ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఏకధాటిగా బాంబులు, మిసైల్స్ తో నివాస భవనాలపై దాడులు చేస్తున్నాయి. కొరకరాని కొయ్యగా మారిన రాజధాని కీవ్ నగరంలోని మెట్రో స్టేషన్ పై బాంబుల వర్షం కురిపించింది రష్యా సైన్యం. పేలుళ్లలో లుక్యానివ్స్కా స్టేషన్ దెబ్బతిందని ట్వీట్ చేసింది కీవ్ మెట్రో నెట్ వర్క్స్. రష్యాకు చెందిన 4 హెలికాప్టర్లు, ఒక విమానం, క్రూయిజ్ క్షిపణిని తమ బలగాలు కూల్చివేశాయని తెలిపింది ఉక్రెయిన్.
రష్యా విధ్వంసం సృష్టించడంతో మరియుపోల్ సిటీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసినా శిధిల భవనాలు, వాటి నుంచి విడుదలవుతున్న పొగతో స్మశాన వాతావరణం నెలకొంది. రష్యా విధ్వంసంలో మరియుపోల్ సిటీలో ఇప్పటివరకు దాదాపు 2,500 మందికిపైగా మరణించినట్లు తెలిపారు ఉక్రెయిన్  అధ్యక్ష సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్. మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 
రాజధాని కీవ్ నగరంపై రష్యా సేనల ముప్పేట దాడి
గత 20 రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు నిర్వహిస్తున్న రష్యా.. రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే దిశగా దాడులు ముమ్మరం చేసింది రష్యా. ఉదయం స్వియాటోషిన్ స్కీ డిస్ట్రిక్ లోని 16 ఫ్లోర్ల బిల్డింగ్ పై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 27 మందిని రక్షించామన్నారు అధికారులు. సోమవారం స్థానికంగా ఓ నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు చనిపోయారని, పది మందికిపైగా గాయపడ్డారని  తెలిపింది ఉక్రెయిన్ అత్యవసర సేవావిభాగం తెలిపింది. మరోవైపు దాడుల కారణంగా కీవ్ సమీపంలోని అంటోనోవ్  ఏవియేషన్  ఇండస్ట్రీ పార్క్  మంటల్లో చిక్కుకుంది.

రష్యా ముమ్మర దాడుల నేపథ్యంలో జలెన్ స్కీ కీలక నిర్ణయం

ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టి ఇష్టానుసారం దాడులు చేస్తున్న రష్యా నిన్నటి నుంచి దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మరో 30 రోజులపాటు మార్షల్ లా పొడగించేలా బిల్లు ప్రవేశపెట్టారు అధ్యక్షుడు జెలెన్ స్కీ. మార్చి 26 నుంచి ఈ చట్టాన్ని మరోసారి పొడగించాలని బిల్లులో పేర్కొన్నట్లు తెలిపాయి స్థానిక మీడియా సంస్థలు. రిజర్వ్ బలగాల కోసం 18 నుంచి 60 ఏళ్లలోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ వదిలి వెళ్లేందుకు అనుమతి లేదని ప్రకటించారు జెలెన్ స్కీ.

రష్యా చుట్టుముట్టిన ప్రాంతాల్లో తొమ్మిది మానవతా కారిడార్లు ఏర్పాటు

రష్యా బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి సామాన్య పౌరుల తరలింపునకు 9 మానవతా కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్ చుక్. మరియుపోల్ నగరానికి సహాయ సామగ్రి చేరవేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. రివ్నే ప్రాంతంలో టీవీ టవర్ పై రష్యా జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 19కి చేరిందన్నారు స్థానిక గవర్నర్ విటాలి కోవల్. మరో వైపు రష్యాతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చలు ముగిశాయి. వాళ మరో విడత చర్చలు జరగనున్నాయని తెలిపింది ఉక్రెయిన్ ప్రభుత్వం. రష్యా తమ ప్రతిపాదనల్ని జాగ్రత్తగా విన్నట్లు తెలిపింది ఉక్రెయిన్ ప్రభుత్వం.
 

ఇవి కూడా చదవండి

కర్నాటక హైకోర్టు తీర్పుపై కాశ్మీర్ మాజీ సీఎం అసంతృప్తి

ఉక్రెయిన్ నుంచి వచ్చిన స్టూడెంట్ల కోసం కీలక ప్రకటన

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్